3 Roses Review: 3 రోజెస్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!

బాలీవుడ్ సిరీస్ “4 మోర్ షాట్స్” తరహాలో తెలుగులో తెరకెక్కిన సిరీస్ “3 రోజెస్”. పూర్ణ-ఈషా-పాయల్ టైటిల్ పాత్రల్లో తెరకెక్కిన ఈ 4 ఎపిసోడ్ల సిరీస్ కి మాగి దర్శకురాలు. మారుతి కథ అందించిన ఈ సిరీస్ కి ఎస్.కె.ఎన్ నిర్మాత. కాస్త బోల్డ్ గా తెరకెక్కిన ఈ సిరీస్ నేడు (నవంబర్ 12) ఆహా యాప్ లో విడుదలైంది. మరి ఈ సిరీస్ మన నెటిజన్స్ కు నచ్చిందో లేదో చూద్దాం..!!

కథ: ఇంట్లో తల్లి బాధ పడలేక పెళ్ళిచూపులకి వచ్చిన ప్రతివాడు వేసే యక్ష ప్రశ్నలు భరిస్తూ టైమ్ పాస్ చేసే ఆధునిక యువతి రీతూ (ఈషా రెబ్బ), పెళ్ళికి ముందు డేటింగ్ లో తప్పేముంది అనుకునే అత్యాధునిక యువతి జాహ్నవి (పాయల్ రాజ్ పుట్), 30 ఏళ్ళు వచ్చినా తన ఆఫీస్ లో తనకంటే చిన్నోడైన యువకుడు తనను ప్రేమిస్తున్నానంటూ వెంటాడుతుంటే.. ఏం చేయాలో పాలుపోక తిప్పలు పడే పడతి ఇందు (పూర్ణ). ఇలా ముగ్గురు ఆడోళ్ళు తమ జీవితాలు ఎటు పయనిస్తున్నాయో తెలియని తికమకలో ఒక్ బార్ లో కలుస్తారు. ఆ పరిచయం ఎటు వైపుకు దారితీసింది అనేది “3 రోజెస్” కథాంశం.

నటీనటుల పనితీరు: పూర్ణ పాత్రతో ఫన్ క్రియేట్ చేయాలనుకుని చేసిన అతి కాస్త చిరాకు పెడుతుంది. కాకపోతే.. ఆమె నటిగా కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకుంది. ఈషా రెబ్బ పాత్ర కంటే ఆమె నటన బాగుంది. మేకప్ విషయంలో ఆమె ఇంకాస్త కేర్ తీసుకొని ఉంటే బాగుండేది. పాయల్ పాత్రను బోల్డ్ డైలాగులు, ముద్దు సీన్లకు పరిమితం చేశారు. ఒక ముఖ్య పాత్రను ఆమె బాయ్ ఫ్రెండ్ తో చేయించడంతో రొమాన్స్ ఇంకాస్త బాగా పండిందని చెప్పాలి. వైవా హర్ష కామెడీ కాస్త ఊరట. సత్యం రాజేష్, గోపరాజు రమణ, సరయు, రవివర్మలు తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.

సాంకేతికవర్గం పనితీరు: మారుతి రాసిన కథలో ఆయన మార్క్ కామెడీ మిస్ అయ్యింది. కొన్ని బోల్డ్ సీన్స్ వరకూ పర్వాలేదు కానీ.. ఓవరాల్ గా పెద్దగా ఆకట్టుకోలేదనే చెప్పాలి. దర్శకుడు మ్యాగి చాలా వరకూ బాలీవుడ్ సిరీస్ లు “4 మోర్ షాట్స్, మేడ్ ఇన్ హెవెన్” సీన్ కంపోజిషన్స్ ను పోలి ఉంటుంది. అందువల్ల ఆల్రెడీ ఒటీటీల్లో ఈ తరహా సినిమాలు, సిరీస్ లు చూసేసిన వాళ్ళకు ఇది పెద్ద ఆసక్తి కలిగించదు. సినిమాటోగ్రఫీ, సంగీతం, ప్రొడక్షన్ డిజైన్ సోసోగా ఉన్నాయి.

విశ్లేషణ: ఏదో ఒకలా సిరీస్ లా ఈ కథను సాగదీయాలనే ఉద్దేశ్యం ఆడియన్స్ మీద రుద్దకుండా.. సింపుల్ గా ఓ రెండు గంటల సినిమాలా తీసి ఉంటే ఈ “3 రోజెస్” ఇంకాస్త బెటర్ గా ఆకట్టుకునేది. అనవసరమైన సాగతీత కారణంగా యూత్ ను, అక్కరకు లేని బోల్డ్ డైలాగ్స్ & సీన్స్ వల్ల ఫ్యామిలీ ఆడియన్స్ ను అలరించలేక మూడు రోజాలు వాడిపోయాయి.

రేటింగ్: 1.5/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus