ప్రముఖ దర్శకనిర్మాత గుణ్ణం గంగరాజు తనయుడు అశ్విన్ గంగరాజు దర్శకుడిగా పరిచయమవుతూ తెరకెక్కించిన చిత్రం “ఆకాశవాణి”. రెగ్యులర్ కమర్షియల్ సినిమాలకి భిన్నంగా రూపొందిన ఈ చిత్రం నేడు (సెప్టెంబర్ 24) సోనీ లైవ్ యాప్ లో విడుదలైంది. ఇద్దరుముగ్గురు తప్ప ఆల్మోస్ట్ క్యాస్టింగ్ అందరూ కొత్తవారే. మరి ఈ ప్రయోగం ఎలాంటి ఫలితాన్నిచ్చిందో చూద్దాం..!!
కథ: ఓ మారుమూల అటవీ ప్రాంతం. ఆ చిన్నపాటి గ్రామంలో నివసించే వాళ్ళందరికీ ఒకడే దేవుడు, వాడే దొర (వినయ్ వర్మ). పాపం ఆ ఊరి జనాలకు భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన విషయం కూడా తెలియదు. వాళ్ళ అమాయకత్వాన్ని బానిసత్వంగా మార్చుకుని వాళ్లకు తెలియకుండానే వాళ్ళతో సంఘ విద్రోహ చర్యలు చేయిస్తూ, మరోపక్క తన కుమారుడి ఆరోగ్యం కోసం చేతబడులు, క్షుద్రపూజలు చేయిస్తూ.. ఆ ఊరి ప్రజలను నరబలి చేస్తుంటాడు.
ఈ మారణహోమం నుండి ప్రజలను కాపాడడానికి దేవుడు దిగి వచ్చాడా? వస్తే ఏ రూపంలో వచ్చాడు? దొర బారి నుండి ప్రజలు ఎలా తప్పించుకున్నారు? వంటి ఆసక్తికరమైన ప్రశ్నలకు సమాధానమే “ఆకాశవాణి” చిత్రం.
నటీనటుల పనితీరు: కొందరు తెలిసినవారు, కొందరు తెలియనివారు.. ఊరి ప్రజలుగా, అమాయక మహారాజులుగా అందరూ అదరగొట్టారు. ప్రతి ఒక్కరి పాత్రలోనే కాదు వారి కళ్ళల్లోను అమాయకత్వం కనిపిస్తుంది. కాసేపు నిజంగానే ఓ కుగ్రామంలో ప్రజల్లా కనిపించారు నటీనటులంతా. బాధ్యతగల గవర్నమెంట్ ఉద్యోగిగా సముద్రఖని, దొరగా వినయ్ వర్మ, విలన్ గా తేజ, చిన్న కామిక్ రోల్లో గెటప్ శ్రీను ఆకట్టుకున్నారు.
సాంకేతికవర్గం పనితీరు: కెమెరామెన్ సురేష్ పనితనాన్ని మెచ్చుకోవాలి. ఓ రెండు గంటలపాటు ఊర్లో కూర్చున్న భావన కలిగించాడు తన పనితనంతో. లైటింగ్ & కలరింగ్ విషయంలో తీసుకున్న జాగ్రత్త ప్రశంసార్హం. ప్రొడక్షన్ డిజైనింగ్ టీమ్ ను మెచ్చుకోవాలి. ప్రీప్రొడక్షన్ లో ప్లానింగ్ బాగా చేసుకోవడంతో ఆర్ట్ వర్క్ & ప్రొడక్షన్ డిజైన్ లో అది ఎలివేట్ అయ్యింది. కాలభైరవ తన సంగీతంతో సినిమాకి మరింత వేల్యూ యాడ్ చేసాడు. ఎమోషన్స్ ను నేపధ్య సంగీతంతో ఎలివేట్ చేసిన విధానం బాగుంది.
దర్శకుడు అశ్విన్ గంగరాజు తండ్రి బాటలోనే విభిన్నమైన కథను ఎంచుకున్న విధానం బాగుంది. అయితే.. కథనం పరంగా ఇంకాస్త జాగ్రత్త తీసుకొని ఉండాల్సింది. సినిమాకి చాలా ముఖ్యమైన మొదటి 20 నిమిషాలు కథను ఎస్టాబ్లిష్ చేయడం కోసం మరీ ఎక్కువ టైం తీసుకున్నాడు. కథలో మలుపులు మొదలయ్యేసరికి సినిమా మీద ఆసక్తి సన్నగిల్లుతుంది. అయితే.. సెకండాఫ్ లో మాత్రం టెంపోను అద్భుతంగా మైంటైన్ చేసాడు.
సినిమా ముగింపులో ఖలేజా ఛాయలు కాస్త కనిపించాయి కానీ.. అశ్విన్ “దేవుడు” అనే కాన్సెప్ట్ ను బాగా డీల్ చేసాడు. అమాయకత్వంతో ఉండే దైవత్వాన్ని ఎలివేట్ చేసిన విధానం బాగుంది. అయితే.. దర్శకుడిగా కంటే కథకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు అశ్విన్ గంగరాజు.
విశ్లేషణ: రెగ్యులర్ & రొటీన్ కమర్షియల్ సినిమాలు చూసి చూసి బోర్ కొట్టిన ప్రేక్షకులకు దొరికిన ఒక మంచి సమాధానం “ఆకాశవాణి”. ఫస్టాఫ్ & క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ ఇంకాస్త క్రిస్పీగా ఉండుంటే మరింత మంది ఆడియన్స్ కు రీచ్ అయ్యేది. అయినప్పటికీ.. మొదటి ప్రయత్నంలో చిత్రబృందం సక్సెస్ అయినట్లే. సో, సోనీలైవ్ యాప్ లో స్ట్రీమ్ అవుతున్న “ఆకాశవాణి” చిత్రాన్ని కుటుంబంతో కలిసి ఒకసారి హ్యాపీగా చూసేయండి.
రేటింగ్: 2.5/5