“మై విలేజ్ షో”తో సెన్సేషన్ క్రియేట్ చేసిన అనిల్ గీల మొదటిసారి హీరోగా చేసిన ప్రయత్నం “మోతెవరి లవ్ స్టోరీ” అనే వెబ్ సిరీస్. శివకృష్ణ బుర్రా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ 7 ఎపిసోడ్ల సిరీస్ ట్రైలర్ మంచి ఆసక్తి నెలకొల్పింది. మరి సిరీస్ అదే స్థాయిలో ప్రేక్షకుల్ని ఆకట్టుకోగలిగిందా లేదా? అనేది చూద్దాం..!!
కథ: తాను ప్రేమించిన అమ్మాయి అనిత (వర్షిణి రెడ్డి)ని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని పరితపించే పార్శి (అనిల్ గీల) ఆఖరికి ఆమెను లేపుకొని వెళ్లిపోవడానికి కూడా రెడీ అయిపోతాడు.
కట్ చేస్తే.. తన అమ్మమ్మ పేరు మీద హైద్రాబాద్ లో ఉన్న భూమి కోసం స్వయంగా పెళ్లికి ఒప్పుకుంటాడు సత్తయ్య (మురళీధర్ గౌడ్).
దాంతో అప్పటివరకు ఊరంతా శ్రీరామలక్ష్మణులు అంటూ పొగిడిన అన్నాదమ్ముల మధ్య గొడవలు మొదలవుతాయి.
అసలు ఊరి మోతెవరి ఎందుకని పార్షిగాడి అమ్మమ్మకి భూమి రాసిచ్చాడు? ఆ భూమి ఎన్ని గొడవలకి కారణమైంది? ఇంతకీ పార్శిగాడి ప్రేమకథ సక్సెస్ అయ్యిందా? అందుకోసం పార్సీ ఎందుకొన్న కష్టాలు ఏమిటి? అనేది సిరీస్ కథాంశం.
నటీనటుల పనితీరు: నటీనటులందరూ తమ బలాలకు తగ్గ పాత్రలు పోషించారు. అనిల్ గీల ఆల్రెడీ తాను క్రియేట్ చేసిన మై విలేజ్ షో ఎపిసోడ్స్ లో ఈ తరహా పాత్రలు బోలెడు పోషించాడు. అందువల్ల పార్శీ అనే పాత్రలో చాలా చక్కగా ఒదిగిపోయాడు. అనిల్ బాడీ లాంగ్వేజ్, కామెడీ టైమింగ్ భలే ఎంటర్టైనింగ్ గా ఉంటాయి. సిరీస్ కి మెయిన్ హైలైట్ గా నిలిచాడు.
వర్షిణి రెడ్డి క్యారెక్టర్ కూడా భలే ఉంటుంది. “నన్నెవడు పెళ్లి చేసుకుంటడే” అంటూ ఆమె చేసే అల్లరి చూడ్డానికి బాగుంది. ఆమెలోని అమాయకత్వం పాత్రకి మరింత సహజత్వాన్ని తీసుకొచ్చింది.
మురళీధర్ గౌడ్, సదన్నలకు ఈ తరహా పాత్రలు కొట్టిన పిండి లాంటివి. చాలా ఈజీగా జీవించేశారు.
అమ్మమ్మ పాత్రలో నటించిన సీనియర్ నటి కూడా మంచి నటనతో ఆకట్టుకుంది.
సాంకేతికవర్గం పనితీరు: టెక్నికల్ గాను మంచి స్టాండర్డ్ మైంటైన్ చేశారు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్, మ్యూజిక్ వంటి టెక్నికాలిటీస్ లో ఎక్కడా రాజీపడలేదు.
దర్శకుడు శివకృష్ణ “బలగం” తరహాలోనే మానవీయ బంధాలు ఏ విధంగా డబ్బుతో ముడిపడిపోతున్నాయి అనే అంశాన్ని కథగా ఎంచుకున్న విధానం బాగుంది. అయితే.. ఆ కథను పూర్తిస్థాయిలో ఆకట్టుకునే విధంగా తెరకెక్కించడంలో మాత్రం తడబడ్డాడు. 7 ఎపిసోడ్ల సిరీస్ అయినప్పటికీ.. కథనాన్ని ఆసక్తికరంగా నడిపించలేకపోయాడు. ఆరు ఎపిసోడ్ల తర్వాత అసలు మేటర్ ఏంటి అనేది రివీల్ చేయకుండా 7వ ఎపిసోడ్ లో మొత్తం ఒకేసారి చుట్టేయడం అనేది సంతృప్తినివ్వలేకపోయింది. అందువల్ల “మోతెవరి లవ్ స్టోరీ” అనే సిరీస్ లోని కామెడీని ఎంజాయ్ చేసినట్లుగా, ఎమోషన్ కి రిలేట్ అవ్వలేం. ఆ ఒక్క మైనస్ పాయింట్ ను పక్కన పెడితే.. సరదాగా కుటుంబం మొత్తం కలిసి చూసేలా సిరీస్ ను తెరకెక్కించాడు శివకృష్ణ.
విశ్లేషణ: ఎంత మంచి మెసేజ్ ఇచ్చాం అనేదానికంటే ఆ మెసేజ్ ను ఎంత ఎఫెక్టివ్ గా ఇచ్చాం అనేది కీలకంగా మారుతుంది. “మోతెవరి లవ్ స్టోరీ”లో మంచి మెసేజ్ ఉంది. అయితే.. ఆ మెసేజ్ ను అందరూ కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంలో మేకర్స్ కాస్త తడబడ్డారు. ఆ ఎమోషన్ అనేది సరిగా వర్కవుట్ అయ్యుంటే మాత్రం మరో “బలగం” అయ్యేది ఈ సిరీస్. చిన్నపాటి లోపాలున్నప్పటికీ ఓ మూడు గంటలపాటు ఎంటర్టైన్ అయితే కచ్చితంగా చేస్తుంది.
ఫోకస్ పాయింట్: డబ్బు కంటే బంధం ముఖ్యమని చెప్పే మోతెవరి!
రేటింగ్: 2.5/5