తమిళంలో వచ్చిన ‘విక్రమ్ వేద’ సినిమా ఎంత పెద్ద సక్సెస్ అందుకుందో తెలిసిందే. మాధవన్, విజయ్ సేతుపతి ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమాని భార్యాభర్తలు పుష్కర్-గాయత్రి కలిసి డైరెక్ట్ చేశారు. ఆసక్తికరమైన స్టోరీ, ఉత్కంఠభరిత స్క్రీన్ ప్లేతో ఈ సినిమా విమర్శకుల ప్రశంసలు అందుకుంది. దీంతో ఈ సినిమాను రీమేక్ చేయాలని చాలా మంది ప్రయత్నించారు. తెలుగులో కూడా ఈ సినిమా రీమేక్ ఉంటుందని ప్రచారం జరిగింది. కానీ దాని ఊసే లేదు. హిందీలో ప్రముఖ దర్శకుడు నీరజ్ పాండే ఈ సినిమా రీమేక్ హక్కులు సొంతం చేసుకున్నాడు.
ఒరిజినల్ వెర్షన్ లో మాధవన్ చేసిన పోలీస్ పాత్రకు సైఫ్ అలీ ఖాన్ ను ఎన్నుకున్నారు. అయితే సినిమాలో మరో కీలకమైన రోల్ విజయ్ సేతుపతి పాత్రలో ఎవరు నటిస్తారనేది తేలలేదు. ఈ ఏడాది ఆరంభంలో ఆమిర్ ఖాన్ ఆ పాత్రకు ఖరారైనట్లు వార్తలు వచ్చాయి. మార్చిలో షూటింగ్ మొదలవుతుందని.. ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాతో పాటే ఆమిర్ ఈ సినిమాలో కూడా నటిస్తాడని అన్నారు. కానీ కరోనా కారణంగా షూటింగ్ కి బ్రేక్ పడింది. లాక్ డౌన్ తరువాత ఆమిర్ లాల్ సింగ్ చద్దా షూటింగ్ లో పాల్గొంటున్నాడు.
త్వరలోనే ఈ సినిమాను పూర్తి చేసి ‘విక్రమ్ వేద’ షూటింగ్ లో పాల్గొంటాడని అందరూ అనుకున్నారు. కానీ ఇప్పుడు ఆమిర్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నట్లు తెలుస్తోంది. స్క్రిప్ట్ నచ్చక తప్పుకున్నాడా..? లేదా డేట్లు సర్దుబాటు చేయలేక వదులుకున్నాడా ..? అనే విషయంలో క్లారిటీ లేదు కానీ ఆయన మాత్రం ఈ ప్రాజెక్ట్ ని పక్కన పెట్టేసినట్లు సమాచారం. దీంతో ఇప్పుడు ఆమిర్ కి బదులుగా ఎవరిని తీసుకోవాలనే విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతున్నారు మేకర్స్.