అదేంటో కానీ.. అల్లరి నరేష్ (Allari Naresh) ఈ మధ్య మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలపై పడ్డాడు. 8 ఏళ్ళ తర్వాత అల్లరి నరేష్ కి ‘నాంది’ రూపంలో ఓ సక్సెస్ దొరికింది. అది నరేష్ ఇమేజ్ కి పూర్తి భిన్నంగా ఉండే సినిమా. అయితే చిన్న మెసేజ్ కూడా టచ్ అవ్వడం వల్ల కమర్షియల్ గా ‘నాంది’ వర్కౌట్ అయ్యింది. అప్పటి నుండి అతను మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలకే ఓటేస్తున్నాడు అని అంతా అనుకున్నారు.
‘నాంది’ తర్వాత అల్లరి నరేష్ నుండి ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ (Itlu Maredumilli Prajaneekam) ‘ఉగ్రం’ (Ugram) వంటి సినిమాలు వచ్చాయి. అవి రెండూ మెసేజ్ టచ్ ఉన్న సినిమాలే. ఇటీవల వచ్చిన ‘ఆ ఒక్కటికీ అడక్కు’ కామెడీ జోనర్ సినిమా అని పబ్లిసిటీ చేసుకున్నప్పటికీ అందులో కూడా బలవంతంగా మెసేజ్ చెప్పే ప్రయత్నం చేశారు. సో ‘అల్లరి నరేష్ కూడా.. ‘అయితే కామెడీ లేదంటే మెసేజ్’ సినిమాలు మాత్రమే చేస్తాడేమో’ అని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
ఇలాంటి టైంలో ‘బచ్చల మల్లి’ (Bachhala Malli) ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో నరేష్ రగ్డ్ లుక్ తో చాలా డిఫరెంట్ గా, మాస్ గా కనిపిస్తున్నాడు. నరేష్ కెరీర్లో ‘నేను’ (Nenu) ‘విశాఖ ఎక్స్ ప్రెస్’ వంటి సినిమాలు స్పెషల్ గా ఉంటాయి. అందులో నరేష్ చేసిన పాత్రలు క్రూయల్ గా ఉంటాయి. బోల్డ్ గా కూడా ఉంటాయని చెప్పొచ్చు. ‘బచ్చల మల్లి’ కూడా అలా స్పెషల్ గా ఉంటుందని తాజాగా రిలీజ్ చేసిన పోస్టర్ చెప్పకనే చెప్పింది.
ఇక ‘బచ్చల మల్లి’ 1980ల నాటి కథ అని తెలుస్తుంది. రాజేష్ దండా (Rajesh Danda) నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘సోలో బ్రతుకే సో బెటర్’ (Solo Brathuke So Better) ఫేమ్ సుబ్బు (Subbu Mangadevi) దర్శకుడు. 80 శాతం కంప్లీట్ అయ్యింది. విశాల్ చంద్రశేఖర్ (Vishal Chandrashekhar) ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.