Aarambham Movie Review in Telugu: ఆరంభం సినిమా రివ్యూ & రేటింగ్!

Cast & Crew

  • మోహన్ భగత్ (Hero)
  • సురభి ప్రభావతి (Heroine)
  • రవీంద్ర విజయ్, లక్ష్మణ్ మీసాల, భూషణ్ కల్యాణ్ తదితరులు.. (Cast)
  • అజయ్ నాగ్ (Director)
  • అభిషేక్ వి.తిరుమలేష్ (Producer)
  • సింజిత్ ఎర్రమిల్లి (Music)
  • దేవ్ దీప్ గాంధీ (Cinematography)
  • Release Date : మే 10, 2024

ఓ కన్నడ నవల “నీను నిన్నొలాగే ఖైదీ” ఆధారంగా సినిమాటోగ్రాఫర్ టర్నడ్ డైరెక్టర్ అజయ్ నాగ్ తెరకెక్కించిన చిత్రం “ఆరంభం”. మోహన్ భగత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ & ట్రైలర్ మంచి బజ్ క్రియేట్ చేశాయి. ప్రీమియర్ షోస్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. తక్కువ బడ్జెట్ లో తెరకెక్కిన ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ ఎలా ఉందో చూద్దాం..!!

కథ: మిగేల్ (మోహన్ భగత్) హత్య కేసులో ఉరిశిక్ష పడి.. ఆంధ్రప్రదేశ్ లోని “కాలఘాటి” కారాగారంలో ఉంటాడు. సరిగ్గా రేపు ఉదయం అతడ్ని ఉరి తీయాలి అనగా జైలు నుండి ఎవరికీ కనిపించకుండా తప్పించుకుంటాడు. అసలు తప్పించుకొనే ఛాన్స్ లేని ఆ కారాగారం నుండి మిగేల్ ఎలా తప్పించుకొన్నాడు? అనే కోణంలో చేతన్ (రవీంద్ర విజయ్) ఇన్వెస్టిగేషన్ మొదలవుతుంది. జైల్లో మిగేల్ స్నేహితుడైన గణేష్ (మీసాల లక్ష్మణ్)టు కూర్చుని కేస్ స్టడీ చేయడం మొదలెడతాడు.

ఈ క్రమంలో మిగేల్ డైరీ ఆధారంగా అతడి జీవితంలోని కొన్ని నమ్మశక్యం కాని విషయాలు తెలుస్తాయి. ఏమిటా విషయాలు? మిగేల్ జైల్ నుండి ఎలా తప్పించుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానం తెలియాలంటే “ఆరంభం” చూడాల్సిందే!

నటీనటుల పనితీరు: ఒక మంచి పాత్ర దొరకాలే తన సత్తా చాటుకోగల అతికొద్ది మంది నటుల్లో మోహన్ భగత్ ఒకడు. థియేటర్ ఆర్టిస్ట్ అయిన మోహన్ “కేరాఫ్ కంచరపాలెం”లో చూపిన ప్రతిభకు చాలా మంది ఫిదా అయ్యారు. “ఆరంభం”లోను అదే స్థాయి నటనతో మిగేల్ పాత్రను అద్భుతంగా పండించాడు మోహన్. మదర్ సెంటిమెంట్ సీన్స్ లో ఎక్కడా అతి చేయకుండా చాలా సహజంగా సదరు సన్నివేశాలను పండించిన తీరు ప్రశంసార్హం.

ప్రొఫెసర్ పాత్రలో “అర్జున్ రెడ్డి” ఫేమ్ భూషణ్ కళ్యాణ్ సైన్స్ లో చాలా టిపికల్ పాయింట్స్ ను సింపుల్ గా వివరిస్తూ ఆకట్టుకున్నాడు.

రవీంద్ర విజయ్ స్క్రీన్ ప్రెజన్స్ & సుప్రీత సత్యనారాయణ్ గ్రేస్ సినిమాకి ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి. లక్ష్మణ్ మీసాల కామెడీ టైమింగ్ & డైలాగ్ డెలివరీ ప్రేక్షకుల్ని నవ్వించగా.. స్వచ్ఛమైన అమాయకపు తల్లిగా సురభి ప్రభావతి ఒదిగిపోయింది. ఆమె పాత్రలో చాలా మంది తమ మాతృమూర్తులను చూసుకొంటారు.

సాంకేతికవర్గం పనితీరు: దేవ్ దీప్ గాంధీ సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్ అని చెప్పాలి. రిపీటెడ్ సీన్స్ ఉన్నప్పటికీ.. వాటిని తెరకెక్కించిన విధానంలో వేరియేషన్ చూపించడంతో మళ్ళీ మళ్లీ అదే సీన్ చూస్తున్నామనే భావన ప్రేక్షకులకు రాదు. ఎస్.ఎఫ్.ఎక్స్ వరకూ మ్యానేజ్ చేసారు కానీ.. వి.ఎఫ్.ఎక్స్ విషయంలో మాత్రం చిత్రబృందం పెద్ద జాగ్రత్తపడలేదు. బడ్జెట్ లేక కావచ్చు, సమయం లేక కావచ్చు. సైన్స్ ఫిక్షన్ కథ అనుకున్నప్పుడు గ్రాఫిక్స్ ఆకట్టుకునే స్థాయిలో ఉండడం అనేది చాలా ముఖ్యం. ఈ విషయాన్ని బృందం తమ తదుపరి చిత్రం విషయంలోనైనా దృష్టిలో పెట్టుకొంటే మంచిది.

సంగీత దర్శకుడు సింజిత్ కీలకమైన సన్నివేశాల్లో నిశ్శబ్దాన్ని సంగీతంగా వినియోగించుకున్న విధానం బాగుంది. అలాగే.. పాటలను రకరకాల మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్ తో నింపేయకుండా.. సాహిత్యం వినిపించేలా కంపోజ్ చేసిన విధానం ఆకట్టుకుంది. ఈ కుర్రాడికి ఇది మొదటి సినిమా అంటే నమ్మడం కష్టమే. సినిమాని, సినిమాలోని ఎమోషన్ & సెంటిమెంట్ ను అర్థం చేసుకొని, అది ఎలివేట్ అయ్యేలా నేపథ్య సంగీతాన్ని రూపొందించాడు సింజిత్.

సౌండ్ డిజైనర్ మనికా ప్రభును కూడా మెచ్చుకోవాలి. ఫస్టాఫ్ లో ఉత్సుకత పెంచడంలో ఇతగాడి పనితనం కీలకపాత్ర పోషించింది. చాలా చిన్న చిన్న సౌండ్స్ ను కథా గమనానికి వినియోగించుకున్న విధానం బాగుంది.

దర్శకుడు అజయ్ నాగ్ లిమిటెడ్ క్యారెక్టర్స్ లో టైమ్ లైన్ అనేది ఎక్కడా ప్రాజెక్ట్ చేయకుండా.. ప్రేక్షకులకు మరీ లాజికల్ ఎక్స్ ప్లనేషన్స్ ఇవ్వాల్సిన పని లేకుండా “ఇన్ఫినిటీ & టైమ్ లూప్” వంటి కీలకాంశాలను చాలా సింపుల్ గా వివరించిన విధానం ఆకట్టుకుంది. ముఖ్యంగా “డేజా వు” కాన్సెప్ట్ ను వివరించిన తీరు సగటు ప్రేక్షకుడికి అర్థమయ్యేలా ఉండడం ప్లస్ పాయింట్ అని చెప్పాలి. స్క్రీన్ ప్లే & కొన్ని సన్నివేశాలు “ఇన్సెప్షన్” అనే హాలీవుడ్ చిత్రాన్ని గుర్తుకు తెచ్చినప్పటికీ.. సదరు సన్నివేశాలను తెరకెక్కించిన తీరులో కొత్తదనం ఉండడం ప్లస్ అయ్యింది.

అయితే.. ఈ టైమ్ లూప్ కు స్టార్టింగ్ పాయింట్ ఏమిటి? దాన్ని ఎలా సెట్ చేసారు? అనే అంశానికి సమాధానం చెప్పి ఉంటే బాగుండేది. అయితే.. సీన్ కంపోజిషన్ లో ఆర్టిస్టిక్ టచ్ తోపాటు కమర్షియాలిటీ ఉండేలా చూసుకున్న విధానం బాగుంది. సో, దర్శకుడిగా, కథకుడిగా అజయ్ నాగ్ డెబ్యూతో మంచి మార్కులు సంపాదించాడనే చెప్పాలి.

విశ్లేషణ: రెగ్యులర్ కమర్షియల్ సినిమాలు కాకుండా కొత్తగా ఏదైనా చూద్దామని తపించే తెలుగు ప్రేక్షకులను మెప్పించే చిత్రం “ఆరంభం”. సైన్స్ ఫిక్షన్ కదా అని ఫిజిక్స్ టెక్స్ట్ బుక్స్ పట్టుకొని థియేటర్లలో కూర్చోవాల్సిన అవసరం లేకుండా చాలా సింపుల్ గా లాజికల్ గా “డేజా వు” కాన్సెప్ట్ ను వివరించిన తీరు, దర్శకుడు అజయ్ నాగ్ టేకింగ్, దేవ్ దీప్ సినిమాటోగ్రఫీ వర్క్, మోహన్ భగత్ & సురభి ప్రభావతి సహజమైన నటన కోసం “ఆరంభం” చిత్రాన్ని కచ్చితంగా చూడాలి. ఈ తరహా ప్రయోగాత్మక చిత్రాలను చూడకుండా.. తెలుగులో మంచి సినిమాలు రావట్లేదు అని బాధపడితే లాభం ఉండదు మాష్టారు!

ఫోకస్ పాయింట్: ఆకట్టుకునే సైంటిఫిక్ థ్రిల్లర్ “ఆరంభం”.

రేటింగ్: 2.5/5

Rating

2.5
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus