సినిమా చూసి కన్నీళ్లు పెట్టుకోవడం పెద్ద విషయమేమీ కాదు. చాలామంది సినిమాలు చూసి కన్నీరుమున్నీరు అవుతుంటారు. అయితే వీరిలో సెలబ్రిటీలు చాలా తక్కువమంది ఉంటారు. చూసేవాళ్లు ఏమన్నా అనుకుంటారనో, లేక ఇంకేదైనా కారణమో కానీ పెద్దగా భావోద్వేగాలను ప్రదర్శించరు. కానీ ఒక సెలబ్రిటీ ఉన్నారు. ఎవరైనా చూస్తున్నారా, ఏమన్నా అనుకుంటారా అనేది పట్టించుకోకుండా తన ఎమోషన్స్‌ని ప్రదర్శించేస్తుంటారు. ఆయనే ప్రముఖ బాలీవుడ్ నటుడు ఆమిర్ ఖాన్.
తన కొడుకు జునైద్ ఖాన్ హీరోగా నటించిన ‘ఏక్ దిన్’ సినిమాను చూసి భావోద్వేగానికి గురయ్యాడు ఆమిర్ ఖాన్. ఈ మేరకు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. జునైద్, సాయిపల్లవి ప్రధానపాత్రల్లో నటించిన ఈ సినిమా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన స్పెషల్ ఈవెంట్/షోలో ఆమిర్ కొంతమంది సన్నిహితులతో కలసి ఈ సినిమాను చూశారు. అప్పుడే భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. ఇక ఆ సమయంలో ఆమిర్ పక్కనే ఉన్న సాయి పల్లవి ఆయన్ని ఓదార్చే ప్రయత్నం చేసింది.
సాయి పల్లవి ఆ తర్వాత మాట్లాడుతూ నేను ఎన్ని మంచి సినిమాల్లో నటించానో నాకు తెలియదు. కానీ, ఇండస్ట్రీలోని ప్రతిభావంతులతో కలసి పని చేశానని చెప్పగలను. ఈ సినిమా చూసి ఆమిర్ ఖాన్ ఎమోషనల్ అయ్యారు. అలా భావోద్వేగానికి గురవ్వాలన్నా ధైర్యం కావాలి. నేను అలా అందరిలో ఎమోషనల్ అవ్వలేను. సినిమా చూస్తున్నప్పుడు ఈ లైట్స్ కొంచెంసేపు ఆగిపోతే బాగుండు అని అనుకున్నాను. ఎందుకంటే నాకు కూడా కన్నీళ్లు వచ్చాయి. కంట్రోల్ చేసుకున్నా అని చెప్పింది.
సునీల్ పాండే దర్శకత్వం వహించిన ‘ఏక్ దిన్’ సినిమాకు ఆమిర్ ఖాన్ నిర్మాత. ఈ సినిమా తెలుగులో ‘ఒక రోజు’ టైటిల్‌తో రానుంది. ఈ సినిమా సాయి పల్లవికి తొలి హిందీ సినిమా అనే విషయం తెలిసిందే.