అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!

సరిగ్గా రెండేళ్ల క్రితం ఇదే సంక్రాంతికి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అందరికీ “అజ్ణాతవాసి” అనే చిత్రరాజాన్ని ఇచ్చి తలెత్తుకోవడం పక్కనెట్టి.. కనీసం ముఖం చూపించుకోవడానికి కూడా సిగ్గుపడేలా చేసిన త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కి సంక్రాంతి బరిలో దిగిన చిత్రం “అల వైకుంఠపురములో”. అల్లు అర్జున్ కథానాయకుడిగా నటించిన ఈ చిత్రం టీజర్, ట్రైలర్ కంటే పాటలు వాటి ప్రోమోలే ఎక్కువ హైలైట్ అయ్యాయి. మరి ఈ సంక్రాంతికి గూరుజీ ఏం చేశారో చూద్దాం..!!

కథ: వాల్మీకి (మురళీశర్మ) కుటిల బుద్ధితో పన్నిన ఓ పన్నాగం కారణంగా వైకుంఠపురములో రాజులా బ్రతకాల్సినవాడు బంటు (అల్లు అర్జున్)లా మిడిల్ క్లాస్ బ్రతుకుల్లో నలిగిపోతాడు. తన అసలు కొడుకు భవిష్యత్తు వెలగడం కోసం తన జీవితాన్ని చీకటి చేశాడని తెలుసుకొన్న బంటు ఎలా రియాక్ట్ అయ్యాడు? తనకు 25 ఏళ్ల తర్వాత తెలిసిన నిజాన్ని ప్రపంచానికి తెలియకుండా ఎందుకు దాచాడు? వైకుంఠపురములో అడుగుపెట్టి అక్కడి బాధల్ని ఎలా పారద్రోలాడు అనేది “అల వైకుంఠపురములో” కథాంశం.

నటీనటుల పనితీరు: అల్లు అర్జున్ చాలా స్టైలిష్ గా ఉంటాడు, అద్భుతంగా డ్యాన్స్ చేస్తాడు, తెరపై చలాకీగా, హుందాగా కనిపిస్తాడు. కానీ.. ఎందుకో ఒక చక్కని నటుడు అని మాత్రం ఇప్పటివరకూ అనిపించుకోలేకపోయాడు. ఆ స్థాయి పాత్రలు అతడికి రాలేదో లేక.. నటుడిగా ఇప్పుడిప్పుడే పరిపక్వత చెందూకుతున్నాడో తెలియదు కానీ.. “అల వైకుంఠపురములో” అల్లు అర్జున్ ను స్టైలిష్ స్టార్ గా కాదు.. ఒక సంపూర్ణ నటుడిగా చూస్తారు. ఎమోషన్స్ ను చాలా అద్భుతంగా పలికించాడు. కొన్ని సన్నివేశాలకు మనోడు ఇచ్చిన ఎక్స్ ప్రెషన్స్ చూస్తే.. అల్లు అర్జున్ లో ఇంత మంచి నటుడున్నాడా? అని ఆశ్చర్యమేస్తుంది. బంటు అనే పాత్ర అల్లు అర్జున్ కోసమే పుట్టింది. ఫ్లైఓవర్ పై అల్లు అర్జున్-మురళీశర్మల నడుమ వచ్చే డిస్కషన్ ఎపిసోడ్ ఒక్కటి చాలు.. నటుడిగా అల్లు అర్జున్ ఒక పది మెట్లు ఎక్కాడని చెప్పడానికి. అల్లు అర్జున్ కెరీర్ లో ఇప్పటివరకూ చేసిన పెర్ఫార్మెన్స్ అంతా ఒకెత్తు.. ఈ సినిమాలో చేసిన పరిపక్వత కలిగిన నటన మరో ఎత్తు.

తన సినిమాల్లో హీరోయిన్స్ ను మందబుద్ది కలిగిన అందగత్తెలుగా చూపిస్తాడనే అపవాదును ఈ చిత్రంతో “XXX డిటర్జెంట్ సోప్”తో చాలా సంస్కారవంతంగా కడిగేసుకున్నాడు త్రివిక్రమ్. పూజా హెగ్డేను కేవలం గ్లామర్ కోసం కాకుండా కథ-కథనంలో భాగంగా ఆమె పాత్రను తీర్చిదిద్దిన విధానం బాగుంది. త్రివిక్రమ్ రాసుకున్న పాత్రకు అందంతో, అభినయంతో పూజా కూడా న్యాయం చేసింది.

జయరాం, టబు, సచిన్ కేడ్కర్, సముద్రఖని, నివేదా పేతురాజ్ లు తమ తమ పాత్రలకు న్యాయం చేయడమే కాక హుందాతనం కూడా తీసుకొచ్చారు.

ఇక అల్లు అర్జున్ కు సినిమాలో నటనతో గట్టి పోటీ ఇచ్చిన వ్యక్తి మురళీ శర్మ. నెగిటివ్ షేడ్ కి కామిక్ యాంగిల్ ను మిక్స్ చేసిన వాల్మీకి పాత్రకు ప్రాణం పోసాడు మురళీశర్మ. ఆయన ఈ సినిమాకి మెయిన్ ఎస్సెట్. రాజేంద్రప్రసాద్మ్ హర్ష వర్ధన్, సునీల్ లు చిన్న పాత్రల్లోనూ అలరించారు.

సాంకేతికవర్గం పనితీరు: నటవర్గంలో అల్లు అర్జున్ ముఖ్యుడైతే.. సాంకేతికవర్గంలో అభినందనకు అర్హుడు ముఖ్యుడు సంగీత దర్శకుడు తమన్. పాటలతోనే తన టాలెంట్ ను 100% ప్రూవ్ చేసుకున్న తమన్.. నేపధ్య సంగీతంతో బోనస్ మార్క్స్ కొట్టేశాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్ కి తమన్ ఇచ్చిన బ్యాగ్రౌడ్ స్కోర్ ప్రశంసనీయం.

పి.ఎస్.వినోద్ కెమెరా పనితనం సినిమాకి స్పెషల్ ఎస్సెట్. బొమ్మ కంటికి ఇంపుగా కనిపించడానికి.. కళ్ళకి నిండుగా కనిపించడానికి చాలా చిన్న తేడా ఉంటుంది. ఈ సినిమాతో వినోద్ ఆ తేడా కనిపెట్టేశాడు. సన్నివేశానికి తగ్గ కెమెరా యాంగిల్స్ & వర్క్ తో ఆకట్టుకున్నాడు. త్రివిక్రమ్ క్లాస్ టచ్ కి తన కెమెరా వర్క్ తో సూపర్బ్ ఫినిషింగ్ ఇచ్చాడు.

త్రివిక్రమ్ కథలెప్పుడూ సాధారణంగానే ఉంటాయి. అతడు నుండి అరవింద సమేత వరకూ త్రివిక్రమ్ సినిమా కథలన్నీ మహా అయితే రెండు లైన్లలో చెప్పేయొచ్చు. కానీ.. ఆ కథలను నడిపించే కథనంలోనే త్రివిక్రమ్ మ్యాజిక్ కనిపిస్తుంది. “అల వైకుంఠపురములో” విషయంలోనూ అదే జరిగింది. ఈ సినిమా కథ చాలా చిన్నది.. ఇంకా చెప్పాలంటే 80ల కాలంలోనే చాలాసార్లు చూసేసింది కూడా. కానీ.. కథనం, కొడుకు పాత్ర క్యారెక్టరైజేషన్ ను రాసుకొని తెరపై ప్రెజంట్ చేసిన తీరు మాత్రం త్రివిక్రమ్ లోని తెలివైన దర్శకుడ్ని మనకు చూపిస్తాయి. అల్లు అర్జున్ లోని నటుడ్ని పూర్తిస్థాయిలో వాడుకోవడంలోనే సగం విజయం సాధించిన త్రివిక్రమ్.. క్లైమాక్స్ లో తనదైన శైలి పోయిటిక్ & ఎమోషనల్ టచ్ ఇచ్చి ఆడియన్స్ మనసు కూడా కొల్లగొట్టేశాడు. చాలాకాలం తర్వాత త్రివిక్రమ్ లోని రచయితను దర్శకుడు గట్టిగా డామినేట్ చేశాడు. అందుకే సినిమాలో అనవసరమైన పంచ్ లు లేవు, ప్రాసలు లేవు.. పసలేని సన్నివేశాలు లేవు. 165 నిమిషాల సినిమా ఎండ్ క్రెడిట్స్ పడుతుంటే.. “ఏంటీ సినిమా అప్పుడే అయిపోయిందా?” అనుకుంటాడు ప్రేక్షకుడు. ఒక దర్శకుడిగా త్రివిక్రమ్ కి ఇంతకుమించిన ప్రశంస ఏం అవసరం. రచయితగా ఇప్పటికే ఆయన్ను గురూజీ అని ముద్దుగా పిలుచుకునే ఒక జనరేషన్ అంత శిష్యగణం ఉంది. ఇక ఆయన ఇదే విధంగా ఆయనలోని రచయితకు కాక దర్శకుడిగా ప్రాధాన్యత ఇస్తూ.. “అల వైకుంఠపురములో” లాంటి అద్భుతమైన చిత్రాల్ని ఇస్తూ ఉండాలని కోరుకోవడం తప్ప ఒక తెలుగు సినిమా ప్రేక్షకుడిగా ఇంకేం చేయగలం.. కుదిరితే ఇంకోసారి వైకుంఠపురానికి వెళ్ళి ఆనందంగా, మనస్ఫూర్తిగా సినిమాని ఎంజాయ్ చేయగలం.

విశ్లేషణ: ఇది త్రివిక్రమ్ సినిమా కాదు.. బన్నీ సినిమా కూడా కాదు. ఒక స్టార్ హీరో తనలోని నటుడ్ని ప్రేక్షకులకు పరిచయం చేసేందుకు పడిన తపన.. ఒక రచయిత తనలోని దర్శకుడికి పూర్తిస్థాయి స్వేచ్ఛను ఇచ్చి ప్రేక్షకులకు అందించిన ఒక సెల్యులాయిడ్. అఖిలాంధ్ర ప్రేక్షకులు ఆనందించదగిన అందమైన చిత్రం “అల వైకుంఠపురములో”.

రేటింగ్: 3.5/5

Click Here To Read in ENGLISH

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus