“కల్కి” (Kalki 2898 AD) సినిమా రిలీజై అశేషమైన సినిమా అభిమానుల ప్రేమను చూరగొని కోట్ల రూపాయలు కలెక్ట్ చేసి, థియేటర్లలో హల్ చల్ చేస్తున్నప్పుడు దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఒక చిన్న బాంబు పేల్చాడు. అదేంటంటే.. సినిమాలో ప్రభాస్ కంటే ఎక్కువ మార్కులు కొట్టేసిన అమితాబ్ (Amitabh Bachchan)తెలుగు డబ్బింగ్ ఎవరో డబ్బింగ్ ఆర్టిస్ట్ తో చెప్పించింది కాదని ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI) ద్వారా చేసిన మ్యాజిక్ అని క్లారిటీ ఇచ్చాడు. అప్పటివరకు అమితాబ్ సొంతంగా డబ్బింగ్ చెప్పుకున్నాడేమో అని తెగ పొగిడేశారు అందరూ.
కట్ చేస్తే నాగ్ అశ్విన్ ఇచ్చిన క్లారిటీకి షాక్ అయ్యారు సినీ విశ్లేషకులు. ఇప్పుడు అదే పద్ధతిని ఫాలో అవుతోంది “వెట్టయాన్” (Vettaiyan) టీమ్. రజనీకాంత్ (Rajinikanth) హీరోగా “జై భీమ్” ఫేమ్ టి.జె.జ్ఞావవేల్ (T. J. Gnanavel) తెరకెక్కిస్తున్న తాజా చిత్రమిది. ఈ సినిమాలో రజనీకాంత్ తోపాటుగా అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , ఫహాద్ ఫాజిల్ (Fahadh Faasil) , మంజు వారియర్ (Manju Warrier), అభిరామి (Abhirami) వంటి సీనియర్ ఆర్టిస్టులందరూ ఉన్నారు.
అయితే.. ఈ సినిమాలోని అమితాబ్ పాత్రకు తొలుత ప్రకాష్ రాజ్ (Prakash Raj) తో డబ్బింగ్ చెప్పించారు. ఆయన భాషా ప్రావీణ్యంతో తమిళంతోపాటు తెలుగు, మలయాళ భాషల్లోనూ ఆయనతోనే డబ్బింగ్ చెప్పించారు. కానీ.. మొన్న విడుదలైన ట్రైలర్ కి వచ్చిన రెస్పాన్స్ చూసి “కల్కి” తరహాలోనే ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ (AI)తో డబ్బింగ్ చెప్పించాలని డిసైడ్ అయ్యారట. ప్రస్తుతం ఆ పనులు వేగంగా జరుగుతున్నాయి. ఇకపోతే.. అక్టోబర్ 10న విడుదలవుతున్న ఈ సినిమాపై మంచి అంచనాలున్నాయి.
తమిళంలో సోలో రిలీజ్ దక్కించుకున్న “వెట్టయాన్”కు తెలుగులోనూ శ్రీనువైట్ల (Sreenu Vaitla) “విశ్వం” (Viswam) మినహా పెద్ద పోటీ లేదు. విడుదలైన పాటలన్నీ కూడా బాగా జనాల్లోకి వెళ్లిపోయాయి. మరి సినిమా ఆడియన్స్ ను ఏమేరకు ఆకట్టుకుంటుంది అనేదాన్ని బట్టి కలెక్షన్స్ ఉంటాయి. ఈ సినిమాతో రజనీ “జైలర్” (Jailer) తో క్రియేట్ చేసిన రికార్డ్స్ బ్రేక్ చేస్తాడేమో చూడాలి. ఒకవేళ అదే జరిగితే లోకేష్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వంలో వస్తున్న “కూలీ” (Coolie) పై అంచనాలు ఇంకా పెరిగిపోతాయి.