సీనియర్ హీరోయిన్ లతా శ్రీ గురించి ఇప్పటి ప్రేక్షకులకు పెద్దగా తెలియకపోవచ్చు కానీ.. అప్పటి ప్రేక్షకులకు ఈమె సుపరిచితమే. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చినప్పటికీ.. తరువాత చెల్లెలి పాత్రల్లో నటిస్తూ వచ్చింది. ‘యమలీల’ ‘నెంబర్ వన్’ ‘ఆ ఒక్కటీ అడక్కు’ వంటి హిట్ చిత్రాల్లో ఈమె నటించింది. ముఖ్యంగా ‘ఆ ఒక్కటి అడక్కు’ సినిమాలో “జెండా ఎత్తేస్తా” అనే డైలాగ్ తో ఈమె బాగా పాపులర్ అయ్యింది. ఇక ఈమె తెలుగు తో పాటు కన్నడ, హిందీ భాషల్లో 70కి పైగా సినిమాల్లో నటించింది. ఇక 1990లో జిమ్ ట్రైనర్‌ను ప్రేమించి పెళ్లాడిన లతా శ్రీ.. అటు తరువాత సినిమాలకు దూరంగా ఉంటూ వస్తోంది. చివరిగా ఈమె అల్లరి నరేష్ హీరోగా నటించిన ‘అత్తిలి సత్తిబాబు ఎల్.కె.జి’ అనే చిత్రంలో నటించింది.
ఇదిలా ఉండగా.. ‘పోలీస్ భార్య’ అనే హిట్ చిత్రంలో ఓ బోల్డ్ పాత్ర పోషించింది లతా శ్రీ. ఆ చిత్రం 100రోజుల ఫంక్షన్లో ఈమెకు ఓ చేదు సంఘటన ఎదురైందట. ఆ సంఘటన గురించి లతా శ్రీ మాట్లాడుతూ.. “సాధారణంగా నాకు కొంచెం కోపం ఎక్కువ. ‘పోలీస్ భార్య’ సినిమా వంద రోజుల ఫంక్షన్ జరుగుతున్న రోజున నాకు ఓ చేదు సంఘటన ఎదురైంది. ఆ రోజుల్లో ఆర్టిస్ట్‌లు పెద్దగా బయటకు వచ్చేవారు కాదు. ఆ ఫంక్షన్ కు పెద్దమొత్తంలో జనం వచ్చారు. ఆర్టిస్ట్‌లు అందరం కలిసి వెళ్తుంటే.. ఒకడు వచ్చి నా నడుముని గిల్లేశాడు.నాకు చాలా కోపం వచ్చి వాడివైపు చూసాను.. అయినా సరే మళ్లీ ఏదో చెయ్యడానికి ట్రై చేశాడు.’
అప్పుడు వాడి చేయిపట్టుకుని ఒక్కటిచ్చాను. వెంటనే వాడు అక్కడ నుండీ వెళ్లిపోయి ఓ పదిమందిని వెంటేసుకుని వచ్చాడు. ‘ఏంటి మావాడ్ని కొట్టావ్’ అంటూ వాళ్ళు నా మీదికి వస్తుంటే.. హీరో నరేష్ గారు రియల్ హీరో అనిపించుకున్నారు. వాళ్లను కొట్టి వెనక్కి నెట్టేసి.. వెంటనే పోలీసుల్ని పిలిచించారు. తరువాత ఆయనే నన్ను ప్రొటెక్ట్ చేస్తూ వ్యాన్ ఎక్కించి ఇంటికి పంపారు” అంటూ చెప్పుకొచ్చింది.