బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో కలిసి నటించాలని చాలా మంది హీరోయిన్లు కోరుకుంటారు. అలాంటి ఛాన్స్ తన తొలి సినిమాకే పట్టేసింది పూజా హెగ్డే. పైగా అశుతోష్ గోవారికర్ లాంటి స్టార్ డైరెక్టర్ ప్రాజెక్ట్. అప్పటికి హీరోయిన్ గా పూజాకి పెద్దగా క్రేజ్ లేదు. రెండు, మూడు సినిమాల అనుభవం మాత్రమే ఉంది. పైగా అవి ఫ్లాప్స్ కావడంతో హృతిక్ రోషన్ సినిమాతో తన దశ తిరిగిపోతుందని భావించింది. ‘మొహంజదారో’ లాంటి భారీ బడ్జెట్ సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చింది.
రెండేళ్ల పాటు ఈ సినిమా కోసం సమయం కేటాయించింది. తీరా చూస్తే ఈ సినిమా డిజాస్టర్ గా నిలిచింది. ఈ సినిమా రిజల్ట్ తో తన గుండె మిగిలిపోయిందని చెబుతోంది ఈ బుట్టబొమ్మ. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ బ్యూటీకి బాలీవుడ్ లో రెండో సినిమా చేయడానికి ఎందుకు గ్యాప్ తీసుకున్నారని ప్రశ్నించగా.. తన బాధలు చెప్పుకొచ్చింది. ఎవరికైనా తొలి సినిమా చాలా కీలకమని.. ఎన్నో ఆశలు పెట్టుకుంటామని.. అయితే హిందీలో తన తొలి సినిమా ‘మొహంజదారో’ ఫ్లాప్ కావడం తనను తీవ్రంగా బాధించిందని పూజా చెప్పుకొచ్చింది.
అయితే ఆ బాధ నుండి బయటపడేలా చేసింది మాత్రం తెలుగు సినిమాలే అని.. ఇక్కడ తన సినిమాలు సక్సెస్ కావడంతో ధైర్యంగా ముందుకు సాగానని పూజా వెల్లడించింది. మొదటి సినిమా ఫెయిల్ కావడంతో బాలీవుడ్ లో రెండో సినిమా చేయడానికి గ్యాప్ తీసుకోవాల్సి వచ్చిందని.. తన రెండో సినిమా ‘హౌస్ ఫుల్ 4’ హిట్ అవ్వడంతో ఇప్పుడు బాలీవుడ్ కెరీర్ మీద దృష్టి పెట్టినట్లు వెల్లడించింది పూజా హెగ్డే. ప్రస్తుతం ఈ బ్యూటీకి బాలీవుడ్ లో రణవీర్ సింగ్, సల్మాన్ ఖాన్ లాంటి హీరోల చిత్రాల్లో అవకాశాలు వస్తున్నాయని సమాచారం.