కర్ణుడి మరణానికి వెయ్యి కారణాలు అన్నట్లు.. ఒక సినిమా ఎందుకు హిట్ అవుతుంది అనేందుకు కూడా లక్ష కారణాలు ఉంటాయి. ఒక భాషలో హిట్ అయ్యింది కదా అని సంకలు గుడ్డుకుని వేరే భాషలో తీస్తే ఆ సినిమా హిట్ అవ్వడం పక్కన పడితే డిజాస్టర్ అయిన సందర్భాలు కోకొల్లలు. అందుకు రీసెంట్ ఎగ్జాంపుల్ “కిరాక్ పార్టీ”. కన్నడలో బ్లాక్ బస్టర్ హిట్ అయిన ఈ చిత్రం తెలుగులో మాత్రం డిజాస్టర్ అయ్యింది. అప్పట్నుంచి వేరే భాషలో సూపర్ హిట్ అయిన సినిమాలను తెలుగులో రీమేక్ చేయాలంటే భయపడుతున్నారు మన తెలుగు హీరోలు.
రీసెంట్ తమిళ బ్లాక్ బస్టర్ “96” పరిస్థితి కూడా అలాగే తయారయ్యింది. తమిళంలో విజయ్ సేతుపతి-త్రిష జంటగా రూపొందిన ఈ ప్యూర్ లవ్ స్టోరీ అక్కడ సంచలన విజయం సొంతం చేసుకోవడంతో దిల్ రాజు రీమేక్ రైట్స్ దక్కించుకొన్నాడు. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేద్దామని ఏ హీరో దగ్గరకి వెళ్ళినా కూడా “క్లైమాక్స్ మార్చండి, సేడ్ ఎండింగ్ వద్దు” అంటున్నారట. సినిమాకి చాలా కీలకమైన ఆ క్లైమాక్స్ ను మార్చడానికి దర్శకుడు మాత్రం ఒప్పుకోవడం లేదు. సో, ఆ పాయింట్ దగ్గర సినిమా తెలుగు రీమేక్ ఆగిపోయింది. మరి క్లైమాక్స్ ఏమైనా మార్చి తెలుగులో తీస్తారా లేక ఒరిజినల్ వెర్షన్ లో ఛేంజెస్ ఏమీ చేయకుండా తెరకెక్కిస్తారా అనేది తెలియాల్సి ఉంది.