2025లో మంచి ఫామ్ లో ఉన్న ఏకైక సినిమా ఇండస్ట్రీ మలయాళం. ఆల్రెడీ అరడజను బ్లాక్ బస్టర్ హిట్స్ కొట్టిన మలయాళం సినిమా నుంచి వచ్చిన తాజా చిత్రం “అలప్పుజ జింఖానా” (Alappuzha Gymkhana). “ప్రేమలు”తో తెలుగులోనూ మంచి ఇమేజ్ సంపాదించుకున్న నస్లేన్ కథానాయకుడిగా తెరకెక్కిన ఈ చిత్రానికి ఖలీద్ రెహ్మాన్ దర్శకుడు. మలయాళంలో ఏప్రిల్ 10న విడుదలై విశేషమైన స్పందన అందుకున్న ఈ చిత్రాన్ని తెలుగులో నేడు (ఏప్రిల్ 25) డబ్బింగ్ వెర్షన్ ను రిలీజ్ చేశారు. మరి ఈ సినిమా మన ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకోగలుగుతుందో చూద్దాం..!!
కథ: ఇంటర్మీడియట్ ఫెయిలైన కొందరు కుర్రాళ్లు, డిగ్రీ కాలేజ్ సీట్ ను స్పోర్ట్స్ కోటాలో సంపాదించడం కోసం బాక్సింగ్ నేర్చుకుని, స్టేట్ లెవల్లో ఆడాలని నిర్ణయించుకుంటారు.
ఊహించని విధంగా స్టేట్ లెవల్ గేమ్ కి చేరుకున్న ఈ కుర్రాళ్లు అక్కడ ఎదుర్కొన్న ఇబ్బందులేమిటి? వాటిని ఎలా అధిగమించారు? ఈ డిస్ట్రిక్ట్ లెవెల్ గేమ్స్ ద్వారా వాళ్లు నేర్చుకున్న పాఠం ఏమిటి? అనేది “అలప్పుజ జింఖానా” కథాంశం.
నటీనటుల పనితీరు: హీరో లేదా సినిమాలో ప్రధాన పాత్రతో సమానంగా క్యారెక్టర్ రోల్స్ వర్కవుట్ అవ్వడం అనేది చాలా అరుదుగా జరుగుతుంటుంది. ఈ చిత్రంలో హీరో నస్లేన్ తోపాటు సందీప్, గణపతి, ఫ్రాంకో, హబీబ్, లుక్మన్.. ఇలా అందరూ ప్రాపర్ గా ఎలివేట్ అయ్యారు. ముఖ్యంగా ఫ్రాంకో క్యారెక్టర్ కి వచ్చిన ఎలివేషన్ సినిమాకి మెయిన్ హైలైట్. అనఘ రవి లేడీ బాక్సర్ గా మంచి స్క్రీన్ ప్రెజన్స్ తో ఆకట్టుకుంది.
బాక్సింగ్ కోచ్ గా లుక్మన్ క్యారెక్టర్ ఎలివేషన్ కూడా బాగుంది. ఇక నస్లేన్ కామెడీ టైమింగ్ విశేషంగా ఆకట్టుకుంటుంది. ప్రతి ఒక్క క్యారెక్టర్ యూత్ ని కనెక్ట్ అవ్వడమే కాక, రిలేట్ అయ్యేలా ఉండడం సినిమాకి బిగ్గెస్ట్ ఎస్సెట్.
సాంకేతికవర్గం పనితీరు: విష్ణు విజయ్ బీజీయం కామెడీ, ఎమోషన్ ను మహాబాగా ఎలివేట్ చేసింది. ముఖ్యంగా క్లైమాక్స్ ఫైట్ సీన్ కి బీట్స్ తో సింక్ చేసిన విధానం మంచి హై ఇస్తుంది. జింషీ ఖలీద్ సినిమాటోగ్రఫీ వర్క్ మేజర్ ప్లస్ పాయింట్. బాక్సింగ్ సీన్స్ ను తెరకెక్కించిన విధానం భలే ఆకట్టుకుంది. అంత లిమిటెడ్ బడ్జెట్ లో ఈస్థాయి అవుట్ పుట్ అనేది కచ్చితంగా ఆశ్చర్యపరుస్తుంది.
దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ యూత్ ఆడియన్స్ మైండ్ సెట్ ను దృష్టిలో ఉంచుకొని రాసుకున్న సన్నివేశాలు అలరిస్తాయి. సాధారణంగా సినిమాల్లో హీరో గ్యాంగ్ ఏదోటి చేసి గెలిచేస్తుంటారు. కానీ.. ఈ సినిమాలో హీరో గ్యాంగ్ లో ఒక్కరు తప్ప అందరూ ఓడిపోవడం అనేది చాలా రిలేటబుల్ గా ఉంది. అలాగే.. లాజికల్ క్వష్చన్స్ లేవనెత్తకుండా కథనాన్ని కామెడీతో నింపిన విధానం అతడి పనితనానికి నిదర్శనం. సినిమాలో ఇంకో స్పెషల్ అట్రాక్షన్.. హీరోయిన్ క్యారెక్టర్స్. ప్రెజెంట్ జెన్ జీ జనరేషన్ ఆ పాత్రలకు, వాటి సందర్భాలకు బాగా రిలేట్ అవుతారు. ఓవరాల్ గా.. దర్శకుడు ఖలీద్ రెహ్మాన్ దర్శకుడిగా, కథకుడిగా ఆడియన్స్ ను అద్భుతంగా అలరించాడనే చెప్పాలి.
ముఖ్యంగా.. తెలుగు డబ్బింగ్ వెర్షన్ విషయంలో తీసుకున్న కేర్ ను మెచ్చుకోవాలి. ట్రెండింగ్ మీమ్స్ & డైలాగ్స్ ను కాస్త ఇరికించారు అనిపించినా.. మంచి ఫన్ జనరేట్ చేశాయి.
విశ్లేషణ: అసలేమీ ఆలోచించకుండా, కేవలం టైమ్ పాస్ కోసం చూసే సినిమాలు చాలా అరుదుగా వస్తుంటాయి. ఇదివరకు తెలుగు, తమిళ భాషల్లో ఈ తరహా సినిమాలు ఎక్కువచ్చేవి. ఇప్పుడు ఇక్కడ అందరూ యాక్షన్, థ్రిల్లర్ అంటూ ఏవేవో ప్రయోగాలు చేస్తూ మన ఆడియన్స్ కు “నో బ్రెయినర్” జోనర్ సినిమాలను దూరం చేశారు. ఆ వెలితి తీర్చే చిత్రం “అలప్పుజ జింఖానా”. సినిమాలో బోలెడన్ని లాజికల్ డౌట్స్ ఉన్నప్పటికీ, ఏ ఒక్కటే ఇబ్బందిపెట్టడు. పైపెచ్చు ఆ సన్నివేశాలను బాగా ఎంజాయ్ చేసేలా చేస్తుంది.
ఫోకస్ పాయింట్: అలుపెరుగక అలరించే అలప్పుజ జింఖానా!
రేటింగ్: 3/5