త్రీడీలో తెలుగు సినిమా.. ఇది ఎంతో మంది కల. అయితే దీన్ని సాకారం చేసే క్రమంలో పెద్ద పెద్ద నిర్మాణ సంస్థలు, దర్శకులు చివరి వరకు ప్రయత్నించి ఆశించిన ఫలితం అందుకోలేకపోయారు. ఒకరిద్దరు ఈ ప్రయత్నంలో ఓ అడుగు ముందుకేసి సినిమాను థియేటర్ల వరకు తెచ్చినా ఆ సినిమాకు ఆశించినట్లు ఫుట్‌ఫాల్స్ రాలేదు. ఒకవేళ వచ్చినా ఉసూరుమంటూ తిరిగి ఇళ్లకు వెళ్లిన సందర్భాలున్నాయి. దానికి కారణం మేకింగ్‌లో నాణ్యత, థియేటర్ల స్క్రీన్ క్వాలిటీ. ఈ ఇబ్బందులు ఇప్పటికీ తెలుగు సినిమాలో అలానే ఉన్నాయి. ఈ సమయంలో బోయపాటి శ్రీను ఈ రిస్క్ చేయబోతున్నారు.
‘అఖండ 2: తాండవం’ సినిమాతో సినీప్రియులకు ఓ కొత్త అనుభూతిని అందివ్వాలనే ఉద్దేశంలో ఉన్నారు సినిమా టీమ్. సినిమాను 3డీ వెర్షన్‌లోనూ విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. డిసెంబరు 5 నుండి సినిమాను సరికొత్త టెక్నాలజీతో త్రీడీలోనూ చూడొచ్చు అని టీమ్ ఘనంగా చెప్పింది. ఈ చిత్రం భారత దేశ ఆత్మ, పరమాత్మ. ఇది మన దేశ ధర్మం, ధైర్యం. అందుకే ఈ సినిమాని దేశమంతా చూడాలనుకుంటున్నా అని దర్శకుడు బోయపాటి శ్రీను తెలిపారు. సినిమా కోసం కొన్ని రోజుల క్రితం ప్రచారాన్ని ముంబయి నుండి ప్రారంభించామని తెలిపారు.

భారతీయ చిత్ర పరిశ్రమలోనే గొప్ప అనుభూతిని పంచే సినిమాల్లో ఒకటిగా ‘అఖండ 2: తాండవం’ సినిమా నిలవనుంది. సినిమా కథకు ఉన్న స్కేల్‌కి, స్థాయికి 3డీలో చేస్తేనే బాగుంటుంది అనుకున్నాం. విజువల్‌గా ప్రేక్షకులకు గొప్ప అనుభూతిని అందించే ప్రయత్నం చేయాలనుకున్నాం అని నిర్మాత అంటున్నారు. ఇక్కడ ఒకట్రెండు తెలుగు త్రీడీ సినిమాల పేర్లు ప్రస్తావించి వారిని ఇబ్బందిపెట్టడం ఇష్టం లేదు కానీ.. ఇండస్ట్రీ హిట్‌గా నిలిచన సినిమాల త్రీడీ వెర్షన్లు కూడా సరైన ఫలితం అందుకోలేదు. ఇంకొన్ని సినిమాలైతే ఆ త్రీడీ సరిగ్గాలేకే కథ బాగున్నా ఇబ్బందికర ఫలితం అందుకున్నాయి. మరి బోయపాటి ఎలా హ్యాండిల్ చేస్తారో చూడాలి.
