టాలీవుడ్ లో ఆరడుగుల ఆజానుబాహులు ప్రభాస్, రానా సహా పెళ్ళీడొచ్చినా పెళ్ళి పీఠలెక్కని, తాళిబొట్టు పట్టని హీరోలు చాలామంది ఉన్నారు. అయితే ప్రస్తుత టార్గెట్ మాత్రం అక్కినేని అన్నదమ్ములే. అందునా నాగచైతన్యపై జనాల దృష్టి కాస్త గట్టిగానే ఉంది. స్టార్ హీరోయిన్ అయిన సమంత దీనికి అసలు కారణమన్న సంగతి తెలిసిందే. ప్రేమ వ్యవహారం ఎటూ బయటపడిపోయింది గనక తర్వాతి ఘట్టం పెళ్ళే అనుకుంటే ఇప్పట్లో ఆ ముచ్చట జరిగేలా లేదు.
నాగచైతన్య ప్రేమ కబురుతోనే అఖిల్ ప్రేమ వ్యవహారం కూడా బయటకొచ్చింది. దాంతో అక్కినేని వారింట పెళ్ళి బాజాలు మోగనున్నాయని, ఇద్దరి పెళ్ళిళ్ళు ఒకేసారి జరుగుతాయని రకరకాల కథనాలు వెలువడ్డాయి. తీరా నాగ్ ఎంటరై చైతూ పెళ్ళికి సమయం కావాలని అడిగాడని చెప్పుకొచ్చారు. నిన్నటికి నిన్న చైతూ కూడా తన పెళ్ళికి ఇంకా సమయముందని, ఈలోపు అఖిల్ పెళ్లి అవ్వొచ్చని చెప్పుకొచ్చాడు. పైగా చిన్న వయసులోనే పెళ్లి విషయంపై నిర్ణయం తీసుకోవడానికి ధైర్యం ఉండాలని పొగడ్తల వర్షం కూడా కురిపించాడు. అంతా బానే వుంది కానీ తన పెళ్ళి ఆలస్యానికి గల కారణమేమిటన్నది మాత్రం ఇతగాడు బయటపెట్టడం లేదు. ఏమయ్యుంటుందంటారు..?