3BHK Review in Telugu: 3BHK సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • సిద్ధార్థ్ (Hero)
  • చైత్ర అచార్ (Heroine)
  • ఆర్.శరత్ కుమార్, దేవయాని, మీటా రఘునాథ్ తదితరులు.. (Cast)
  • శ్రీ గణేష్ (Director)
  • అరుణ్ విశ్వ (Producer)
  • అమృత్ రామనాథ్ (Music)
  • దినేష్ బి.కృష్ణన్ - జితిన్ (Cinematography)
  • గణేష్ శివ (Editor)
  • Release Date : జూలై 04, 2025
  • శాంతి టాకీస్ (Banner)

“చిన్నా” విజయంతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన సిద్ధార్థ్ హీరోగా నటించిన తాజా చిత్రం “3BHK”. మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కల ఆధారంగా రూపొందిన చిత్రమిది. ట్రైలర్ మంచి కంటెంట్ ఉన్న సినిమా అనిపించగా.. క్యాస్టింగ్ కూడా పాజిటివ్ బజ్ తీసుకొచ్చింది. మరి టార్గెట్ ఆడియన్స్ ను ఆకట్టుకోగలిగిందా? లేదా? అనేది చూద్దాం..!!

3BHK Review in Telugu

కథ: ఒక కంపెనీలో అకౌంటెంట్ గా పనిచేసే వాసుదేవన్ (శరత్ కుమార్)కి ఎప్పటికైనా తన ఇద్దరు బిడ్డలతో కలిసి మూడు బెడ్ రూమ్స్ ఉన్న ఒక సొంత ఫ్లాట్ లో గృహప్రవేశం చేసుకోవాలనేది కల. ఆ కలను తాను స్వయంగా నెరవేర్చుకోలేకపోతాడు, దాంతో తన కొడుకు ప్రభు (సిద్ధార్థ్) అయినా నెరవేరుస్తాడేమో అనుకుంటాడు.

ఆల్రెడీ ఇష్టం లేని చదువు, సంతోషం లేని ఉద్యోగం చేస్తూ నలిగిపోతున్న ప్రభుకి ఇల్లు కొనడం అనేది బంధీ అయిపోతానేమో అనే ఫీలింగ్.

ఈ ఆర్థిక ఇబ్బందులు, మధ్యతరగతి మనస్తత్వం, వరుసబెట్టి వచ్చే సమస్యల నడుమ వాసుదేవన్ & ఫ్యామిలీ సొంతింటి కలను నెరవేర్చుకోగలిగారా? లేదా? అనేది “3BHK” కథాంశం.

నటీనటుల పనితీరు: డీ-ఏజింగ్ టెక్నాలజీ గట్రాలు వాడకుండానే టెన్త్ క్లాస్ కుర్రాడిగా ఒదిగిపోయాడు సిద్ధార్థ్. అలాగే.. కుటుంబ బాధ్యతలు, తండ్రి సంతోషం కోసం తన ఆశలు, ఆశయాలు చంపుకునే ఓ సగటు మధ్యతరగతి కొడుకుగా సిద్ధార్థ్ నటనకి చాలా మంది రిలేట్ అవుతారు.

బాధ్యతగల మంచి తండ్రిగా శరత్ కుమార్ తన సీనియారిటీని మరోసారి చాటుకున్నారు. దేవయాని స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ.. ఆమెకు కూడా కొన్ని డైలాగ్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అనిపించింది. కన్నడ నటి చైత్ర ఆచార్ చాలా ఒద్దికగా నటించింది. “గుడ్ నైట్” ఫేమ్ మీటా రఘునాథ్ కూడా తన పాత్రలో ఒదిగిపోయింది. సపోర్టింగ్ క్యాస్ట్ కూడా మంచి నటనతో ఆకట్టుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గా సినిమా మీద ఎలాంటి కంప్లైంట్స్ లేవు. ముఖ్యంగా ఎడిటర్ ను మెచ్చుకోవాలి. దాదాపుగా సినిమా మొత్తం రెండుమూడు ఇళ్లలోనే జరుగుతుంది. అయితే.. అక్కడ కూడా రిపీటెడ్ ఫ్రేమ్స్ లేకుండా జాగ్రత్తపడ్డాడు. సినిమాటోగ్రఫీ వర్క్ చాలా రియలిస్టిక్ గా ఉంది. అందుకు ఆర్ట్ డిపార్ట్మెంట్ ను కూడా ప్రశంసించాలి.

దర్శకుడు శ్రీ గణేష్ ఎంచుకున్న కోర్ పాయింట్ అనేది ప్రతి ఒక్క కుటుంబానికి కనెక్ట్ అయ్యేదే. కచ్చితంగా ఇల్లు కొనుక్కున్నవాళ్ల, కొనుక్కోవాలనుకుంటున్నవాళ్లు ఈ కథకి కనెక్ట్ అవుతారు. అయితే.. డ్రామా పండించడంలో మాత్రం కథనాన్ని కాస్త ఎక్కువగా సాగదీశాడు. సందర్భాలు, సన్నివేశాలు రియలిస్టిక్ గానే ఉన్నప్పటికీ.. ఎండింగ్ కాస్త సినిమాటిక్ గా అయిపోయింది. ఇల్లు ఎలా కొనగలిగాడు అనేది కూడా చూపించి ఉంటే బాగుండేది. ఎందుకంటే.. సినిమా కోర్ పాయింటే అది కాబట్టి. అయితే.. ఎక్కడ నెగిటివ్ ఎండింగ్ ఇస్తాడో అని భయపడిన ప్రేక్షకులను మరీ ఎక్కువ టెన్షన్ పెట్టకుండా.. హ్యాపీ ఎండింగ్ తో ముగించిన విధానం కాస్త రిలీఫ్ ఇచ్చింది.

విశ్లేషణ: ఒక 3BHK ఫ్లాట్ కొనుక్కోవడం అనేది ప్రతి ఒక్కరి కల. అయితే.. పెరుగుతున్న రేట్లు, ఆకాశాన్ని అంటుతున్న ట్యాక్సులు ఆ కలను మధ్యతరగతి నుండి దూరం చేస్తున్నాయి. అయినప్పటికీ.. ప్రతి ఒక్కరూ ఎప్పటికైనా ఇల్లు కొనాలనే ధ్యేయంతోనే బ్రతుకుతూ ఉంటారు. ఆ పాయింట్ ను కథాంశంగా తీసుకొని తెరకెక్కిన 3BHK చిత్రం కచ్చితంగా టార్గెట్ ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుంది. అయితే.. స్క్రీన్ ప్లే మరీ నత్తనడకలా సాగడం, కొన్ని ఎమోషన్స్ కి సరైన జస్టిఫికేషన్ లేకపోవడం గట్రాలు మైనస్ అని చెప్పొచ్చు. వాటిని అధిగమిస్తే మాత్రం 3BHK ఒక సంతృప్తిని, సంతోషాన్నిస్తుంది.

ఫోకస్ పాయింట్: మధ్యతరగతి కుటుంబాల సొంతింటి కలకు రియాలిటీ చెక్!

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus