తెలుగు, తమిళం, ఇతర దక్షిణాది భాషల్లో 100కు పైగా సినిమాల్లో నటించిన సౌందర్య 12 సంవత్సరాలు నటిగా ఒక వెలుగు వెలిగారు. డాక్టర్ కావాలనుకున్న సౌందర్య ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం చదువుతున్న సమయంలోనే గంధర్వ సినిమాలో నటించారు. కోడి రామకృష్ణ డైరెక్షన్ లో తెరకెక్కిన అమ్మోరు సినిమా తరువాత సౌందర్యకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు రావడంతో ఆమె సినిమాలకు దూరమయ్యారు. చనిపోయే వరకు సౌందర్య గ్లామరస్ రోల్స్ కు దూరంగానే ఉన్నారు.
సౌందర్య అసలు పేరు సౌమ్య కాగా ఈమె బెంగళూరులో జన్మించారు. స్టార్ హీరో వెంకటేష్ కు జోడీగా సౌందర్య ఎక్కువ సినిమాల్లో నటించారు. తెలుగులో దాదాపు అందరు స్టార్ హీరోలతో సౌందర్య నటించారు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే సౌందర్య ఆరు ఫిల్మ్ ఫేర్ పురస్కారాలను అందుకున్నారు. ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో హీరోయిన్ గా నటించిన సౌందర్యకు డైరెక్షన్ చేయాలనే కోరిక ఉండేది. చనిపోయే నాటికి సౌందర్య వయస్సు కేవలం 31 సంవత్సరాలే కావడం గమనార్హం.
2003 సంవత్సరం ఏప్రిల్ నెల 27వ తేదీన సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయిన రఘును సౌందర్య వివాహం చేసుకున్నారు. చనిపోయే నాటికి సౌందర్య రెండు నెలల గర్భవతి. గర్భవతి అయిన తరువాత సౌందర్య సినిమాలకు గుడ్ బై చెప్పాలని భావించారు. కానీ అంతలోనే ప్రమాదం జరగడంతో సౌందర్య మనల్ని విడిచి వెళ్లిపోయారు. తెలుగులో సౌందర్య నటించిన చివరి సినిమా నర్తనశాల కాగా బాలకృష్ణ ఈ సినిమాకు దర్శకత్వం వహించారు. సౌందర్య మరణంతో ఈ సినిమా షూటింగ్ ఆగిపోగా గతేడాది బాలకృష్ణ 17 నిమిషాల నిడివితో కూడిన నర్తనశాల సినిమాను ఏటీటీలో విడుదల చేశారు.