యాక్టర్, డైరెక్టర్ ఆదిత్య ఓం గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ‘లాహిరి లాహిరి లాహిరిలో’ సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసిన ఆదిత్య ఓం.. ఆ తర్వాత పలు తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించి సిల్వర్ స్క్రీన్‌పై హీరోగా, విలన్‌గా తన మార్క్ చూపించారు. 2018లో మాసాబ్ అనే హిందీ చిత్రానికి దర్శకత్వం వహించి మరో టాలెంట్ బయటపెట్టారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఆయన తాజాగా జరిగిన రెండు ఫిల్మ్ ఫెస్టివల్స్‌లో ఉత్తమ నటుడిగా అవార్డు గెలుచుకున్నారు.
ఆదిత్య ఓం నటిస్తున్న తాజా చిత్రం ‘దహ్నం’. ఈ సినిమాలో బ్రాహ్మణ పూజారిగా ఆయన నటనకు గాను ప్రశంసలతో పాటు అవార్డ్స్ దక్కాయి. రాజస్థాన్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ యొక్క ప్రతిష్టాత్మక ఎనిమిది ఎడిషన్లలో ప్రాంతీయ చలనచిత్ర విభాగంలో ఉత్తమ నటుడిగా అవార్డు పొందారు ఆదిత్య ఓం. ఈ గ్రాండ్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో రణధీర్ కపూర్ వంటి దిగ్గజాలకు లైఫ్‌టైమ్ అచీవ్‌మెంట్ అవార్డులను అందించారు.
మరోవైపు ఇదే ‘దహ్నం’ చిత్రానికి గాను ఆదిత్య ఓంకు ముంబైలోని ప్రైమ్ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ఉత్తమ నటుడి అవార్డు లభించింది. దీంతో ఎంతో ఆనంద పడుతున్న ఈ హీరో.. తాను మళ్లీ మెయిన్ స్ట్రీమ్ తెలుగు సినిమాలకు కనెక్ట్ అయ్యేలా చేయడంలో ఈ అవార్డులు ఎంతగానో దోహదపడతాయని ఆశిస్తున్నారు.
అలాగే ఈ ‘దహ్నం’ చిత్రానికి రచన, దర్శకత్వం వహించిన మూర్తి అడారికి కూడా అవార్డు లభించింది. ఉత్తమ కథ అవార్డుతో పాటు విమర్శకుల మెప్పు పొందిన దర్శకుడిగా అవార్డు దక్కింది. ఈ చిత్రాన్ని డాక్టర్ పి సతీష్ నిర్మించగా.. డాక్టర్ సాయి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. అన్ని లాంఛనాలతో పూర్తయిన ఈ సినిమా జూన్ నెలలో OTTలో రిలీజ్ కాబోతోంది.