ప్రముఖ దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ తెరకెక్కించిన తాజా చిత్రం “తేరే ఇష్క్ మే”. ధనుష్-కృతి సనన్ జంటగా రూపొందిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి అంచనాలను పెంచింది. ముఖ్యంగా రెహమాన్ సంగీతం ఈ సినిమాని ఎక్కడికో తీసుకెళ్ళిపోయింది. మరి సినిమాగా “తేరే ఇష్క్ మే” ఏమేరకు అలరించగలిగింది? అనేది చూద్దాం..!!

కథ:
“నో” అనే పదాన్ని సైతం యాక్సెప్ట్ చేయలేని ఓ సగటు కుర్రాడు శంకర్ (ధనుష్). శంకర్ నో తీసుకోలేడని తెలిసి అతని ప్రేమని యాక్సెప్ట్ చేయలేక, అతడ్ని రిజెక్ట్ చేయలేక నెట్టుకొస్తుంటుంది ముక్తి (కృతి సనన్).
ఈ ఇద్దరి ప్రేమ ఎలాంటి స్టేజ్ కి చేరుకుంది? ఒకరి ప్రేమను ఒకరు అర్థం చేసుకోగలిగారా? చివరికి ఏం జరిగింది? అనేది “తేరే ఇష్క్ మే” చూసి తెలుసుకోవాలి.

నటీనటుల పనితీరు:
ధనుష్ నటన ఒక క్యారెక్టర్ స్టడీ లాంటిది. సదరు పాత్ర బాధని, భావాన్ని అర్థం చేసుకుంటే ధనుష్ నట విశ్వరూపం కనిపిస్తుంది, అర్థం కాకపోతే మాత్రం ఏంట్రా ఇది అనిపిస్తుంది. కానీ.. డీప్ & ట్రబుల్డ్ ఎమోషన్స్ ను ప్రొజెక్ట్ చేయడంలో నటుడిగా తన స్థాయిని పెంచుకోగలిగాడు ధనుష్. ఇది ధనుష్ బెస్ట్ వర్క్ అని చెప్పొచ్చు.
కృతి సనన్ క్యారెక్టర్ ప్రస్తుత తరం అమ్మాయిలను రీప్రెజెంట్ చేస్తుంది. చాలా క్లారిటీ ఉన్న నవతరం అమ్మాయిగా కృతి నటన, ఆమె స్క్రీన్ ప్రెజన్స్ చాలా పర్ఫెక్ట్ గా ఉన్నాయి.
ప్రకాష్ రాజ్ పాత్ర నిడివి చిన్నదే అయినప్పటికీ.. మంచి ఎమోషన్ యాడ్ చేస్తుంది.

సాంకేతికవర్గం పనితీరు:
దర్శకుడు ఆనంద్ ఎల్.రాయ్ ఒక దర్శకుడిగా కంటే రచయితగా ఎప్పటికప్పుడు ఆశ్చర్యపరుస్తూనే ఉంటాడు. ఇప్పటివరకు అతడు రాసిన ప్రేమకథల్లో “తేరే ఇష్క్ మే” ది బెస్ట్ అని చెప్పొచ్చు. ముఖ్యంగా ధనుష్-కృతి సనన్ పాత్రలను డిజైన్ చేసిన విధానం ఆడియన్స్ ను కట్టిపడేస్తుంది. ప్రేమకథల్లో లేదా ప్రేమలో సరికొత్త కోణాన్ని చాలా సహజంగా ఆవిష్కరించాడు ఆనంద్. ఫస్టాఫ్ లో క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్స్ కోసం సినిమాటిక్ లిబర్టీస్ ఎక్కువగా తీసుకున్న ఆనంద్.. సెకండాఫ్ ను నడిపించిన విధానం ప్రేక్షకుల్ని కచ్చితంగా కట్టిపడేస్తుంది. ప్రతి సంభాషణలో మెచ్యూరిటీ కనిపిస్తుంది. మనుషుల ఆలోచన, వ్యవహార శైలి మీద క్లారిటీ ఉన్న ఒక అమ్మాయి.. ఒక అబ్బాయిని, అది కూడా టాక్సిక్ బిహేవియర్ ఉన్న కుర్రాడిని ఎలా డీల్ చేసింది అనేది సినిమా కోర్ పాయింట్. ఆ పాయింట్ ను డీల్ చేసిన విధానం కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది. పీక్ లెవల్ ఎమోషన్ ఉంటుంది, డీప్ థాట్స్ ఉన్నాయి. వాటిని బ్యాలెన్స్ చేసిన విధానం హత్తుకుంటుంది. ఇప్పటివరకు టాక్సిక్ రిలేషన్స్ ను దర్శకులు హ్యాండిల్ చేసిన విధానంలో కుదిరితే అబ్బాయిది తప్పు అని లేదా.. అమ్మాయిది తప్పు అని డిజైన్ చేశారు. కానీ.. “తేరే ఇష్క్ మే” చిత్రంలో తప్పు ఎవరిది అనే విషయంలో పాటించిన బ్యాలెన్స్ భలే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది. ఇది ఇప్పటివరకు ఎవరూ టచ్ చేయని ఒక కోణం.
సినిమాలో ఎమోషన్ ను ప్రేక్షకుడు అనుభూతి చెందేలా చేయడంలో రెహమాన్ కీలకపాత్ర పోషించాడు. ప్రొడక్షన్ వర్క్ & సీజీ విషయంలో తప్పులు దొర్లుతున్నప్పటికీ.. వాటన్నిటినీ రెహమాన్ తన నేపథ్య సంగీతంతో కవర్ చేసేసాడు. ముఖ్యంగా క్లైమాక్స్ సాంగ్ కి ప్రేక్షకులు కంటతడి పెట్టాల్సిందే. సయ్యారా చూసి భోరున ఏడ్చేసిన జనాలు.. ఈ సినిమా చూసి ఎమోషన్ ను ఫీల్ అవ్వడం ఖాయం.

విశ్లేషణ:
ధనుష్ లాంటి అల్టీమేట్ యాక్టర్ కి ఫ్రీడం ఇచ్చి, మంచి క్యారెక్టర్ ఇస్తే ఎన్ని అద్భుతాలు సృష్టించగలదు అనే దానికి “తేరే ఇష్క్ మే” తాజా ఉదాహరణ. బాధని, ప్రేమని, కోపాన్ని చాలా కొత్తగా చూపించారు. ఇది అందరూ కనెక్ట్ అయ్యే సినిమా కాదు.. కానీ కనెక్ట్ అయితే మాత్రం సెకండాఫ్ కోసమైనా రెండోసారి చూస్తారు. గొప్ప సినిమా అని చెప్పలేం కానీ.. చాలా డీప్ సినిమా. ఈ సినిమాలోని ఎమోషన్స్ ను సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఒక థీసిస్ చేసినట్లే. అలాగే.. కృతి సనన్ లోని నటిని అత్యద్భుతంగా వినియోగించుకున్న చిత్రమిది. ఇక రెహమాన్ సంగీతం నవ్విస్తుంది, ఏడిపిస్తుంది. ఒక భిన్నమైన ప్రేమకథను, ప్రేమలోని ఓ కొత్త కోణాన్ని అనుభూతి చెందడం కోసం “తేరే ఇష్క్ మే” చూడాల్సిందే. కాకపోతే.. ఫస్టాఫ్ ను మాత్రం కాస్త భరించగలగాలి.

ఫోకస్ పాయింట్: నవతరం ప్రేమలోని సరికొత్త కోణం!
రేటింగ్: 2.5/5
