ఒకటి కాదు…రెండు కాదు…దాదాపుగా 10ఏళ్లు అయ్యింది మన మెగా స్టార్ హీరోగా తెరపై కనిపించి. రాజకీయాల పుణ్యమా అంటూ…అభిమానులకు దూరం అయిన మెగా స్టార్. ఇప్పుడు మళ్లీ నటించేందుకు సిద్దం అవుతున్న విషయం తెలిసిందే. అయితే ఈ పదేళ్ళలో గతంలో రాజమౌళి దర్శకత్వంలో రాంచరణ్ నటించిన మగధీర చిత్రంలో ఓ సాంగ్ లో కనిపించి మురిపించిన మన మెగా స్టార్..ఆ తరువాత తాజాగా ‘బ్రూస్ లీ’ చిత్రంలో ఫైట్స్ తో అదరగొట్టాడు.
ఇదిలా ఉంటే చిరు తన 150వ సినిమాను అభిమానులకు కానుకగా అందించాలి అన్న ఆలోచనతో దాదాపుగా రెండు ఏళ్ల నుంచి కసరత్తు చేస్తున్నాడు. కొన్ని వందల కధలు విని చివరకు తమిళ సినిమా ‘కత్తి’ని రీమేక్ చేసేందుకు సిద్దం అయినట్లు సమాచారం. మరో పక్క, కధతో పాటు, చిరు 150వ సినిమాను ఎక్కడా కాంప్రమైస్ కాకుండా తెరకెక్కించేందుకు శతవిధాల ప్రయత్నిస్తున్నాడు దర్శకుడు వినాయక్. ఇక తాజాగా వినిపిస్తున్న సమాచారం ప్రకారం…కధలో చిన్న చిన్న మార్పులు చేయాల్సి ఉండగా…అవి చేసి అటుపైన వచ్చే నెలలో సినిమాను సెట్స్ పైకి తీసుకు వెళ్ళేందుకు చర్చలు జరుగుతున్నాయి.
మరో వైపు ఈ సినిమాలో చిరు సరసన తళుక్కున మెరిసే సోయగాల సుందరి కోసం అన్వేషణ మొదలు పెట్టాడు మన దర్శకుడు.. ఇప్పటికే నయనతార, అనుష్కలను సంప్రదించినట్లు టాలీవుడ్ నుంచి వినిపిస్తున్న వార్త. అయితే తాను బాహుబలి బిజీలో ఉన్నానని, డేట్స్ కష్టమని అనుష్క తేల్చేసిందని, దాంతో నయనతార ఖరారు సమాచారం. చిరు సరసన నయనతార అయితేనే సరిగ్గా సూటవుతుందనే నమ్మకంతో చివరకి ఆమెవైపే మొగ్గుచూపినట్టు సినీవర్గాలు చెబుతున్నాయి. ఇక దీనిపై త్వరలోనే సినిమా యూనిట్ అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం. మరి అంతా అనుకున్నట్లుగా జరిగితే…”చిరు ద బాస్ ఈజ్ బ్యాక్” అంటూ మళ్ళీ అభిమానులు కేరింతలు కొట్టే సమయం త్వరలోనే రానుంది.