ఎన్నో వాయిదాలు, ఆర్థిక ఇబ్బందులు దాటుకుని ఎట్టకేలకు బాలయ్య ‘అఖండ 2’ థియేటర్లలోకి వచ్చింది. డిసెంబర్ 5న రావాల్సిన సినిమా, మద్రాస్ హైకోర్టు స్టే వల్ల లేట్ గా రిలీజ్ అయ్యింది. సరే, సినిమా వచ్చింది కదా ఇక అంతా హ్యాపీ అనుకుంటే, ఇప్పుడు తెలంగాణ హైకోర్టు రూపంలో మరో కొత్త సమస్య వచ్చి పడింది. రిలీజ్ సంబరాల్లో ఉన్న చిత్ర యూనిట్ కు ఇది నిజంగా షాకింగ్ న్యూస్.
అసలు విషయం ఏంటంటే.. సినిమా ప్రీమియర్స్ కు, టికెట్ రేట్ల పెంపుకు ప్రభుత్వం ఇచ్చిన జీవోను తెలంగాణ హైకోర్టు నిన్న మధ్యాహ్నమే సస్పెండ్ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ప్రీమియర్స్ వేయకూడదు, పెంచిన రేట్లు అమలు చేయకూడదు. కానీ నిర్మాతలు కోర్టు ఆర్డర్స్ ను పక్కన పెట్టి, నిన్న రాత్రి యథావిధిగా ప్రీమియర్ షోలు వేసేశారని ఆరోపణలు వచ్చాయి.
దీనిపై విజయ్ గోపాల్ అనే న్యాయవాది సీరియస్ అయ్యారు. కోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించి షోలు వేశారంటూ తాజాగా కోర్టు ధిక్కరణ పిటిషన్ దాఖలు చేశారు. న్యాయస్థానం వద్దు అని చెప్పినా, షోలు ఎలా వేస్తారంటూ ఆయన పాయింట్ లేవనెత్తారు. దీన్ని పరిగణలోకి తీసుకున్న కోర్టు, ఈ పిటిషన్ పై విచారణకు అంగీకరించింది. ఈ మధ్యాహ్నమే దీనిపై విచారణ జరగనుంది.
నిజానికి ఈ సినిమా కోసం తెలంగాణ ప్రభుత్వం భారీగానే రేట్లు పెంచుకునే ఛాన్స్ ఇచ్చింది. సింగిల్ స్క్రీన్స్ కు రూ. 50, మల్టీప్లెక్స్ లకు రూ. 100, అలాగే ప్రీమియర్ షోలకు ఏకంగా రూ. 600 టికెట్ రేటు నిర్ణయించింది. కానీ కోర్టు ఈ పెంపును అడ్డుకుంది. అయినా సరే షోలు జరిగిపోవడంతో ఇప్పుడు లీగల్ గా మేకర్స్ ఇబ్బందుల్లో పడ్డారు.
ఇప్పటికే మద్రాస్ హైకోర్టులో ఫైనాన్షియల్ సెటిల్మెంట్ చేసుకుని బయటపడ్డారు. కానీ ఇప్పుడు తెలంగాణలో కోర్టు ధిక్కరణ కేసు అంటే చిన్న విషయం కాదు. నిన్నటి ధరల పెంపు కేసు, ఇవాళ దాఖలైన ధిక్కరణ పిటిషన్.. రెండూ ఇప్పుడు మేకర్స్ మెడకు చుట్టుకునేలా ఉన్నాయి. సినిమా థియేటర్లలో రన్ అవుతున్నా, తెర వెనుక ఈ న్యాయపరమైన గొడవలు ఇంకా ముగియలేదు. కోర్టు తీర్పు కనుక సీరియస్ గా ఉంటే, నిర్మాతలు చిక్కుల్లో పడే అవకాశం ఉంది. మరి ఈ లీగల్ యుద్ధం నుంచి ‘అఖండ 2’ టీమ్ ఎలా బయటపడుతుందో చూడాలి.