తొమ్మిదేళ్ల తర్వాత ఓ నటుడు మళ్లీ ముఖానికి రంగేసుకున్నాడు అంటే.. ఆ పాత్ర చాలా ఆసక్తికరంగా ఉండాలి. అచ్చంగా ఇలాగే సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తున్నారు వేణు తొట్టెంపూడి. గతంలో కామెడీ సినిమాలకు కేరాఫ్ అడ్రెస్‌గా నిలిచిన వేణు.. 2013 తర్వాత సినిమాలు చేయలేదు. ఇప్పుడు ‘రామారవు ఆన్ డ్యూటీ’ సినిమా ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఈ నేపథ్యంలో అభిమానులకు తన ఆలోచనల్ని చెప్పే ప్రయత్నం చేశారు. ఈ మేరకు చిత్రబృందం సోషల్ మీడియాలో ఓ వీడియో విడుదల చేసింది.
‘స్వయంవరం’, ‘చిరు నవ్వుతో’, ‘హనుమాన్ జంక్షన్’, ‘కల్యాణ రాముడు’, ‘పెళ్లాం ఊరిళితే’, ‘ఖుషి ఖుషీగా’, ‘చెప్పవే చిరుగాలి’, ‘గోపి గోపిక గోదావరి’ లాంటి చిత్రాలతో వేణు అలరించారు. తనదైన హాస్యంతో వినోదాల హీరో అనిపించుకున్నారు. అయితే ‘రామారావు ఆన్ డ్యూటీ’లో మాత్రం సరికొత్త పాత్ర చేస్తున్నా అని చెబుతున్నారు. రవితేజ హీరోగా శరత్ మండవ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని ఈ నెల 29న విడుదల చేస్తున్నారు. ఎప్పుడూ సినిమాలకే నా తొలి ప్రాధాన్యం.
అయితే అనివార్య కారణాల వల్ల గత కొన్నేళ్లుగా నటనకు దూరంగా ఉన్నాను. మళ్లీ ఇన్ని రోజుల తర్వాత నటించడం సంతోషంగా ఉంది అని చెప్పారు వేణు. ‘రామారావు ఆన్ డ్యూటీ’తోపాటు ‘పారా హుషార్’ అనే సినిమాలోనూ కీలక పాత్రలో కనిపిస్తున్నాను అని చెప్పారు. ‘రామారావు’తోనే కమ్‌బ్యాక్ ఎందుకు అని అడిగితే… ‘‘ఈ సినిమా దర్శక, నిర్మాతలు చాలా సార్లు ఫోన్ చేసి నటించమని అడిగారు. కానీ నేను ఒప్పుకోలేదు అని చెప్పారు వేణు.
అయితే ‘మీరు ఈ సినిమాలో నటించకపోయినా ఫర్వాలేదు. ఓసారి కలుద్దాం అని దర్శకుడు శరత్ మండవ చెప్పారట. అలా ఓ సారి మీట్ అయ్యారు. ఆ మాటల్లోనే సీఐ మురళీ పాత్ర ఆఫర్ చేశారట. ‘మీకు నమ్మకం ఉంటే చేయండి’ అని అన్నారట. అలా ఆ క్యారెక్టర్ వేణుకు నచ్చడంతో నటించడానికి ఓకే చెప్పాను అని చెప్పారు వేణు. అంతకుముందు వేరే కథలు చాలా విన్నప్పటికీ… అనుకోకుండా ఇదే ముందు ప్రారంభమైంది అని చెప్పారు.