పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) మరోసారి ఇండియన్ సినిమా స్థాయిని పెంచే ప్రాజెక్ట్‌తో రాబోతున్నాడు. హను రాఘవపూడి (Hanu Raghavapudi) దర్శకత్వంలో రూపొందుతోన్న ‘ఫౌజీ’ సినిమా ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారింది. ఇప్పటికే పీరియాడిక్ లవ్ & వార్ డ్రామా అని ప్రకటించడంతో పాటు 1940ల నేపథ్యంలో కథ నడుస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాలో ప్రభాస్ సైనికుడి పాత్రలో కనిపించనున్నాడు. ఈ కథలోని భావోద్వేగాలు, యాక్షన్ ఎలిమెంట్స్ అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటాయని చిత్రబృందం విశ్వాసం వ్యక్తం చేస్తోంది.
మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి (Mithun Chakraborty) ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చేసిన కామెంట్స్ ఈ సినిమాపై మరింత క్రేజ్ పెంచేశాయి. ఆయన మాట్లాడుతూ “ఫౌజీ సినిమా బడ్జెట్ దాదాపు రూ.700 కోట్లు. ఇది ఇండియాలోనే అత్యంత ఖరీదైన సినిమాల్లో ఒకటిగా నిలుస్తుంది” అన్నారు.
ఇదే సమయంలో ప్రభాస్ తన కోసం డేట్స్ మార్చుకోవడం తనను ఎమోషనల్‌గా టచ్ చేసిందని చెప్పడం విశేషం. ఈ చిత్రంలో మిథున్‌తో పాటు జయప్రద (Jaya Prada) కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. హీరోయిన్గా ఇమాన్వి అనే ఇంటర్నేషనల్ డాన్సర్‌ను తీసుకోవడం మరో విశేషం. రొమాంటిక్ వార్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో దేశభక్తి, ప్రేమ, త్యాగం అనే థీమ్‌లు బలంగా నిలవనున్నాయి. ఇప్పటికే కొన్ని ముఖ్యమైన ఘట్టాల చిత్రీకరణ పూర్తయినట్లు సమాచారం.
త్వరలో ప్రభాస్ కూడా మరో.కీలకమైన యాక్షన్ షెడ్యూల్ లో జాయిన్ కానున్నారు. ప్రస్తుతం ప్రభాస్ “ది రాజా సాబ్” (The Raja saab) వంటి ప్రాజెక్ట్స్‌ను పూర్తిచేసే పనిలో ఉన్నాడు. తర్వాతి షెడ్యూల్‌లో “ఫౌజీ” షూటింగ్ మరింత స్పీడ్ గా కొనసాగనుంది. ఈ సినిమా రిలీజ్‌పై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేకపోయినప్పటికీ, 2026లో విడుదలకు ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఒకవేళ రూ.700 కోట్ల బడ్జెట్‌తో రూపొందితే, ఇది ప్రభాస్ కెరీర్‌లోనే కాక, ఇండియన్ సినిమా చరిత్రలోను ఓ కీలక రికార్డ్ గా నిలవడం ఖాయం.