దాదాపు రూ.200 కోట్ల బడ్జెట్ తో ‘కన్నప్ప’ చిత్రాన్ని తీశానని మంచు విష్ణు ప్రచారం చేసుకున్నాడు. ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్, శరత్ కుమార్ వంటి స్టార్స్ నటించారు కాబట్టి.. బడ్జెట్ అవుతుందని అంతా నమ్మారు. కమర్షియల్ గా ఈ సినిమా ఎలా ఆడింది అనేది పక్కన పెట్టేస్తే.. ‘కన్నప్ప’ తో మంచు విష్ణు మళ్ళీ ఫామ్లోకి వచ్చాడు అనేది వాస్తవం. నటుడిగా కూడా తనని తాను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు అనేది కూడా వాస్తవం.
సో మంచు విష్ణుని హీరోగా పెట్టి సినిమాలు చేయడానికి కూడా నిర్మాతలు రెడీగానే ఉన్నారు. కానీ మొదటి నుండి మంచు విష్ణు ఎందుకో వేరే ప్రొడక్షన్ హౌస్లలో సినిమాలు ఎక్కువగా చేయదు. ‘ఢీ’ తీసేస్తే వేరే బ్యానర్లలో మంచు విష్ణు ఎక్కువగా సినిమాలు చేసింది లేదు. దానికి కారణాలు ఏంటి అనేది ఎవ్వరికీ తెలీదు. ఇదిలా ఉంటే.. ‘కన్నప్ప’ తర్వాత మంచు విష్ణు ఏ ప్రాజెక్టు చేస్తాడు? అనే ఆసక్తి అందరిలోనూ నెలకొంది.
ఈ క్రమంలో ‘మైక్రో’ ప్రాజెక్టులు చేయడానికి అతను రెడీ అయినట్టు ఇటీవల ప్రకటించాడు. ఏదో ఒక పాపులర్ పాత్రను తీసుకుని కొన్ని నిమిషాల నిడివి అంటే.. మొత్తంగా 7 నుండి 10 నిమిషాల నిడివితో స్టోరీస్ చేయడం వంటివి అనమాట. ఇలాంటి వాటి కోసం వంద కోట్లు పెట్టుబడి పెట్టడానికి రెడీ అని మంచు విష్ణు వెల్లడించడం జరిగింది. ఏదో గ్రాఫిక్స్ తో చుట్టేయడం అని కాకుండా క్వాలిటీతో కూడిన విజువల్స్ తో కంటెంట్ డెలివరీ చేయాలనేది మంచు విష్ణు ఆలోచన అని తెలిపారు. అయితే వీటికి బడ్జెట్ కూడా ఎక్కువగానే పెట్టాల్సి ఉంటుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో మంచు విష్ణు ఆలోచన ప్రాక్టికల్ గా ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.