టాలీవుడ్‌లో ఇటీవల జరిగిన ఒక సినిమా కార్యక్రమం సందర్భంగా నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారమే లేపిన సంగతి తెలిసిందే. హీరోయిన్ల వస్త్రధారణపై ఆయన చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ కావడంతో పాటు, తీవ్ర విమర్శలకు కూడా కారణమయ్యాయి. కొన్ని మాటలు అభ్యంతరకరంగా అనిపించాయని పలువురు సినీ ప్రముఖులు బహిరంగంగానే అసహనం వ్యక్తం చేశారు. మరోవైపు, శివాజీ ఉద్దేశం తప్పుగా లేదని, కానీ ఆయన చెప్పిన తీరు సరిగా లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు. ఇలా ఈ అంశం టాలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ వివాదంపై తాజాగా ఒక ఇంటర్వ్యూలో స్పందించిన నటుడు హర్షవర్ధన్ తన అభిప్రాయాలను చాలా సున్నితంగా స్పష్టంగా వెల్లడించారు. “మనకు నచ్చిన దుస్తులు ధరించడం వ్యక్తిగత స్వేచ్ఛలో భాగమే. కానీ స్వేచ్ఛ అనేది ఒక్క దుస్తుల వరకే పరిమితం కాదు” అని ఆయన అన్నారు. అలాగే “దొంగల మనసు మార్చడం కంటే ఇంటికి తాళం వేయడం సులభం” అనే ఉదాహరణను ప్రస్తావిస్తూ, జాగ్రత్తగా ఉండటంలో తప్పులేదని స్పష్టం చేశారు. శివాజీ ఉద్దేశం మంచిదే కావొచ్చు కానీ, ఇలాంటి సున్నితమైన అంశాలపై మాట్లాడేటప్పుడు మాటల్లో స్పష్టత అవసరమని హర్షవర్ధన్ అభిప్రాయపడ్డారు. ప్రదేశాన్ని, సందర్భాన్ని బట్టి డ్రెస్సింగ్ ఉండాలన్న విషయాన్ని కూడా ఆయన గుర్తు చేశారు.
ఇక హర్షవర్ధన్ సినీ ప్రయాణం విషయానికి వస్తే, విభిన్నమైన పాత్రలతో ఆయన తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల అనిల్ రావిపూడి దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమాలో కీలక పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో, హర్షవర్ధన్ నటనపై ప్రశంసలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ఈయన, శివాజీ వివాదంపై ఆయన స్పందించిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో కాస్త వైరల్‌గా మారాయి.