ఆమిర్ ఖాన్‌ను అందరూ మిస్టర్ పర్‌ఫెక్ట్ అంటారు. అది ఆయన సినిమాల్లో నటనను చూసి, సినిమా అంటే ప్రాణం పెట్టే ఆయన తత్వాన్ని ఆయన వ్యవహార శైలి చూసి అంటుంటారు. అందులో మొదటి రెండు మనం చాలాసార్లు వెండితెర మీద చూశాం. ఇంకా చూస్తాం కూడా. ఇక మూడోది వ్యవహారశైలి. ‘లవ్‌స్టోరీ’ ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఆమిర్ తనదైన శైలిలో వ్యవహరించి… అందరి మెప్పు పొందారు. ఇంతకీ ఏమైందంటే…ఆడియో ఫంక్షన్లు, ప్రీ రిలీజ్ ఈవెంట్లు జరిగినప్పుడు ఆఖరులో చీఫ్‌గెస్ట్‌లు, ఆ సినిమా హీరోల కలసి ఓ కాంబినేషన్ పోజు ఇవ్వడం ఆనవాయితీ.
స్టేజ్ మీద సెంటర్‌లోకి వచ్చి… ఫొటోగ్రాఫర్లకు పోజు ఇస్తారు. ‘లవ్‌స్టోరీ’ ఈవెంట్‌లోనూ అలానే జరిగింది. నాగచైతన్య, చిరంజీవి, ఆమిర్ ఖాన్ కలసి స్టేజ్ ముందుకు వచ్చారు. ఇక ఫొటోగ్రాఫర్లు క్లిక్‌లు కొట్టడమే ఆలస్యం అనుకునేలోపు… ఆమిర్ ఖాన్ ఆగమన్నాడు. చిరంజీవిని సెంటర్‌కు రమ్మని పిలిచారు. ఇందులో ఏముంది అంటారా. ఏ రంగమైనా అత్యధిక గౌరవం పొందేవాళ్లు ఇలాంటి ఫొటోల్లో సెంటర్‌లో ఉండాలి అంటుంటారు. ఆమిర్ ఖాన్ కన్నా చిరంజీవి సీనియర్.
భారతీయ సినిమా చరిత్రలో గొప్పవ్యక్తి. అందుకే ఆమిర్ ఖాన్… చిరంజీవిని మధ్యలోకి రమ్మన్నారు. అది చిరంజీవికి ఆమిర్ ఖాన్ ఇచ్చిన సముచిత గౌరవం. దీంతో ఈ మొత్తం ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అందుకే ఆమిర్ ఖాన్‌ను మిస్టర్ పర్‌ఫెక్ట్ అని అంటుంటారు మరి.