‘మగధీర’ (Magadheera) సినిమాలో రణ్‌దేవ్ బిల్లాగా నటించిన దేవ్ గిల్ (Dev Gill) గుర్తున్నాడా? ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించినా ఇప్పటికీ దేవ్ గిల్ అనగానే ‘మగధీర’ సినిమానే గుర్తొస్తుంది. ఆ సినిమాలో పాత్ర, ఆయన నటన అలా ఆకట్టుకున్నాయి మరి. ఇప్పుడు హీరోగా ఓ సినిమా చేశారు. దానికి సంబంధించిన టీజర్ ఆవిష్కరణ కార్యక్రమం ఇటీవల హైదరాబాద్‌లో జరిగింది. ఈ క్రమంలో ప్రముఖ దర్శకుడు ఎస్.ఎస్. రాజమౌళిపై (SS Rajamouli) దేవ్ గిల్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
‘మగధీర’ తర్వాత నాగార్జున (Nagarjuna) ‘రగడ’ (Ragada), చరణ్ (Ram Charan) ‘నాయక్’ (Nayak), ‘రచ్చ’ (Racha) తదితర సినిమాల్లో వరుసగా విలన్‌గా నటించాడు దేవ్‌గిల్. అయితే రాజమౌళి వల్లే తనకు మంచి పేరొచ్చిందని, తన సినీ ప్రయాణాన్ని గుర్తుచేసుకుంటూ ఆయనపై ప్రశంసలు కురిపించాడు. తల్లిదండ్రులు తనుకు పుణెలో జన్మనిస్తే.. రాజమౌళి టుడిగా పేరొచ్చేలా చేశారని జక్కన్నను ఆకాశానికెత్తేశారు దేవ్ గిల్. 15 ఏళ్ల క్రితం రాజమౌళి దర్శకత్వంలో నటించడం అదృష్టంగా భావిస్తున్నాను అని చెప్పాడు.
అంతేకాదు రాజమౌళి టీమ్ సాయంతోనే ఓ నిర్మాణ సంస్థ నెలకొల్పి సినిమా చేశాను అని చెప్పాడు. విలన్‌గా తనను తెలుగు ప్రేక్షకులు ఆదరించారని, ఇప్పుడు హీరోగా కొత్త సినిమాతో సర్‌ప్రైజ్ చేయబోతున్నాను అని చెప్పాడు దేవ్ గిల్. డ్యాన్స్, ఫైట్స్‌తో వినోదం పంచడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పాడాయన. రామ్ చరణ్ తన హీరో అని, తాను హీరో ఎలా అవ్వాలో చరణే చెప్పాడని దేవ్ గిల్ తెలిపారు. చరణ్ ఇచ్చిన స్ఫూర్తితోనే ఈ సినిమా చేశానని కూడా చెప్పారు.
మళ్లీ రాజమౌళి డైరక్షన్‌లో సినిమా ఎప్పుడు అని అడిగితే.. అవకాశం వస్తే తాను ఎప్పుడూ రెడీనే అని చెప్పాడు. ఇక దేవ్ గిల్ హీరోగా నటించిన సినిమా ఏంటో చెప్పలేదు కదా. అదే రాజమౌళి దగ్గర కో- డైరెక్టర్ పని చేస్తున్న పేట త్రికోటి తెరకెక్కించిన ‘అహో! విక్రమార్క’. ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. త్రికోటి గతంలో ‘దిక్కులు చూడకు రామయ్య’ (Dikkulu Choodaku Ramayya) అనే సినిమా చేశారు. ఆ తర్వాత ‘జువ్వ’ అనే సినిమా చేశారు. అదేమైందనే విషయంలో పెద్దగా సమాచారం లేదు.