విష్ణు విశాల్ నటించి, నిర్మించిన తాజా చిత్రం “ఆర్యన్”. గతవారం తమిళానట విడుదలై యావరేజ్ టాక్ తెచ్చుకున్న ఈ చిత్రాన్ని ఇవాళ (నవంబర్ 07) తెలుగులో విడుదల చేశారు. మర్డర్ మిస్టరీ థ్రిల్లర్ సినిమాల టెంప్లేట్ ను బ్రేక్ చేసిన సినిమాగా చెప్పబడుతున్న ఈ చిత్రం తెలుగు ప్రేక్షకుల్ని ఏమేరకు ఆకట్టుకుందో చూద్దాం..!!
కథ: ఆత్రేయ (సెల్వరాఘవన్) అనే ఓ రచయిత టీవీ చానల్ లైవ్ డిబేట్ లో తనను తాను గన్ తో షూట్ చేసుకుని చనిపోతూ.. తాను అయిదు రోజుల్లో అయిదుగుర్ని హత్య చేస్తానని, వాళ్ల పేర్లు గంట ముందు రివీల్ చేస్తానని చెబుతాడు.
అసలు చనిపోయిన వ్యక్తి ఎలా హత్యలు చేస్తాడు? అనే కేస్ ను డీల్ చేయడానికి రంగంలోకి దిగుతాడు సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ నంది (విష్ణు విశాల్).
ఆ అయిదుగుర్ని నంది కాపాడగలిగాడా? అసలు చనిపోయిన ఆత్రేయ, అంత పర్ఫెక్ట్ గా మర్డర్స్ ని ఎలా ఎగ్జిక్యూట్ చేయగలిగాడు? ఇంతకీ ఆ అయిదుగురు ఎవరు? వంటి ప్రశ్నలకి సమాధానమే “ఆర్యన్” చిత్రం.
నటీనటుల పనితీరు: సెల్వరాఘవన్ ఎంత టెర్రిఫిక్ యాక్టర్ అనేది మరోసారి రుజువైన సినిమా ఇది. సీరియస్ గా సిన్సియారిటీని పలికించడం అనేది అంత సింపుల్ విషయం కాదు. సెల్వరాఘవన్ మాత్రం ఆ విషయంలో ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఈ సినిమాలోనూ అదే విధంగా ఆకట్టుకున్నాడు.
విష్ణు విశాల్ కి పోలీస్ పాత్రలు అనేవి వెన్నతో పెట్టిన విద్య. ఈ సినిమాలోనూ సిన్సియర్ పోలీస్ గా డీసెంట్ పెర్ఫార్మెన్స్ తో అలరించాడు.
శ్రద్ధా శ్రీనాథ్, మానస చౌదరి హీరోయిన్లుగా కేవలం గ్లామర్ తో మాత్రమే కాక నటనతోనూ మెప్పించారు.
మిగతా నటీనటులందరూ తమ తమ పాత్రలకు న్యాయం చేశారు.
సాంకేతికవర్గం పనితీరు: జిబ్రాన్ నేపథ్య సంగీతం కంటెంట్ ని, ఎమోషన్ ను బాగా ఎలివేట్ చేసింది. హరీష్ కన్నన్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ఆర్ట్ & ప్రొడక్షన్ టీమ్ కూడా మంచి వర్క్ ఇచ్చారు.
దర్శకుడు ప్రవీణ్ ఒక థ్రిల్లర్ ను అన్నీ బేసిక్ రూల్స్, టెంప్లేట్ ను బ్రేక్ చేస్తూ తెరకెక్కించాలనుకున్న తీరు ప్రశంసనీయమే. అయితే.. కాన్ఫ్లిక్ట్ పాయింట్ ను డీల్ చేసిన విధానం మైనస్ అయ్యింది. అందువల్ల ఆలోచన బాగున్నా.. ఎగ్జిక్యూషన్ విషయంలో విఫలమయ్యాడు. ఆ కారణంగా ప్రవీణ్ కథకుడిగా ఆకట్టుకున్నాడు కానీ.. దర్శకుడిగా మాత్రం అలరించలేకపోయాడు.
విశ్లేషణ: బౌండరీలు బ్రేక్ చేసే సినిమాలు రావడం అనేది చాలా ఇంపార్టెంట్. మొన్నామధ్య తమిళంలో విడుదలైన విక్రమ్ నటించిన “వీరధీరశూర” కూడా ఇలా టెంప్లేట్ బ్రేక్ చేసిన సినిమానే. “ఆర్యన్” కూడా అలాంటి తరహా ప్రయత్నమే. అయితే.. ఎగ్జిక్యూషన్ & జస్టిఫికేషన్ లెవల్లో ఫెయిల్ అయ్యింది. అయినప్పటికీ.. ఒక డిఫరెంట్ థ్రిల్లర్ చూడాలి అనుకునే ప్రేక్షకులు మాత్రం ఒకసారి ప్రయత్నించవచ్చు.
ఫోకస్ పాయింట్: డీసెంట్ థ్రిల్లర్!
రేటింగ్: 2/5