సినిమా పరిశ్రమకు పైరసీ చేసేంత నష్టం ఇంకేదీ చేయదు.. గత కొన్నేళ్లుగా ఈ మాట సినిమా జనాలు అంటున్నారు. సినిమా ప్రేక్షకులూ అంటున్నారు. అయితే ఎంతమంది పాటిస్తున్నారు. ఎంతమంది దీని కోసం పోరాడుతున్నారు అంటే చెప్పలేం అనే సమాధానం వస్తుంది. ఎందుకంటే పైరసీని ప్రోత్సహించకంది అని సినిమా టీమ్‌లు పదే పదే విజ్ఞప్తి చేస్తాయి కానీ.. ఎందుకు ప్రేక్షకులు ఆ ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తున్నారు అనే విషయం పట్టించుకోలేదు. పైరసీ చేసేవాళ్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనే మాట మాత్రం చెబుతూ ఉంటారు.
అంతే కానీ, టాలీవుడ్ నుండి సీరియస్‌గా పైరసీని అడ్డుకోవడానికి ప్రయత్నాలు చేసిందా అంటే పెద్ద సినిమాలు రిలీజ్ అవుతున్న సమయంలో కమాండ్ కంట్రోల్ సెంటర్‌లు లాంటి ఏర్పాట్లు చేయడమే. ఓ మెయిల్ ఐడీ, వాట్సాప్ నెంబరు ఇచ్చి మీకు కనిపించిన లింక్‌లు పంపండి అని చెప్పేవారు. సోషల్ మీడియా బాగా హైలోకి వచ్చాక వాటిలోని లింక్‌లు, ఫొటోలు పట్టుకుని ఎవరు చేస్తున్నారు లాంటి సెర్చింగ్‌లు, కంప్లైంట్‌లు లాంటివి చేస్తున్నారు. అయితే ఇవన్నీ పైరసీ అయ్యాక చేసిన పనులే.
పైరసీ వైపు జనాలు ఎందుకు వెళ్తున్నారు. ఒకప్పుడు థియేటర్‌లో సినిమా చూడటాన్ని ఓ స్పెషల్ థింగ్‌గా భావించిన సినిమా ప్రేక్షకుణ్ని మార్చింది ఎవరు? పెద్ద తెర మీద సినిమా.. అక్కడికి కొన్నాళ్లకు బుల్లితెర మీద సినిమాలా ఉండేది పరిస్థితి. ఆ తర్వాత బుల్లి తెరతోపాటు ఓటీటీలు వచ్చాయి. కానీ గత కొన్నేళ్లుగా మొత్తం పరిస్థితులు మారిపోయాయి. పెద్ద తెర మీద సినిమా చూద్దాం అంటే జేబు ఖాళీ అవుతోంది. చిన్న సైజ్ ఫ్యామిలీ ఓ మంచి థియేటర్‌కి వెళ్దాం అంటే కనీసంలో కనీసం రూ.1000 అయిపోతోంది.
పోనీ, మామూలు థియేటర్‌కి వెళ్దాం అంటే.. అక్కడి పరిస్థితులు, వసతులు అంతంతమాత్రంగానే ఉన్నాయి. దీంతో అయితే మల్టీప్లెక్స్ లేదంటే లేదు అనే పరిస్థితి వచ్చేశారు జనాలు. ఖర్చులకు జడిసి.. ఓటీటీలో సినిమాలు చూద్దామని కొందరు ఉండిపోతూ వచ్చారు. ఆ కొందరు చాలామంది అయిపోయారు. ఈ క్రమంలో ఐబొమ్మ ఇమంది రవి లాంటివాళ్లు పుట్టుకొచ్చారు. లాంటివాళ్లు అని ఎందుకన్నాం అంటే పైరసీ చేసేవారిలో ఇమంది రవి ఒకరు. ఇలాంటి జనాలు చాలామంది ఉన్నారు.
సినిమా ఇలా ఓటీటీకి రావడం ఆలస్యం, వస్తుందని తెలియడం ఆలస్యం ఆయన అనధికారిక విధానాల్లో డౌన్‌లోడ్ చేసి తన వెబ్‌సైట్‌లో పెట్టేశాడు. ఇది ఎంతమాత్రం శ్రేయస్కరం కాదని ప్రేక్షకులకు తెలిసినా అంతేసి డబ్బులు పోసి టికెట్లు కొని ఫ్యామిలీని తీసుకెళ్లలేక.. తీసుకెళ్లాక ఇంటర్వెల్ టైమ్‌లో ఖర్చులు భరించలేక వీకెండ్‌లో సినిమాను ఇంట్లోనే చూసేశారు. దీని వల్ల పరిశ్రమకు నష్టమని తెలిసినా.. జేబులు ఖాళీ చేసుకోలేక ఉచితంగా వచ్చిన సినిమాలు చూసేశారు. అందుకే ఇమంది రవిని పోలీసులు అరెస్టు చేసేసరికి ఆయన్ని రాబిన్ హుడ్‌ని చేసేశారు.
సినిమా ప్రేక్షకులకు అలాంటి ఆలోచన రావడానికి కారణం ప్రధానంగా టికెట్ రేట్లు, స్నాక్స్ రేట్లు. ఇవి కాదు అని ఏ సినిమా మనిషీ అనరు. ఎందుకంటే మొన్నీమధ్య ‘రాజు వెడ్స్ రాంబాయి’ సినిమా టికెట్లు తగ్గించి అమ్మితే.. రెండు రోజులకే మళ్లీ పాత రేట్లకు తెచ్చేసింది ఈ సినిమా పరిశ్రమలోని ‘కొందరు’ వ్యక్తులే. తప్పు తమవైపు కూడా ఉన్నా.. ఆ విషయాన్ని వదిలేసి ప్రేక్షకుల్ని అంటే ఎలా? మీరు మారి ప్రేక్షకుల్ని మారమంటే బాగుంటుంది.