‘ఫిదా’ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన సాయి పల్లవి.. ఆ చిత్రం విజయంలో కీలక పాత్ర పోషించిందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పక్కా తెలంగాణ అమ్మాయిగా.. ఈమె భాను పాత్రలో ఒదిగిపోయింది.. ‘భానుమతి.. ఒక్కటే పీస్.. హైబ్రిడ్ పిల్ల’ అంటూ కుర్రకారుని కట్టి పాడేసింది ఈ బ్యూటీ. ఆ తరువాత ‘ఎం.సి.ఏ’ చిత్రంలో కూడా నటించి మరో సూపర్ హిట్ అందుకుంది. అయితే ‘కణం’ ‘ఎన్జీకె’ ‘పడి పడి లేచె మనసు’ సినిమాలు ఫ్లాప్ అవ్వడంతో ఈమె కాస్త స్లో అయ్యిందనే చెప్పాలి.
అలా అని ఈమెకు డిమాండ్ అస్సలు తగ్గలేదు. విజయ్ దేవరకొండ, మహేష్ బాబు వంటి హీరోల సినిమాల్లో అవకాశాలు వచ్చినా ఈమె రిజెక్ట్ చేసింది.మంచి పాత్రలు చెయ్యాలనేదే ఈమె ప్రధాన ఉద్దేశం అని తెలియజేసింది.ప్రస్తుతం ఈమె తెలుగు, తమిళ భాషల్లో స్టార్ హీరోయిన్ గానే రాణిస్తుంది.ఇదిలా ఉండగా.. ఈమె మొదట పలు తమిళ సినిమాల్లో నటించింది. నిజానికి ఈమె తమిళమ్మాయి. అయితే మలయాళ ‘ప్రేమమ్’ సినిమా ఈమెకు బ్రేక్ ఇచ్చింది.
దాంతో అంతా ఈమెను మలయాళీ అంటుంటారు. సోషల్ మీడియా వంటి వాటిలో కూడా సాయి పల్లవిని ‘మల్లు గర్ల్, మలయాళీ హీరోయిన్’ అంటూ సంబోధిస్తూ ఉంటారు. అలా తనని పిలవడం.. ఆమెకు అస్సలు నచ్చదట. ఇటీవల ఓ యాంకర్ పై కూడా ఈమె మండిపడిందని తెలుస్తుంది. ‘నేను తమిళమ్మాయిని.. నేను కోయంబత్తూర్ లోనే పెరిగాను. అసలు సిసలు తమిళమ్మాయిని నేను. నన్ను మలయాళీ అని మాత్రం పిలవకండి’ అంటూ ఘాటుగా సమాధానం ఇచ్చిందట సాయి పల్లవి.