ఎబిసిడి

  • May 18, 2019 / 08:44 AM IST

మెగా హీరోల్లో ఒకడైన అల్లు శిరీష్ కథానాయకుడిగా తెరకెక్కిన తాజా చిత్రం “ఎబిసిడి” (అమెరికన్ బోర్న్ కన్ఫ్యూజ్డ్ దేశీ). “లాగిన్” అనే హిందీ చిత్రంతో దర్శకుడిగా కెరీర్ మొదలెట్టిన సంజీవ్ రెడ్డి తొలిసారి తెలుగులో దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని మధుర శ్రీధర్ రెడ్డి, యష్ రంగినేని సంయుక్తంగా నిర్మించగా.. సురేష్ ప్రొడక్షన్ సారధ్యంలో సినిమా విడుదలైంది. “కృష్ణార్జున యుద్ధం’ ఫేమ్ రుక్సర్ కథానాయికగా నటించిన ఈ చిత్రం నేడు (మే 17) విడుదలైంది. 2013లో మలయాళంలో రూపొందిన “ఎబిసిడి” చిత్రానికి రీమేక్ ఇది. మరి ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: అరవింద్ అలియాస్ అవి (అల్లు శిరీష్) ఒక రిచ్ ఫాదర్ కి పుట్టిన రిచ్ సన్. చిన్నప్పట్నుంచి డబ్బు తప్పితే కష్టం ఎరుగకుండా ఎదగడం వలన డబ్బు తెలియకుండా పోతుంది. కొడుక్కి డబ్బు విలువ తెలియడం కోసం హాలీడే ట్రిప్ అని మాయమాటలు చెప్పి ఇండియాకి పంపేసి.. అక్కడే ఎం.బి.ఏ చదవాలని, అది కూడా నెలకు 5000 పాకెట్ మనీతో మాత్రమే బ్రతకాలని రూల్ పెడతాడు.

అప్పటివరకూ డాలర్లలో ఖర్చు పెట్టడం అలవాటైన అవి నాన్న ఇచ్చే 5000 రూపాయలతో ఎలా బ్రతికాడు. ఈ క్రమంలో డబ్బు విలువ తెలుసుకొన్నాడా? ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు? అనేది “ఎబిసిడి” కథాంశం.

నటీనటుల పనితీరు: అల్లు శిరీష్ ఇంకా నటుడిగా తనను తాను ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి కష్టపడుతూనే ఉన్నాడు. శిరీష్ నటనలో సహజత్వం ఎప్పుడూ కనిపించదు, ఏదో ఆర్టిఫీషియల్ నెస్ ధ్వనిస్తుంటుంది. “ఎబిసిడి” విషయంలోనూ అదే జరిగింది. బోయ్ నెక్స్ట్ డోర్ లాంటి క్యారెక్టర్ లో శిరీష్ ఇమడలేకపోయాడు. పైగా.. ఎమోషనల్ సీన్స్ లో కనీస స్థాయి హావభావాలు ప్రకటించలేకపోయాడు శిరీష్.

“కృష్ణార్జున యుద్ధం” చిత్రంలో తన క్యూట్ యాక్టింగ్ తో ఆకట్టుకొన్న రుక్సర్ ఈ చిత్రంలోనూ అందం, అభినయంతో అలరించింది. “మెల్ల మెల్లగా” పాటకు ఆ అమ్మాయి అందం, స్క్రీన్ ప్రెజన్స్ సేవింగ్ గ్రేస్ అని చెప్పాలి.

చాలారోజుల తర్వాత నాగబాబు క్యారెక్టర్ సినిమాకి ప్లస్ పాయింట్ గా మారింది. ఆయన ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ సినిమాలో చెప్పుకోవడానికంటూ ఉన్న ప్రత్యేక ఆకర్షణల్లో ఒకటిగా నిలుస్తుంది. నిన్నమొన్నటివరకూ చైల్డ్ ఆర్టిస్ట్ గా ప్రేక్షకుల్ని భలే నవ్వించిన భరత్ ఈ చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పరిచయమవ్వడం విశేషం. మనోడి క్యారెక్టర్ పెద్దగా కామెడీ క్రియేట్ చేయలేకపోయినా.. పర్వాలేదనిపించింది.

సాంకేతికవర్గం పనితీరు: జుదా సాందీ పాటలు, శ్రవణ్ భరద్వాజ్ బ్యాగ్రౌండ్ స్కోర్ బాగున్నాయి. రామ్ కెమెరా వర్క్ కూడా బాగుంది. ప్రొడక్షన్ వెల్యూస్ కూడా పర్వాలేదు అనిపించేలా ఉన్నాయి. ఇన్ని బాగున్న సినిమాకి పాత కథ-కథనం-క్యారెక్టరైజేషన్స్ మైనస్ గా మారాయి. ముఖ్యంగా ఎప్పుడో ఆరేళ్ళ క్రితం అనగా 2013లో మలయాళంలో వచ్చిన సినిమాకి కథ పరంగా పెద్దగా మార్పులు చేయకుండా రీమేక్ చేయడం, హీరో నుంచి సరైనా నటన రాబట్టుకోవడంలో దర్శకుడు సంజీవ్ రెడ్డి ఫెయిల్ అయ్యాడు. సన్నివేశాలు అల్లుకుంటూపోయారు కానీ.. సినిమాలో జీవం కనిపించలేదు. ముఖ్యంగా ఎమోషనల్ గా ఎక్కడా కనెక్టివిటీ లేదు. పైగా.. సినిమా మూల కథ “పిల్ల జమీందార్”ను గుర్తు చేయడం, ఈ తరహా కథాంశాలు ఆల్రెడీ తెలుగులో చాలా రూపొందడంతో సినిమా ఆసక్తికరంగా లేకపోవడమే కాక బోర్ కొట్టిస్తుంది.

విశ్లేషణ: సినిమా ఒరిజినల్ అయినా రీమేక్ అయినా సౌల్ (ఆత్మ) అనేది మిస్ అవ్వకుండా చూసుకోవాలి. అప్పుడే సినిమా జనాలకి కనెక్ట్ అవుతుంది. కానీ.. “ఎబిసిడి”లో ఆ ఆత్మ లోపించింది. ఆ కారణంగా సినిమా సేఫ్ జోన్ లోకి రావడం కాస్త కష్టమే. అలాగే.. అల్లు శిరీష్ ముందు నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం కూడా చాలా ఉంది.

రేటింగ్: 2/5

CLICK HERE TO READ REVIEW IN ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus