సామాన్యులు, సెలబ్రిటీలు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరిలో ఎమోషన్స్ కామన్. కానీ సెలబ్రిటీలు తమ ఎమోషన్స్ ని ఎక్కడ పడితే అక్కడ చూపించలేరు. కారణం మీడియా.. చిన్న విషయాన్ని పెద్దది చేసి చూపిస్తుందని వారు భయపడుతుంటారు. కానీ తాను మాత్రం నవ్వు, కోపం ఆపుకోలేనని అనుపమ వెల్లడించింది. కేరళ బ్యూటీ తెలుగులో నటించిన అ..ఆ , ప్రేమమ్, శతమానం భవతి సినిమాలు హిట్ కావడంతో మరిన్ని ఆఫర్లు ఆమె చేతికి వచ్చాయి. ఉన్నదీ ఒక్కటే జిందగీ, తేజ్ ఐలవ్యూ సినిమాలు కొంత నిరాశపరచడంతో వేగం తగ్గించింది. ప్రస్తుతం “నేను లోకల్” ఫేమ్ త్రినాధరావు నక్కి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న “హలో గురు ప్రేమ కోసమే” లో హీరోయిన్ గా నటిస్తోంది. ఈ సందర్భంగా అనుపమ మీడియాతో ముచ్చటించింది. ‘‘నాకు కోపం చాలా ఎక్కువ. కానీ అన్ని సందర్భాల్లోనూ అది బయటకు రాదు.
చాలా అరుదుగా వస్తుంటుంది. మనం కరెక్ట్‌గా పనిచేసి, తోటివారు సరిగ్గా చెయ్యకపోతే అందరికీ చివాట్లు పడిన సందర్భంలో కోపం కట్టలు తెంచుకొస్తుంది. అప్పుడు మాత్రం నాగవల్లి (‘అఆ..’లో క్యారెక్టర్ పేరు)గా మారిపోతా. అదే నాకు మైనస్ పాయింట్. కానీ నా కోపం పాసింగ్ క్లౌడ్ లాంటిది. క్షణంలో మాయమవుతుంది” అని వెల్లడించింది. ఇక తన వల్ల ఎవరికీ కోపం రాకుండా నడుచుకుంటానని చెప్పింది. “ఏ పని చేసిన పర్‌ఫెక్షనిస్ట్‌గా ఉండాలనుకుంటా. షూటింగ్‌కి టైమ్‌కి వెళ్తా. చెప్పిన పని పర్ఫెక్ట్‌గా చేస్తా. వీలైనంత వరకూ ఎవరితోనూ మాట అనిపించుకోకుండా పనిచేస్తా’’ అని అనుపమ స్పష్టం చేసింది. ఆ క్రమశిక్షణ నచ్చే జయాపజయాలతో సంబంధం లేకుండా ఆమెకు అవకాశాలు తలుపుతడుతున్నాయి.