“30 రోజుల్లో ప్రేమించడం ఎలా?” సినిమాతో మంచి కమర్షియల్ సక్సెస్ సొంతం చేసుకున్న ప్రదీప్ మాచిరాజు (Pradeep Machiraju) కాస్త గ్యాప్ తీసుకొని “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” (Akkada Ammayi Ikkada Abbayi) అంటూ ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. దీపిక (Deepika Pilli) హీరోయిన్ గా ఇంట్రడ్యూస్ అయిన ఈ సినిమా ద్వారా ఈటీవీ ఆస్థాన షో మేకర్స్ నితిన్ (Kanaparthi Sai Nitin)-భరత్ దర్శకులుగా పరిచయమయ్యారు. ట్రైలర్ & ప్రమోషనల్ కంటెంట్ మంచి వైరల్ అయ్యాయి. మరి సినిమా ఎలా ఉంది? ప్రదీప్ సెకండ్ సినిమాతో హిట్ కొట్టాడా? లేదా? అనేది చూద్దాం..!!
కథ: దాదాపు 60 మంది మగ బిడ్డల తర్వాత పుట్టిన ఏకైక ఆడపిల్ల రాజకుమారి (దీపిక). ఆమె పుట్టాకే ఊరికి మంచి జరిగింది కాబట్టి, ఆమెను ఎప్పటికీ ఊరు దాటనివ్వకూడదు అని నిశ్చయించుకుంటారు ఊరి జనం. ఆఖరికి పెళ్లి కూడా ఆ ఊర్లోని 60 మంది అబ్బాయిల్లో ఎవర్నో ఒకర్ని చేసుకోవాలని డిసైడ్ చేసేస్తారు.
కట్ చేస్తే.. ఒక భారీ ప్రాజెక్ట్ కోసం ఆ ఊరికి వచ్చిన కృష్ణ (ప్రదీప్ మాచిరాజు)ను తొలి ముద్దులోనే ప్రేమించేస్తుంది రాజా. దాంతో అసలు కథ మొదలవుతుంది. కృష్ణ-రాజాల ప్రేమను ఊరి జనం అంగీకరించారా? ప్రేమను గెలిపించుకోవడం కోసం కృష్ణ ఎన్ని కష్టాలు పడ్డాడు? అనేది “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” (Akkada Ammayi Ikkada Abbayi) కథాంశం.
నటీనటుల పనితీరు: ప్రదీప్ మాచిరాజు కామెడీ టైమింగ్ & బాడీ లాంగ్వేజ్ అందరికీ సుపరిచితమే.. ఈ సినిమాలోనూ ఏమాత్రం తగ్గకుండా తనదైన కామెడీ టైమింగ్ & స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకున్నాడు. దీపిక ప్లే చేసిన రాజకుమారి రోల్ ప్రతి హీరోయిన్ కి డ్రీమ్ డెబ్యూ లాంటిది. ఎందుకంటే.. కమర్షియల్ సినిమాల్లో కేవలం పాటలు లేదా హీరోతో రొమాన్స్ కోసం కనిపిస్తుండే హీరోయిన్ల పాత్రలను చూస్తూ వచ్చాం. అలాంటిది అసలు సినిమా కథ తిరిగేదే రాజకుమారి పాత్ర చుట్టూ. ఆ పాత్రలో అంతే అలవోకగా ఒదిగిపోయి, చక్కని నటనతో ఆకట్టుకుంది దీపిక.
ఇక సత్య (Satya Akkala), గెటప్ శ్రీనుల (Getup Srinu) కామెడీ టైమింగ్ ఫస్టాఫ్ వరకు హిలేరియస్ గా ఆకట్టుకుంది. వాళ్ల కామెడీ పంచులు మరియు సీన్స్ కి థియేటర్లు ఘొల్లుమనాల్సిందే. ఇక సినిమాలో వెన్నెల కిషోర్ (Vennela Kishore), బ్రహ్మాజీ, మురళీధర్ గౌడ్ (Muralidhar Goud) వంటి మిగతా కమెడియన్స్ కూడా ఉన్నప్పటికీ.. వారి పాత్రలు కానీ కామెడీ కానీ అంతగా వర్కవుట్ అవ్వలేదు. ఝాన్సీకి ఉన్నవి తక్కువ సీన్స్ అయినప్పటికీ.. ఆమె సీనియారిటీతో మంచి ఇంపాక్ట్ క్రియేట్ చేసింది.
సాంకేతికవర్గం పనితీరు: రధన్ (Radhan) మ్యూజిక్ & బాల్ రెడ్డి సినిమాటోగ్రఫీ సినిమాకి మెయిన్ ఎసెట్స్. చిన్న బడ్జెట్ సినిమాలకి ఈ స్థాయి టెక్నికల్ క్వాలిటీ చూడడం అనేది చాలా అరుదు. అలాగే.. చిత్రబృందం కీలకమైన డి.ఐ & కలరింగ్ విషయంలో రాజీపడకపోవడం కూడా సినిమాకి ప్లస్ అయ్యింది. ముఖ్యంగా రధన్ పాటలు వినసొంపుగా మాత్రమే కాక చూడముచ్చటగా ఉన్నాయి.
కథ కోర్ పాయింట్ కొత్తగా ఉంది. అలాగే.. ఆ కథను ఎస్టాబ్లిష్ చేసిన విధానం కూడా డీసెంట్ గా ఉంది. అందువల్ల ఆడియన్స్ కి పెద్దగా లాజికల్ డౌట్స్ రాలేదు.
నితిన్-భరత్ కి బుల్లితెర ఎక్స్ పీరియన్స్ మహాబాగా ఉండడం, ఎలాంటి జోక్స్ ఎలా ల్యాండ్ అవ్వాలి, వాటిని ఆడియన్స్ ఎలా రిసీవ్ చేసుకుంటారు అనే క్లారిటీ ఉండడంతో “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రంలో కామెడీ పంచులు కానీ, సీక్వెన్సులు కానీ చాలా ఆర్గానిక్ గా వర్కవుట్ అయ్యాయి. గ్రౌండ్ కూడా అదే స్థాయిలో ప్రిపేర్ చేసి ఆడియన్స్ ను అందులో లీనం చేశారు ఈ దర్శక ద్వయం. అయితే.. సెకండాఫ్ కి వచ్చేసరికి 60 మందికి పెళ్లి అనే కాన్సెప్ట్ సరిగా సింక్ అవ్వలేదు, అలాగే.. ఎండింగ్ కంగారుగా ముగించిన భావన కలుగుతుంది. సెకండాఫ్ కూడా సరిగ్గా రాసుకుని ఉంటే సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యేది. ఓవరాల్ గా.. దర్శకద్వయం నితిన్-భరత్ తమ టాలెంట్ ను సక్సెస్ ఫుల్ గా ఆడియన్స్ కు రుచి చూపించి, ఇండస్ట్రీలో స్థానం సంపాదించుకున్నారనే చెప్పాలి.
విశ్లేషణ: కథ బాగుంది, కథనం ఆకట్టుకునే విధంగా ఉంది. పాత్రల చుట్టూ అల్లిన డ్రామా కూడా డీసెంట్ గా ఉంది. ఒక హిట్ సినిమాకి ఇంతకుమించి కావాల్సిందేముంటుంది. అయితే.. సెకండాఫ్ లో ఎమోషన్ సరిగా వర్కవుట్ అవ్వకపోవడం, కామెడీ కూడా సరిగ్గా వర్కవుట్ అవ్వకపోవడం వంటి మైనస్ పాయింట్స్ ను ఇగ్నోర్ చేయగలిగితే.. “అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి” చిత్రాన్ని హ్యాపీగా థియేటర్లలో కూర్చుని ఎంజాయ్ చేయొచ్చు.
ఫోకస్ పాయింట్: సెకండ్ సినిమా సిండ్రోమ్ నుంచి తప్పించుకున్న ప్రదీప్!
రేటింగ్: 2.5/5