“ఉరి” సినిమాతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆదిత్య ధర్.. తెరకెక్కించిన రెండో చిత్రం “దురంధర్”. రణవీర్ సింగ్ టైటిల్ పాత్రలో నటించిన ఈ చిత్రం ప్రమోషనల్ కంటెంట్ మంచి హైప్ క్రియేట్ చేసింది. ముఖ్యంగా మ్యూజికల్ ఆల్బమ్ క్రేజీ సాంగ్స్ తో సినిమాని మరింత మందికి చేరువ చేసింది. ఇక నిన్న హీరోయిన్ మరియు దర్శకుడు ఆదిత్య ధర్ సతీమణి యామి గౌతమ్ చేసిన ట్వీట్ అనేది చర్చనీయాంశం అయ్యింది. ఏకంగా బాలీవుడ్ మీద మీద, అక్కడి పెయిడ్ ప్రమోషనల్ కల్చర్ మీద ఆమె నిప్పులు చెరిగింది. దాంతో బాలీవుడ్ లో ఒక సెక్షన్ ఆఫ్ మీడియా ఈ సినిమాపై హేట్ పోస్టులు మొదలెట్టారు. మరి ఈ మూడున్నర గంటల సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంది అనేది చూద్దాం..!!

కథ: 2001లో జరిగిన పార్లమెంట్ ఎటాక్స్ తర్వాత పాకిస్థాన్ లో ఇండియన్ ఏజెంట్ ఒక హై పొజిషన్ లో ఉండడం అవసరం అని భావించిన ఇండియన్ ఇంటెలిజెన్స్ బ్యూరో చీఫ్ (మాధవన్) యుద్ధప్రాతిపదికన ఆపరేషన్ దురంధర్ ను ప్రారంభిస్తాడు. అందులో భాగంగా హంజా (రణవీర్ సింగ్)ను పాకిస్థాన్ కు చెందిన ఓ నగరంలో ప్లాంట్ చేస్తాడు.
అక్కడ లోకల్ గ్యాంగ్స్ & ISI చీఫ్ కి హంజా ఏ విధంగా చేరువయ్యాడు? ఇండియన్ ఇంటెలిజన్స్ కి ఎలాంటి సపోర్ట్ ఇచ్చాడు? అది ఇండియాకి ఎంతవరకు హెల్ప్ అయ్యింది? వంటి ప్రశ్నలకు సమాధానమే “దురంధర్” చిత్రం.

నటీనటుల పనితీరు: మాధవన్ స్క్రీన్ ప్రెజన్స్ & అతని మేకప్ టెర్రిఫిక్. ప్రతి కదలిక, ప్రతి ఎక్స్ ప్రెషన్ అజిత్ దోవల్ ను గుర్తుకుతెస్తాయి. అద్భుతంగా నటించి ఆ పాత్రకి ప్రాణం పోశాడు మాధవన్.
మాధవన్ తర్వాత అదే స్థాయి నటనతో ఆకట్టుకున్న నటుడు అక్షయ్ ఖన్నా. చాలా తక్కువ డైలాగ్స్ ఉంటాయి. కానీ.. ఎక్స్ ప్రెషన్స్ తో క్యారెక్టర్ పండించేసాడు.
రణవీర్ సింగ్ క్యారెక్టర్ ను ఓన్ చేసుకున్న విధానం ప్రశంసనీయం. చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్, అద్భుతమైన క్యారెక్టర్ ఆర్క్ కూడా ఉంది. కానీ.. క్యారెక్టర్ ఎస్టాబ్లిష్మెంట్ లేకపోవడంతో ఆ పాత్ర తాలూకు బాధ ఏమిటి? అతను ఎందుకని అంత బలంగా దేశ సేవ చేయడానికి పూనుకున్నాడు? వంటి ప్రశ్నలకు సమాధానం లేక.. ఆ పాత్రతో ట్రావెల్ చేయలేం. దానికి సెకండ్ పార్ట్ లో సమాధానం ఉంటుంది అని గ్లింప్స్ ఇచ్చినప్పటికీ.. ఎందుకో పెద్దగా ఎక్కదు.
అర్జున్ రాంపాల్ సాడిస్టిక్ ISI లీడర్ గా జీవించేసాడు. సారా అర్జున్ ను క్యాస్ట్ చేయడానికి రీజన్ చూపించినా.. ఆమె ఎందుకో చిన్నపిల్లలాగే కనిపించింది. ఆమెను సెక్సీగా చూపించే ప్రయత్నం సౌత్ ఆడియన్స్ వరకు బెడిసికొట్టిందనే చెప్పాలి.
సంజయ్ దత్ స్క్రీన్ ప్రెజన్స్ బాగున్నప్పటికీ.. అతడి యాక్షన్ సీన్స్ కోసం బాడీ డబుల్ ను వాడడం చాలా స్పష్టంగా తెలిసిపోవడం అనేది ఆ క్యారెక్టర్ ను డౌన్ చేసింది.

సాంకేతికవర్గం పనితీరు: శాశ్వత్ సచదేవ్ పాటలు, నేపథ్య సంగీతం సినిమాని అద్భుతంగా ఎలివేట్ చేశాయి. అలాగే.. సినిమాలో వాడిన ఓల్డ్ సాంగ్స్ సెలక్షన్ అదిరింది. ఆ పాటల ప్లే లిస్ట్ మంచి వైరల్ అవుతుంది. అలాగే. సదరు పాటల ప్లేస్మెంట్ కూడా చాలా పర్ఫెక్ట్ గా, టైటిల్ ట్రాక్ అయితే భలే రేడికల్ గా ఉంది.
సినిమాటోగ్రఫీ వర్క్, మేకప్, ఆర్ట్, ప్రాస్థేటిక్ వర్క్, ఆర్ట్ వర్క్ వంటి టెక్నికాలిటీస్ అన్నీ ఎక్సలెంట్. ముఖ్యంగా యాక్షన్ సీన్స్ ను రియలిస్టిక్ & రా గా తెరకెక్కించిన విధానం అదిరింది. మంచి ఉత్సుకతతో చూస్తున్న యాక్షన్ సీన్స్ కి బ్లడీ టచ్ అనేది ఆడియన్స్ ను క్రేజీ సినిమాటిక్ ఎక్స్ పీరియన్స్ ఇస్తుంది.
దర్శకుడు ఆదిత్య ధర్ ఓ స్పై థ్రిల్లర్ ను గ్యాంగ్ స్టర్ డ్రామాలా తెరకెక్కించాలనుకున్నాడు. అలాగే చూపించాడు కూడా. అందువల్ల తెలిసిన కథ, ఊహించిన సెటప్ అయినప్పటికీ.. ఫార్మాట్ కొత్తగా కనిపిస్తుంది. అయితే.. వచ్చిన సమస్య మొత్తం రన్ టైమ్ తోనే. 214 నిమిషాలు అంటే మూడున్నర గంటల తర్వాత కూడా ఇంకా చాలా కథ ఉంది, అందుకోసం వచ్చే ఏడాది వరకు వెయిట్ చేయండి అని ఆడియన్స్ కు సరైన సంతృప్తి లేకుండా థియేటర్ల నుండి పంపడం అనేది మెయిన్ మైనస్. ఒక కంప్లీట్ ఎండింగ్ ఇచ్చి.. ఆ తర్వాత సినిమాని మరో కోణంలో సెకండ్ పార్ట్ కి కంటిన్యూ చేసి ఉంటే బాగుండేది. అది మాత్రమే కాక.. కాంగ్రెస్ ప్రభుత్వం మీద దుమ్మెత్తిపోవడం అనేది కొందరికి రుచించకపోవచ్చు. అది కూడా దేశ భద్రతను మునుపటి ప్రభుత్వం నాయకులు శత్రుదేశానికి అమ్మేసారు అని చూపించిన విధానం లేనిపోని రాద్ధాంతాలకు దారి తీసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి.
మరీ ముఖ్యంగా బీజేపీ కొమ్ము కాసినట్లుగా కొన్ని డైలాగులు ఉండడం అనేది కొందరు ఆరెంజ్ ఆర్మీకి నచ్చవచ్చు. ఇండైరెక్ట్ గా మోడీకి గట్టి సపోర్ట్ ఇచ్చాడు ఆదిత్య ధర్. అతడి మునుపటి సినిమాల్లోనూ అదే తీరు కనిపిస్తుంది అనుకోండి. కానీ ఈ సినిమాలో మాత్రం ఆ ఎలివేషన్ చాలా స్ట్రాంగ్ గా ఉంది. దర్శకుడిగా ఆదిత్య ధర్ ప్రతిభను ఏ విషయంలోనూ వేలెత్తి చూపలేం. కానీ.. ఒక కథకుడిగా మాత్రం పూర్తిస్థాయిలో అలరించలేకపోయాడు. పాకిస్థాన్, బలోచిస్తాన్ కల్చర్ గురించి చాలా హిస్టరీ చెప్పుకొచ్చాడు, అదంతా కొత్తగా కనిపిస్తుంది. కొన్ని సనివేశాలు, సందర్భాలు భయాన్ని, జుగుప్సను కలిగిస్తాయి. ఆ విషయంలో మాత్రం ఆదిత్య ధర్ ను మెచ్చుకోవాల్సిందే.

విశ్లేషణ: స్పై థ్రిల్లర్ కి కచ్చితంగా ఒక కొత్త కలర్ ఇచ్చాడు ఆదిత్య ధర్. కథకుడిగా కంటే దర్శకుడిగా ఎక్కువ మార్కులు సంపాదించుకున్నాడు. పాకిస్థాన్-ఇండియా మధ్య ఉన్న విద్వేషాన్ని, 26/11 ఎటాక్స్ ను సరికొత్త కోణంలో పచ్చిగా చూపించాడు. మరీ ఎక్కువగా సాగదీసిన రన్ టైమ్ ను భరించగలిగితే.. “దురంధర్” కచ్చితంగా ఎంగేజ్ చేసే సినిమా. సో టెర్రిఫిక్ మ్యూజిక్, స్టన్నింగ్ యాక్షన్ సీన్స్ & ఫెంటాస్టిక్ క్యాస్టింగ్ కోసం ఈ చిత్రాన్ని థియేటర్లలో కచ్చితంగా ఎక్స్ పీరియన్స్ చేయాల్సిందే.

ఫోకస్ పాయింట్: అంత లెంగ్తు ఎందుకయ్యా దురంధరా ?!
రేటింగ్: 3/5
