777 Charlie Review: 777 చార్లీ సినిమా రివ్యూ & రేటింగ్!

  • June 10, 2022 / 08:12 AM IST

కన్నడ ఇండస్ట్రీలోని మోస్ట్ ప్రామిసింగ్ హీరోల్లో ఒకరైన రక్షిత్ శెట్టి కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “777 చార్లీ”. ఓ లాబ్రడార్ డాగ్ టైటిల్ పాత్ర పోషించిన ఈ చిత్రం ట్రైలర్ తోనే విశేషమైన అంచనాలను క్రియేట్ చేసింది. ముఖ్యంగా జంతు ప్రేమికులు ఈ చిత్రం కోసం ఎప్పట్నుంచో వెయిట్ చేస్తున్నారు. మరి సినిమా ఆకట్టుకుంటుందో లేదో చూద్దాం..!!

కథ: చిన్నప్పుడే తల్లిదండ్రులు మరియు తోబుట్టువుని ఓ యాక్సిడెంట్లో కోల్పోయి.. ఒంటరిగా పెరుగుతాడు ధర్మ (రక్షిత్ శెట్టి). ఇల్లు, ఫ్యాక్టరీ తప్ప ఏమీ తెలియకుండా బ్రతికేస్తుంటాడు. అలా ఒంటరిగా జీవితాన్ని సాగిస్తున్న ధర్మ జీవితంలోకి సడన్ ఎంట్రీ ఇస్తుంది చార్లీ (లాబ్రడార్ డాగ్). చార్లీ ఎంట్రీతో ధర్మ జీవితంలో ఎలాంటి మార్పులు వచ్చాయి? ధర్మ-చార్లీ కలిసి చేసిన ప్రయాణం ఏ తీరానికి చేరింది? అనేది “777 చార్లీ” కథాంశం.

నటీనటుల పనితీరు: సినిమా మొత్తాన్ని తన భుజస్కంధాలపై మోశాడు రక్షిత్ శెట్టి. అతను మంచి నటుడు అనే విషయం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే.. ఈ చిత్రంలో తన ఎమోషన్స్ ను ఒక డాగ్ తో కలిసి పండించడం అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే.. ఎంత ట్రైనింగ్ ఇచ్చిన డాగ్ అయినా.. కెమెరా ముందు చెప్పినట్లు వినదు.

సో, దర్శక బృందంతోపాటు, సదరు శునకంతో కుస్తీ పడుతూ నటించిన రక్షిత్ శెట్టి ఓపికను కూడా ప్రశంసించాల్సిందే. పాత్ర చిన్నదే అయినప్పటికీ.. హీరోయిన్ సంగీత ఆకట్టుకుంది. రాజ్ బి శెట్టి డాగ్ డాక్టర్ గా తన కామెడీ టైమింగ్ తో అలరించాడు.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు కిరణ్ రాజ్ దర్శకత్వ ప్రతిభ కంటే.. అతడి సహనాన్ని-ఓపికను ముందుగా మెచ్చుకోవాలి. చార్లీ అనే డాగ్ తో అత్యద్భుతమైన ప్రదర్శన చేయించడమే కాక.. ప్రేక్షకుల్ని ఆమె ఎమోషన్స్ లో లీనం చేశాడు. కథకుడిగా కాస్త తడబడినా.. దర్శకుడిగా మాత్రం ఘన విజయం అందుకున్నాడు కిరణ్ రాజ్.

సంగీత దర్శకుడు నోబిన్ నేపధ్య సంగీతంతో పర్వాలేదనిపించుకున్నాడు. అయితే.. సన్నివేశంలోని డెప్త్ ను ఎలివేట్ చేయడంలో విఫలమయ్యాడు. అరవింద్ కశ్యప్ సినిమాటోగ్రఫీ సినిమాకి మరో ప్లస్ పాయింట్. డాగ్ కళ్లను భలే హృద్యంగా క్యాప్చ్యూర్ చేశాడు. ప్రొడక్షన్ వర్క్ & ఆర్ట్ వర్క్ బాగుంది కానీ.. సీజీ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్త తీసుకోవాల్సింది. ఎంతో హృద్యమైన సన్నివేశం యావరేజ్ సీజీ వర్క్ వల్ల తేలిపోయింది.

విశ్లేషణ: కేవలం జంతు ప్రేమికులను మాత్రమే కాదు.. సున్నిత మనస్కులైన ప్రతి ఒక్కర్నీ విశేషంగా ఆకట్టుకునే చిత్రం “777 చార్లీ”. పెట్ ఓనర్స్ & లవర్స్ ను మాత్రం ఏడిపించేస్తుందీ “చార్లీ”. చిన్నపాటి తప్పిదాలున్నప్పటికీ.. చార్లీ కళ్ళల్లో కనిపించే అమాయకత్వం, కరుణ ముందు అవి కనిపించవు.

రేటింగ్: 3/5

Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus