Potti Veeraiah: టాలీవుడ్‌లో విషాదం: ప్రముఖ నటుడు పొట్టి వీర‌య్య క‌న్నుమూత‌!

తెలుగు చ‌ల‌న చిత్ర‌రంగంలో పొట్టి వీర‌య్య‌గా పేరు పొందిన వీర‌య్య గ‌ట్టు ఆదివారంనాడు మ‌ర‌ణించారు. హైద‌రాబాద్ చిత్ర‌పురి కాల‌నీలో ఆయ‌న నివాముంటున్నారు. గ‌తంలో కొంత అనారోగ్యంతో వున్న ఆయ‌న ఆ త‌ర్వాత కోలుకున్నారు. ఆదివారం ఉద‌య‌మే పుచ్చ‌కాయ తిన్న వెంట‌నే గుండె నొప్పి రావ‌డంతో ద‌గ్గ‌ర‌లోని ష‌న్‌షైన్ ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. అక్క‌డ వైద్యుల ట్రీట్‌మెంట్ ఇచ్చారు. కానీ ఆదివారం సాయంత్రం 4.33 నిముషాల‌కు ఆయ‌న మృతిచెందిన‌ట్లు ఆసుప‌త్రి వ‌ర్గాలు తెలియ‌జేశాయి.

సాయంత్రం 5.30 నిముషాల‌కు ఆసుప‌త్రినుంచి ఇంటికి తీసుకువ‌చ్చారు. మా అసోసియేష‌న్ నుంచి ప్ర‌తినిధి రానున్నారు. రేపు ఆయ‌న అంత్య‌క్రియ‌లు జూబ్లీహిల్స్‌లోని మ‌హాప్ర‌స్తానంలో జ‌ర‌గ‌నున్నాయి.

పొట్టివీర‌య్య కు 74 సంవ‌త్స‌రాలు. 2అడుగుల మాత్ర‌మే వుండే ఆయ‌న ఆహార్యం ఆయ‌న‌కు ప్ర‌త్యేక‌త‌. ఇదే ఆయ‌న‌కు సినిమాల‌లో వేషాలు రావ‌డానికి కార‌ణ‌మైంది. బ్లాక్ అండ్ వైట్ సినిమాల‌నుంచి క‌ల‌ర్ సినిమాల‌వ‌రకు జ‌న‌రేష‌న్‌లో న‌టించి మెప్పించిన న‌టుడు ఆయ‌న‌. చాలాకాలంపాటు త‌న ఆహార్యానికి  త‌గిన పాత్ర‌లు వేస్తూ చెన్నై, హైద‌రాబాద్‌లో గ‌డిపారు. హైద‌రాబాద్ సినిమా రంగం త‌ర‌లివ‌చ్చాక ప‌లు వేషాలు వేశారు. కానీ ఆయ‌న కుటుంబ‌పోష‌న‌కు అది స‌రిపోయేదికాదు. అప్ప‌డ‌ప్పుడు వేషాలు వ‌స్తుండేవి. క‌నుక ఆయ‌న వికలాంగుల కోటా కింద హైద‌రాబాద్ కృష్ణాన‌గ‌ర్‌లో బ‌డ్డీకొట్టు పెట్టుకుని జీవ‌నం సాగించేవారు. ఆయ‌న‌కు ఒక కుమార్తె, ఒక కుమారుడు. ప్ర‌స్తుతం ఆయ‌న త‌న కుమార్తె వ‌న‌జ ద‌గ్గ‌ర వుంటున్నారు.

ఆదుకున్న ప్ర‌భాక‌ర్‌రెడ్డి చిత్ర‌పురి కాల‌నీ: సినిమారంగంలోని 24 క్రాఫ్ట్‌కు చెందిన కార్మికుల‌కు షేక్‌పేట ద‌గ్గ‌ర‌లోని కాజాగూడ గ్రామం వ‌ద్ద అప్ప‌ట్లో న‌టుడు ప్ర‌భాక‌ర్‌రెడ్డి ఆధ్వ‌ర‌ర్యంలో చిత్ర‌పురి కాల‌నీ ఏర్పాటుకు కృషి చేశారు. ఆ స‌మ‌యంలో ప‌లు సంద‌ర్భాల‌లో పొట్టి వీర‌య్య ప‌లువురిని క‌లిసిన సంద‌ర్భాలున్నాయి. మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్ స‌భ్యుడు కూడా అయిన ఆయ‌న‌కు చిత్ర‌పురిలో స్వంత ఇల్లు కూడా ద‌క్కింది. ఆ త‌ర్వాత వ‌య‌స్సురీత్యా వ‌చ్చిన అనారోగ్యాలు ఆయ‌న ఆర్థిక ప‌రిస్థితిని దిగ‌జార్చాయి.

మా అసోసియేష‌న్‌: ఈ విష‌యం తెలిసిన `మా` అసోసియేష‌న్ ఆయ‌న‌కు ఫించ‌న్ ఏర్పాటు చేసింది. ఆ త‌ర్వాత ప‌లు సంద‌ర్భాల‌లో వైద్య స‌హాకారం కూడా అందించింది. ఆయ‌న అంద‌రికీ త‌న‌లో నాలుక‌లా వుండేవాడు.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus