800 Review in Telugu: 800 సినిమా రివ్యూ & రేటింగ్!

  • October 6, 2023 / 09:57 AM IST

Cast & Crew

  • మధుర్ మిట్టల్ (Hero)
  • మహిమా నంబియార్ (Heroine)
  • నాజర్, వేళా రామమూర్తి, శరత్ లోహితస్వ, నారియన్ తదితరులు.. (Cast)
  • ఎం.ఎస్.శ్రీపతి (Director)
  • వివేక్ రంగాచారి (Producer)
  • జిబ్రాన్ (Music)
  • ఆర్.డి.రాజశేఖర్ (Cinematography)
  • Release Date : అక్టోబర్ 06, 2023

ధోనీ, సచిన్, కపిల్ దేవ్ ల బయోపిక్ ల అనంతరం సినిమాగా తెరకెక్కిన మరో క్రికెటర్ బయోపిక్ “800”. శ్రీలంక స్పిన్ బౌలర్ ముత్తయ్య మురళీధరన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమా తమిళంలో తెరకెక్కగా.. ప్రఖ్యాత నిర్మాణ సంస్థ శ్రీదేవి ఫిలిమ్స్ బ్యానర్ పై శివలెంక కృష్ణప్రసాద్ తెలుగు ప్రేక్షకులకు అనువాద రూపంలో అందించారు. ఎమోషనల్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూడాలి..!!

కథ: శ్రీలంకలో పుట్టినా.. అక్కడ తమిళుడిగా చిన్నప్పటినుండి వేర్పాటు చవిచూస్తాడు మురళీధరన్ (మధుర్ మిట్టల్). సింహళులు & తమిళుల గొడవల కారణంగా తల్లిదండ్రులతో గడపాల్సిన బాల్యం హాస్టల్ గోడలకు పరిమితమవుతుంది. క్రికెట్ మీద ఆసక్తి ఉండడంతో గల్లీ క్రికెట్ లో బౌలర్ గా ప్రయాణం మొదలెట్టి.. ఇంటర్నేషనల్ గేమ్ రేంజ్ కు ఎదుగుతాడు.

అయితే.. చిన్నప్పుడు తన అస్తిత్వాన్ని నిరూపించుకోవాల్సి వచ్చి ఇబ్బందిపడిన మురళీధరన్.. క్రికెట్లో అంపైర్ల ముందు తన బౌలింగ్ స్టైల్ ను ప్రూవ్ చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అలా జీవితం మొత్తం ఏదో ఒక విషయంలో నిరూపించుకోవాల్సిన పరిస్థితుల నుంచి విజేతగా ఎలా ఎదిగాడు? అనేది “800” కథాంశం.

నటీనటుల పనితీరు: మురళీధరన్ గా మధుర్ మిట్టల్ తన బాడీ లాంగ్వేజ్ నుంచి హావభావాల వరకూ ప్రతీ విషయాన్ని చాలా జాగ్రత్తగా మార్చుకున్న విధానం ప్రశంసనీయం. నిజంగా మురళీధరన్ ఇలానే ఉండేవాడేమో అనిపిస్తుంది. ఆ స్థాయిలో క్యారెక్టర్ లో ఒదిగిపోయాడు మధుర్ మిట్టల్. సిన్సియర్ జర్నలిస్ట్ గా నాజర్ సినిమాకి మంచి వేల్యూడ్ యాడ్ చేశారు.

మహిమా నంబియార్ పాత్ర చిన్నదే అయినప్పటికీ.. కనిపించిన కొద్దిసేపు ఆమె స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది. అందరి కంటే ముఖ్యంగా అర్జున్ రణతుంగగా నటించిన వ్యక్తి అదరగొట్టాడు. మిగతా పాత్రధారులందరూ పర్వాలేదనిపించుకున్నారు.

సాంకేతికవర్గం పనితీరు: జిబ్రాన్ నేపధ్య సంగీతం సినిమాకి మెయిన్ ఎస్సెట్. ఎమోషనల్ సీన్స్ & ఎలివేషన్ సీన్స్ కి మంచి ఎంగేజింగ్ బీజీయమ్ తో అలరించాడు. ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ బాగుంది. కానీ.. వి.ఎఫ్.ఎక్స్ వర్క్ విషయంలో ఇంకాస్త జాగ్రత్తపడాల్సింది. ముఖ్యంగా గ్రీన్ మ్యాట్ షాట్స్ చాలావరకు తేలిపోయాయి. ముఖ్యంగా ధోనీ & కపిల్ దేవ్ బయోపిక్ ల క్వాలిటీ చూశాక.. “800” కాస్త తక్కువ స్థాయిలో కనిపిస్తుంది. ఎడిటింగ్ ఫార్మాట్ బాలేదు. ముఖ్యంగా కనీస స్థాయి ట్రాన్శిషన్స్ లేకపోవడం మైనస్ గా మారింది.

ఇక దర్శకుడు శ్రీపతి పనితనం గురించి మాట్లాడుకోవాలి. ముత్తయ్య మురళీధరన్ కెరీర్ లో అతడు చవిచూసిన విజయాల మీద కంటే అపజయాలు మరియు అతడి స్ట్రగుల్ మీద ఎక్కువ శ్రద్ధ పెట్టాడు. అలాగే.. అతడి క్యారెక్టరైజేషన్ ను ఎలివేట్ చేసిన విధానం బాగుంది. ముఖ్యంగా.. తనను వేరు చేసిన సింహళుల ద్వారా తన పేరు లిస్ట్ లో ఉందని తెలుసుకొనే సన్నివేశాన్ని కంపోజ్ చేసిన విధానం బాగుంది. అలాగే.. మురళీధరన్ తనను తాను ఒక సింహళుడిగా & తమిళుడిగా కాకుండా ఒక క్రికెటర్ గా చూసుకొన్న విధానం ఆకట్టుకుంటుంది.

అలాగే.. బౌలింగ్ రూల్స్ ను ఎలా ఎదురీదాడు? అనే విషయాన్ని తెరకెక్కించిన విధానం కూడా బాగుంది. మరీ ముఖ్యంగా.. ఒక క్రికెటర్ గా మురళీధరన్ కు శ్రీలంక్ కెప్టెన్ అర్జున రణతుంగ ఎలా సపోర్ట్ ఇచ్చాడు? అనేది తెరపై చూపించిన విధానం ఆకట్టుకుంటుంది. అయితే.. శ్రీపతికి కాస్త మంచి బడ్జెట్ ఇచ్చి ఉంటే.. ఇంకాస్త మంచి క్వాలిటీ సినిమా ఇచ్చేవాడు అనిపించింది.

విశ్లేషణ: ఒక క్రికెటర్ గా ఎవ్వరూ పడనన్నీ ఇబ్బందులు పడ్డవాడు ముత్తయ్య మురళీధరన్. బయోపిక్ లో ఒక క్రికెటర్ లో అతడి ఎదుగుదల కంటే.. వ్యక్తిగా అతను ఎదుర్కొన్న ఇబ్బందులను తెరకెక్కించిన తీరు సినిమాటిక్ గా బాగా వర్కవుటయ్యింది. అలాగే.. క్రికెట్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా రెగ్యులర్ సినిమా ఆడియన్స్ ను ఆకట్టుకొనే అంశాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. ఇక క్రికెట్ ను ఇష్టపడేవారికి ఈ బయోపిక్ విశేషంగా నచ్చుతుంది. పలు క్రికెట్ సీజన్స్ జరిగిన విధానం, అంపైర్ల సిస్టమ్ ప్లేయర్స్ కు ఎంత ఇబ్బంది కలిగిస్తుంది అని చెప్పిన తీరు, కొన్ని చిన్నపాటి రూల్స్ కారణంగా క్రికెటర్ల కెరీర్లు ఎలా నాశనమవుతున్నాయి వంటివి బాగా చూపించారు. “800” మురళీధరన్ ఎమోషనల్ జర్నీ మాత్రమే కాదు.. క్రికెటర్ గా ఎదగాలి అనుకొనే ప్రతి ఒక్కరికీ ఎంతో స్పూర్తినిచ్చే సినిమా.

రేటింగ్: 2.75/5

Click Here To Read in ENGLISH

Rating

2.75
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus