ఎడి ఇన్ఫినిటమ్ సినిమా రివ్యూ & రేటింగ్!

శుక్రవారం విడుదలైన 11 తెలుగు సినిమాల్లో ఒకటి “ఎడి ఇన్ఫినిటమ్”. నితిన్ ప్రసన్న, “మళ్ళీరావా” ఫేమ్ ప్రీతి అశ్రాని జంటగా నటించిన ఈ చిత్రం ఓ సైన్స్ ఫిక్షనల్ థ్రిల్లర్. విడుదలైన 11 సినిమాల్లో అతి తక్కువ పబ్లిసిటీ చేయబడిన ఈ చిత్రం నిజానికి ఆశ్చర్యపరిచింది. అసలు ఈ సినిమాకి సమీక్ష అవసరమా అనుకోని థియేటర్లో చూసిన నేను ఇలాంటి సినిమాలు జనాలకి చేరాలి అని ఈ సమీక్ష మొదలెట్టాను. అంతలా నన్ను ఆకట్టుకున్న అంశాలు ఏమిటో చూడండి..!!

కథ: సంజీవ్ (నితిన్ ప్రసన్న) ఓ హాస్పిటల్లో ఎకౌంటెంట్ గా వర్క్ చేస్తుంటాడు. అదే హాస్పిటల్లో నర్స్ గా వర్క్ చేసే పల్లవి (ప్రీతి అశ్రాని)ని ప్రేమించి పెళ్లి చేసుకొని సంతోషమైన జీవితాన్ని గడుపుతుంటాడు.

అదే సమయంలో సిటీలో రోడ్డుపై పడుకొనే పిల్లలు, అడుక్కునే లేదా కూలి పని చేసే వాళ్ళ పిల్లలు అదృశ్యమవుతుంటారు. ఎవరో ఒక వ్యక్తి ఆ పిల్లల్ని ఎత్తుకెళ్తుంటాడు. అప్పటి క్యాల్కులేషన్స్ వరకు దాదాపు 23 మంది పిల్లలు మిస్సింగ్ అని తెలుసుకొంటాడు సి.ఐ విష్ణు (రంగధామ్). ఇంకొన్ని రోజుల్లో రిటైర్ అవ్వనున్న విష్ణుకి ఈ కేస్ ఛాలెంజ్ లా మారుతుంది. దాంతో దొరికిన కొన్ని ఆధారాలతో సంజీవ్ ను అరెస్ట్ చేస్తాడు విష్ణు.

అసలు సంజీవ్ ఆ కిడ్నాపర్ అని విష్ణు నమ్మడానికి కారణం ఏమిటి? సంజీవ్ & కిడ్నాపర్ కి ఉన్న సంబంధం ఏమిటి? ఈ కిడ్నాప్స్ ఎందుకు జరుగుతున్నాయి? వంటి ప్రశ్నలకు సమాధానమే “ఎడి ఇన్ఫినిటమ్”.


నటీనటుల పనితీరు: పలు తమిళ చిత్రాల్లో నటించి నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న నితిన్ ప్రసన్నకు హీరోగా తెలుగులో ఇది డెబ్యు ఫిలిమ్. అతని క్యారెక్టర్లో చాలా వేరియెషన్స్ ఉన్నాయి. అన్నిట్నీ అద్భుతంగా పండించాడు. అతని వాచకం, బాడీ లాంగ్వేజ్ ప్రతి పాత్రకు విభిన్నంగా ఉండేలా చూసుకున్నాడు. అన్నిటికీ మించి ఫిజికల్ అప్పీరియన్స్ లో తీసుకున్న కేర్ ప్రశంసనీయం. నటుడిగా మంచి భవిష్యత్ ఉంది నితిన్ ప్రసన్నకు.

“మళ్ళీ రావా”తో మంచి గుర్తింపు సంపాదించుకున్న సీరియల్ నటి ప్రీతి అశ్రాని ఈ చిత్రంలో పల్లవి ఆ పాత్రలో ఒదిగిపోయింది. ఓ సగటు భార్యగా, తల్లిగా, మహిళగా ఆమె పాత్రకు జనాలు బాగా కనెక్ట్ అవుతారు.

పోలీస్ విష్ణు పాత్రలో నటించిన రంగధామ్ సబ్టల్ పెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. మంచి ప్రతిభ ఉన్న నటుడు. ఇదివరకు పలు చిత్రాల్లో నటించాడు కానీ ఈస్థాయి వెయిట్ ఉన్న క్యారెక్టర్ మాత్రం దొరకలేదు ఆయనకి. ఈ సినిమాతో రంగధామ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా బిజీ అవ్వడం ఖాయం.

సాంకేతికవర్గం పనితీరు: దర్శకుడు యుగంధర్ ముని డైరెక్షన్ పరంగా అమెరికాలో కొన్ని కోర్సులు చేశాడు. ప్రపంచ సినిమా జ్ణానం మెండుగా ఉండడం వల్ల “ఎడి ఇన్ఫినిటమ్” కథను చాలా పకద్భంధీగా రాసుకున్నాడు. స్క్రీ ప్లేలో కొద్దిపాటి జర్క్స్ & కథపై ప్రేమ ఎక్కువగా పెంచేసుకోవడం వల్ల వచ్చిన ల్యాగ్ మినహా సినిమా మొత్తంలో మైనస్ పాయింట్స్ లేవని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 1975 ఎమర్జెన్సీని కథ కోసం వాడుకున్న తీరు, తక్కువ మంది నటులతో కథనాన్ని ఆసక్తికరంగా నడిపిన విధానం బాగున్నాయి. నిజానికి ఈ సినిమా థీమ్ & మేకింగ్ హెవీ బడ్జెట్ రిక్వైర్ మెంట్ ఉంటుంది. కానీ.. తక్కువ బడ్జెట్ లోను సైంటిఫిక్ థ్రిల్లర్స్ తెరకెక్కించవచ్చు అని ప్రూవ్ చేశాడు యుగంధర్ ముని. యాక్టర్ కమ్ డైరెక్టర్ రవిబాబు తెరకెక్కించిన “అనసూయ” ఛాయలు అక్కడక్కడా కనిపించినా పోలిక ఉండదు. ఓవరాల్ గా తొలి ప్రయత్నంలోనే మంచి హిట్ అందుకున్నాడు యుగంధర్. ప్రమోషన్స్ చేసుకుంటే సినిమా ఇంకాస్త ఎక్కువమంది ఆడియన్స్ కి రీచ్ అయ్యే అవకాశాలున్నాయి.

విజయ్ కురాకుల నేపధ్య సంగీతం అదరగొట్టాడు. రెట్రో & ఫ్యూజన్ మిక్స్ తో థ్రిల్లర్ ఫీల్ తీసుకొచ్చాడు సినిమాకి. నేపధ్య సంగీతం ద్వారా సందర్భం ఎలివేట్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరిగే విషయం. కానీ విజయ్ తన పనితనంతో సన్నివేశంలోని ఇంటెన్సిటీని చక్కగా ఎలివేట్ చేశాడు.

ప్రవీణ్ కె.బంగారి సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎస్సెట్. అంత తక్కువ బడ్జెట్ లో ఇంత మంచి అవుట్ పుట్ ఇవ్వడం అనేది ప్రశంసించాల్సిన విషయం. లైటింగ్ & డి.ఐ విషయంలో తీసుకున్న కేర్ కూడా బాగుంది. ఆడియన్ కి ఒక మంచి థియేట్రికల్ ఎక్స్ పీరియన్స్ ఇవ్వడంలో సక్సెస్ అయ్యాడు ప్రవీణ్.

ప్రొడక్షన్ డిజైన్ & ఆర్ట్ డిపార్ట్ మెంట్ వర్క్ ఆశ్చర్యపరుస్తుంది. తక్కువ లొకేషన్స్ ను డిఫరెంట్ గా రిపీట్ అవ్వకుండా చూపించడం కష్టం. కానీ.. ఈ టీమ్స్ తెలివితో ఆ కష్టాన్ని జయించారు.

విశ్లేషణ: ఓ 20 నిమిషాలు ట్రిమ్ చేసి, మంచి పబ్లిసిటీ చేస్తే సూపర్ హిట్ అవ్వడానికి కావాల్సిన అన్నీ లక్షణాలు ఉన్న సినిమా “ఎడి ఇన్ఫినిటమ్”. మంచి క్యాస్టింగ్, ఆసక్తి రేపే కథనం, ఆకట్టుకొనే టెక్నికల్ బ్రిలియన్స్. ఇలా అన్నీ అంశాలు పుష్కలంగా ఉన్న ఈ చిన్న సినిమా థియేటర్ కి వచ్చిన ప్రేక్షకుడ్ని ఆశ్చర్యపరచడం ఖాయం.

రేటింగ్: 3/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus