అదా శర్మ.. ఇండియ్ సినిమాలోకి వచ్చి చాలా ఏళ్లే అయింది. ఎప్పుడో 2008లో హిందీ సినిమాలోకి వచ్చింది. ఆ తర్వాత 2014లో తెలుగులో సినిమాల్లోకి వచ్చింది. తొలినాళ్లలో ఈ అమ్మాయి స్టార్ హీరోయిన్ అయ్యేలా ఉంది అనిపించినా.. ఆ తర్వాత పాత్రల ఎంపికలో తప్పులు చేసి ఇబ్బందికర ఫలితాలు అందుకుని కెరీర్ను అర్ధాంతరంగా ముగిసిపోయే ప్రమాదంలోకి తెచ్చింది. అయితే రెండేళ్ల క్రితం ‘ది కేరళ స్టోరీ’ సినిమాతో తిరిగి ట్రాక్ ఎక్కింది. ఆ తర్వాత మరో సినిమా కూడా చేసింది. ఇప్పుడు కాస్త ఓకే అనిపించుకుంటోంది.
అయితే, పైన చెప్పిన రెండు సినిమాలు ఎంతటి పేరు తీసుకొచ్చాయో, అంతే ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టాయి. ఈ విషయాన్ని ఆమెనే చెప్పుకొచ్చింది. ‘ది కేరళ స్టోరీ’ సినిమా విడుదలయ్యే వరకూ మంచి స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూసింది అదా శర్మ. ఆ సినిమా విజయం తర్వాత కెరీర్ మారిపోయింది. ఆ వెంటనే ‘బస్తర్: ది నక్సల్ స్టోరీ’ చేసింది. అదీ మంచి పేరు తెచ్చింది. అయితే ఈ రెండు సినిమాలు చేసినప్పుడు పెద్ద ఎత్తున బెదిరింపులు వచ్చాయి.
ఆ సమయంలో దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారు. మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారు అప్పటి పరిస్థితుల గురించి మాట్లాడింది అదా శర్మ. ఆ సినిమా కథా నేపథ్యమే ఈ పరిస్థితులకు కారణం. అప్పట్లో ఆ సినిమా కొన్ని వర్గాల వారికి నచ్చలేదు. ఇంతలా ఇబ్బంది పెట్టే స్క్రిప్ట్‌లు చేయాలా అని అంటే.. పాత్రలో భావోద్వేగం లేకపోతే నాకు నచ్చదు. యాక్షన్ సన్నివేశాలు కూడా ఉండాలి. అంతేకానీ లీటర్ల లీటర్లు కన్నీళ్లు కార్చి.. నన్ను నేను డీహైడ్రేట్ చేసుకునే పాత్రలు చేయను. అందుకే ఇలాంటి బలమైన పాత్రలు ఎంచుకుంటున్నాను అని చెప్పింది అదా శర్మ.
‘తుమ్‌కో మేరీ కసమ్’ అనే సినిమాతో ఈ ఏడాది మార్చిలో ప్రేక్షకులను పలకరించిన అదా శర్మ.. త్వరలో ‘రీటా సన్యాల్ 2’ వెబ్ సిరీస్తో రాబోతోంది. ఇంకా ఆమె చేతిలో ‘1920’ సినిమా సీక్వెల్, యామీ గౌతమ్‌తో కలసి నటిస్తున్న ‘తమసుర్’ అనే సినిమా కూడా ఉన్నాయి.