AIR Review in Telugu: AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్ వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్ !

Cast & Crew

  • హర్ష్ రోషన్, భానుప్రకాష్, జయతీర్థ (Hero)
  • అక్షర (Heroine)
  • హర్ష చెముడు, చైతన్య రావు, జీవన్ కుమార్, సందీప్ రాజ్, అక్షర, సునీల్ (Cast)
  • జోసెఫ్ క్లింటన్ (Director)
  • సందీప్ రాజ్ - సూర్య వాసుపల్లి (Producer)
  • అనివీ - సినిజిత్ ఎర్రమిల్లి (Music)
  • ఎస్.ఎస్.మనోజ్ (Cinematography)
  • శ్రీకాంత్ పట్నాయక్ ఆర్ (Editor)
  • Release Date : జూలై 03, 2025
  • పాకెట్ మనీ పిక్చర్స్ (Banner)

దర్శకుడిగా, నటుడిగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తుంపు సంపాదించుకున్న సందీప్ రాజ్ నిర్మాతగా మారి రూపొందించిన వెబ్ సిరీస్ “AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్”. సగటు 10వ తరగతి విద్యార్థి ఇంటర్ లో ఎదుర్కొనే ఇబ్బందులు, పడే బాధలు, పరిచయం చేసుకొనే స్నేహాలు, అలవాట్లు, వ్యామోహాలు ప్రధానాంశాలుగా తెరకెక్కిన ఈ 7 ఎపిసోడ్ల వెబ్ సిరీస్ నేటి (జూలై 03) నుండి ఈటీవీ విన్ యాప్ లో స్ట్రీమ్ అవుతోంది. ఈ సిరీస్ ప్లస్ పాయింట్స్ ఏంటి? ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేది చూద్దాం..!!

AIR (All India Rankers) Review

కథ: టెన్త్ రిజల్ట్స్ వచ్చాక ఎవరి ఇంట్లో పరిస్థితైనా “నెక్స్ట్ ఏంటి?” అనేదే. అలా ఏం చేద్దామా అనే కన్ఫ్యూజన్ లో అమ్మాయి కోసం ఒకడు, తండ్రి ఫోర్స్ చేయడంతో ఒకడు, మంచి భవిష్యత్తు కోసం ఇంకొకడు విజయవాడలోని AIR అనే కాలేజ్ లో ఐఐటీ ఇంటిగ్రేడెట్ ఇంటర్మీడియట్ కోర్స్ లో జాయినవుతారు. ఆ ముగ్గురే అర్జున్ (హర్ష్ రోషన్), ఇమ్రాన్ (భానుప్రకాష్), రాజు (జయతీర్థ). ఆ కాలేజ్ లో వాళ్ళు ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నారు? ఎలా నిలదొక్కుకున్నారు? అనేది వెబ్ సిరీస్ కథాంశం.

నటీనటుల పనితీరు: ఈ సిరీస్ లో నాకు పర్సనల్ గా నచ్చిన అంశం.. ప్రతి ఒక్క పాత్రకి ప్రోపర్ ఆర్క్ ఉండడం. సాధారణంగా కీరోల్స్ కి ఆర్క్ పెట్టేసి, మిగతా పాత్రలన్నీ ఏవో ఉన్నాయి అన్నట్లుగా చుట్టేస్తారు. అలా కాకుండా ప్రతి పాత్ర విషయంలో కేర్ తీసుకున్నారు. అందువల్ల ఏ ఒక్క పాత్ర అనవసరం అనిపించదు.

హర్ష్ రోషన్, భానుప్రకాష్, జయతీర్థ ఒకరితో ఒకరు పోటీపడి మరీ నటించారు. ముగ్గురూ సమానమైన పెర్ఫార్మెన్స్ తో అలరించారు. వాళ్ల ఎమోషన్స్ కి ఆడియన్స్ కనెక్ట్ అవుతారు, ఆ ఎమోషన్స్ తో ట్రావెల్ చేస్తారు. ముఖ్యంగా 90’s లో పుట్టినవాళ్ళకి, హాస్టల్ లో గడిపిన వాళ్ళకి ఈ పాత్రలు, పరిస్థితులు, సందర్భాలు చాలా రిలేటబుల్ గా ఉంటాయి.

జీవన్ పాత్రను మొదట్లో కామెడీగా చూసినా, అనంతరం కనెక్ట్ అవుతాం. అలాగే.. సందీప్ రాజ్ ప్లే చేసిన మ్యానేజ్మెంట్ హెడ్ రోల్ లో కనిపించే పొగరు, బలుపు సిరీస్ కి మంచి వెయిటేజ్ యాడ్ చేసింది.

అలాగే.. సమీర్ ఈ సిరీస్ తో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. కొడుకుతో బాత్ రూమ్ బయట కూర్చుని మాట్లాడే సన్నివేశంలో అతడి నటన కంటతడి పెట్టిస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు: సినిజిత్ బ్యాగ్రౌండ్ స్కోర్ ఈ సిరీస్ కి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ అని చెప్పాలి. నేపథ్య సంగీతం ఎక్కడో విన్నట్లు అనిపించకపోవడం మరో ప్లస్ పాయింట్. అందువల్ల చాలా ఫ్రెష్ ఫీల్ ఇచ్చింది. ముఖ్యంగా వోకల్స్ తో ఇచ్చిన బీజీయం బాగుంది. మనోజ్ సినిమాటోగ్రఫీ వర్క్ డీసెంట్ గా ఉంది. ప్రొడక్షన్ టీమ్, ఆర్ట్ టీమ్ తో సరైన ప్లానింగ్ తో ఎక్కడా వేస్టేజ్ లేకుండా ప్లాన్ చేసుకున్న తీరు ప్రశంసనీయం.

సీజీ వర్క్ విషయంలో దొరికిపోయినప్పటికీ.. ఆ మైనస్ ను ఎమోషన్స్ & కామెడీ కవర్ చేశాయి.

ఈ సిరీస్ ను తెరకెక్కించే విషయంలో దర్శకరచయిత జోసెఫ్ క్లింటన్ తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాలి. ఎక్కడా అనవసరమైన సందర్భాలు లేకుండా చాలా సింపుల్ గా క్లీన్ కామెడీతో సిరీస్ ను నడిపించాడు. అలాగే.. విజయవాడలోని కొన్ని క్యాస్ట్ బేస్డ్ ఇన్సిడెంట్స్ ను ఎవ్వరినీ ఇబ్బందిపెట్టకుండా కవర్ చేసిన విధానం, మరీ ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ ను కంపోజ్ చేసుకున్న తీరు. క్యారెక్టర్ ఆర్క్స్ ను మ్యానేజ్ చేసిన విధానం బాగా కుదిరాయి. కొన్ని ఎపిసోడ్స్ కాస్త సాగినట్లుగా అనిపించినప్పటికీ.. ఎక్కడా బోర్ కొట్టలేదు. ఒక్కో సెట్ ఆఫ్ ఆడియన్స్ ఒక్కో ఎపిసోడ్ కి కనెక్ట్ అవుతారు. ఓవరాల్ గా.. జోసెఫ్ క్లింటన్ రచయితగా, దర్శకుడిగా మంచి విజయాన్ని అందుకున్నాడనే చెప్పాలి.

విశ్లేషణ: హిందీలో TVF సిరీస్ లు చూసినప్పుడు మనకి తెలుగులో ఆ స్థాయి క్వాలిటీ కంటెంట్ ఎందుకు తీయలేరు అనిపించేది. “AIR: ఆల్ ఇండియా ర్యాంకర్స్” ఆ లోటు కాస్త తీర్చిందనే చెప్పాలి. అసభ్యత లేని హాస్యం, ఇబ్బందిలేని సన్నివేశాలు, తమను తాము చూసుకునే సందర్భాలు చాలా ఉన్నాయి ఈ సిరీస్ లో. కుటుంబం మొత్తం కలిసి సరదాగా చూడగలిగే సిరీస్ ఇది. హ్యాపీగా వీకెండ్ కి బింజ్ వాచ్ చేయొచ్చు.

ఫోకస్ పాయింట్: కొన్ని తీపి, ఇంకొన్ని చేదు జ్ఞాపకాలను తలపించిన “AIR”!

రేటింగ్: 3/5

Rating

3
Read Today's Latest Reviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus