ఖైదీ నంబర్ 150 తర్వాత మెగాస్టార్ చిరంజీవి చేస్తున్న ‘సైరా నరసింహారెడ్డి‘ రెండవ షెడ్యూల్ విజయవంతంగా పూర్తి అయింది. ఈ షెడ్యూల్ లో నయనతార తో పాటు బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ బచ్చన్ పాల్గొన్నారు. సినిమాలో కీలకమయిన కొని సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సన్నివేశానికి సంబంధించిన కొన్ని ఫోటోలను సైతం అమితాబ్ షేర్ చేశారు. ఇవి విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. అయితే తాజాగా అమితాబ్ సంచలన కామెంట్స్ చేశారు. గతంలో తాను ఏదైతే చేయకూడదని అనుకున్నానో చిరంజీవి ‘సైరా’ చిత్రం కోసం అలా చేయాల్సి వచ్చిందని అమితాబ్ బచ్చన్ తన బ్లాగ్ ద్వారా పంచుకున్నారు.
ఏ సినిమాలో కూడా విగ్గు, గడ్డం పెట్టుకుని నటించరాదని తాను గతంలో అనుకున్నానని, ఇప్పుడు ‘సైరా’ కోసం తిరిగి విగ్గు పెట్టుకోవాల్సి వచ్చిందని, గడ్డం తగిలించుకున్నానని అన్నారు. దీంతో తన సినీ జీవితంలో మరోసారి నరకాన్ని అనుభవిస్తున్నట్టు అనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. పాత్ర కోసం కొన్నిసార్లు ఇటువంటివి తప్పవని చివరికి సమర్ధించారు. తొలి భారతీయ స్వాతంత్ర సమర యోధుడు రేనాటి సూర్యుడు ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి జీవితం ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో విజయ్ సేతుపతి, జగపతిబాబులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. నెక్స్ట్ షెడ్యూల్లో వారు జాయిన్ కానున్నారు. కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్లో రామ్చరణ్ నిర్మిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి.