అక్కినేని ప్రిన్స్ అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎదురుచూస్తున్నారు. అతని మొదటి చిత్రం అఖిల్ పూర్తిగా నిరాశపరిచింది. తర్వాత విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన హలో సినిమా ఫరవాలేదనిపించింది. అందుకే ఈ సారి కమర్షియల్ హిట్ కొట్టాలని తమ కుటుంబానికి కలిసి వచ్చే ప్రేమ కథని ఎంచుకున్నారు. తొలి ప్రేమ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన వెంకీ అట్లూరి దర్శకత్వంలో నటించడానికి అఖిల్ ఓకే చెప్పిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకి ప్రీ ప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఎస్.ఎస్. థమన్ స్వరాలూ కూర్చే పనిలో బిజీగా ఉన్నారు. నిన్న ఓ షాపింగ్ మాల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న అఖిల్ తన సినిమా గురించి చెప్పారు.
త్వరలోనే తాము రెండు నెలల భారీ షెడ్యూల్ కోసం లండన్ వెళ్లనున్నట్లు స్పష్టం చేశారు. అక్కడే సినిమా దాదాపు పూర్తి కానుంది. ఇక ఈ సంవత్సరం స్కై డైవింగ్ చేయనున్నట్లు వెల్లడించారు. “స్కై డైవింగ్ అంటే నాకు కొంచెం భయంగా ఉంది. అయినా ఈ ఏడాది ట్రై చేస్తాను” అని అన్నారు. ఓ వాణిజ్య ప్రకటన కోసం అఖిల్ బంగీ జంప్ చేసిన సంగతి తెలిసిందే. మరి స్కై డైవింగ్ ని ప్రకటన కోసం చేస్తారా? సరదాగా చేస్తారా? అనే విషయంలో క్లారిటీ ఇవ్వలేదు. బీవీఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న అఖిల్ మూడో సినిమాపై అక్కినేని అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు.