టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) నంద్యాల వివాదం ఏ రేంజ్ లో వైరల్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వైసీపీ నేత శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇంటికి వెళ్లడం, ప్రత్యేకంగా విష్ చేయడంతో మెగా ఫ్యాన్స్, జనసేన, టీడీపీ శ్రేణుల్లో ఆగ్రహం రేకెత్తించింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో విమర్శలు వెల్లువెత్తాయి. అభిమానుల మధ్య మాటల యుద్ధం తీవ్రమైంది. అయినప్పటికీ బన్నీ, అల్లు కుటుంబం నుంచి ఎవరూ స్పందించకపోవడం చర్చకు దారి తీసింది.
ఇటీవల, అల్లు అర్జున్ ‘అన్ స్టాపబుల్’ షోకు గెస్ట్ గా వచ్చిన నేపథ్యంలో వివాదంపై స్పందిస్తాడనే ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే షోలో బన్నీ నేరుగా ప్రస్తావించకపోయినప్పటికీ, తన మాటల ద్వారా వివాదంపై క్లారిటీ ఇచ్చినట్టు కనిపించింది. ఒక వ్యక్తికి కొన్ని అభిప్రాయాలు ఉన్నప్పుడు దాన్ని గౌరవిస్తే చాలా బాగుంటుందని అన్నాడు. ఒకరికి నచ్చింది మరొకరికి నచ్చకపోవచ్చని, అంత మాత్రనా వ్యక్తిని తప్పుగా చూడకూడదని తెలిపారు. సమావేశంలో బన్నీ వ్యక్తిగత సంబంధాల గురించి మాట్లాడుతూ, “మనకి దగ్గరైనవారితో అభిప్రాయ బేధాలు ఉండటం సహజం.
మా నాన్నగారు నాకు ప్రపంచంలోనే అత్యంత ఇష్టమైన వ్యక్తి. కానీ, చాలా విషయాల్లో మా అభిప్రాయాలు వేరు. అలాంటి సందర్భాల్లో నేను ఏం చేస్తానంటే, అభిప్రాయం వ్యక్తిపై కాదు, ఆ అంశంపై మాత్రమే ఉన్నట్టు చూస్తాను,” అని అన్నారు. ఇలాంటి ఆలోచనతో మంచి సంబంధాలను కొనసాగించడానికి ముఖ్యమని చెప్పిన బన్నీ, అనవసర వివాదాలకు దూరంగా ఉండడంలో తన నైపుణ్యాన్ని చూపించాడు. “పరిస్థితులకు ప్రతిస్పందించేటప్పుడు వ్యక్తులను గౌరవించడం అవసరం,” అని అతను అభిప్రాయపడ్డాడు.
ఈ మాటలతో బన్నీ నంద్యాల వివాదంపై ఇన్ డైరెక్ట్ గా తన ఉద్దేశ్యాలను వ్యక్తపరచినట్టు కనిపిస్తోంది. ఎదుటి వ్యక్తికి ఒక అభిప్రాయం ఉన్నప్పుడు దాన్ని గౌరవించాలని అన్నారు. అతని సున్నితమైన ఉదాహరణ, వివాదం గురించి మాట్లాడకుండా వివరణ ఇవ్వడం నెటిజన్లను ఆకట్టుకుంది. “బన్నీ వివాదంపై డైరెక్ట్ గా స్పందించకపోయినా, తన ఆలోచనలను సున్నితంగా వ్యక్తపరచడం స్మార్ట్‌గా ఉంది,” అని అభిమానులు అభిప్రాయపడ్డారు.