ప్రముఖ సినీ నటుడు కెప్టెన్ చలపతి చౌదరి ఈరోజు మరణించారు.కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధపడుతూ వస్తున్న ఆయన..కర్ణాటకలోని రాయచూర్లోని ఓ ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ వచ్చారు. కానీ పరిస్థితి విషమించడంతో ఆయన కన్నుమూసినట్లు కుటుంబ సభ్యులు చెప్పుకొచ్చారు. తెలుగు, తమిళ, కన్నడలతో కలుపుకుని మొత్తం 100కి పైగా సినిమాల్లో ఈయన నటించారు. అలాగే పలు సీరియల్స్లో కూడా గుర్తింపు తెచ్చిపెట్టే పాత్రలు చేశారు. ఈయన విజయవాడకు చెందిన వ్యక్తి అయితే ..
రాయ్చూర్లో స్థిరపడ్డారు. నందమూరి బాలకృష్ణతో ఈయనకి మంచి సాన్నిత్యం ఉంది. ‘గౌతమీ పుత్ర శాతకర్ణి’ ‘రూలర్’ ‘అఖండ’ వంటి చిత్రాల్లో ఈయన నటించారు. ‘అఖండ’ లో సైన్స్ గురించి, దేవుడు గురించి బాలయ్య అఘోర పాత్రని ప్రశ్నిస్తాడు ఈయన. అలాగే చిరంజీవి నటించిన ‘ఖైదీ నెంబర్ 150’ ‘సైరా నరసింహారెడ్డి’ వంటి చిత్రాల్లో కూడా ఈయన నటించారు. ప్రభాస్ హీరోగా తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ ‘సాహో’ లో కూడా ఈయన డాన్ పాత్రలో నటించారట.
కానీ ఆ సినిమాలో ఈయన నటించిన సన్నివేశాలను తీసేశారని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు కెప్టెన్ చలపతి చౌదరి. ‘దర్శకుడి విజన్ ను తప్పుబట్టకూడదని.. చిన్న పాత్ర ఇచ్చినా గుర్తింపు ఉన్న పాత్ర ఇస్తే నటుడిగా సంతోషిస్తానని’ ఈయన ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు. ఇక ఈయన మరణ వార్తతో టాలీవుడ్లో విషాద ఛాయలు అల్లుకున్నాయి. కొంతమంది సినీ ప్రముఖులు ఈయన మృతి పట్ల చింతిస్తూ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు.