సినిమా వాళ్ళ పై అభిమానులు తమ అభిమానాన్ని రకరకాలుగా చూపిస్తుంటారు. కొందరు వారి పుట్టినరోజు నాడు సోషల్ మీడియాలో విపరీతంగా పోస్టులు పెడుతూ ఉంటారు. వాళ్ళ సినిమాలు ఉద్యమంలా చూస్తుంటారు. ఇంకొంతమంది అయితే వారి పేరుపై అన్నదానాలు, రక్తదానాలు చేస్తుంటారు. తమిళనాడులో కుష్బూ, నయనతార, హన్సిక వంటి హీరోయిన్లకి అయితే గుడి కట్టేసిన సందర్భాలు కూడా ఉన్నాయి.
అలాంటి పిచ్చి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వరకు పాకింది అని చెప్పాలి. ఓ అభిమాని తన ఫేవరెట్ హీరోయిన్ కోసం గుడి కట్టేశాడు. విషయం ఏంటంటే… బాపట్లలో సమంతకి (Samantha) ఓ వీరాభిమాని ఉన్నాడు. సమంత కోసం అతను ఏకంగా ఒక గుడి కట్టేశాడు. ‘ది టెంపుల్ ఆఫ్ సమంత’ అనేది ఆ గుడి పేరు. అందులో బంగారు రంగులో సమంత విగ్రహాన్ని పెట్టాడు.
ఈరోజు అనగా ఏప్రిల్ 28న సమంత పుట్టినరోజు కావడంతో ఈ ఆలయమందు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాడు. సమంత విగ్రహం ముందు కేక్ కట్టింగ్ చేయించి అన్నదానం కూడా చేశాడు. దీనికి సంబంధించిన వీడియో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
‘సినిమా వాళ్లపై ఈ అతి ఆరాధన అవసరమా.. నిలువనీడ లేకుండా, తిండి లేకుండా చాలా మంది ఉన్నారు. అలాంటి వాళ్ళ కోసం ఏదైనా చేయొచ్చు కదా. పోనీ వాళ్ళ కోసం కాకపోయినా నీ తల్లిదండ్రులకు ఏమైనా చేయవచ్చు కదా?’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.