తెలుగు జనాలకు సినిమాలంటే పిచ్చి.. ప్రపంచం మొత్తంలో ఎక్కడున్నా తెలుగోడు సినిమా పిచ్చోడు అని అంటారు. ఎందుకు, ఎలా లాంటి ప్రశ్నలే ఈ విషయంలో రావు. ఎందుకంటే తెలుగు మనిషి అంటే సినిమా మనిషి. ఈ విషయాన్ని ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) కూడా చెప్పారు. అచ్చంగా ఇలానే చెప్పారా అంటే ఇలానే కాదు కానీ ఇంచుమించు ఇలానే చెప్పారు. సినిమా మీద తెలుగోళ్లు చూపించే అభిమానం ఎలాంటిదో ఆయన వివరించారు.
అమితాబ్ బచ్చన్ ఓ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) . ఈ సినిమా విడుదలై ఇప్పుడు రూ. 1000 కోట్ల వసూళ్ల మార్కు చేరుకునే పనిలో ఉంది. ఈ క్రమంలో సినిమా టీమ్ ప్రచారాన్ని దూసుకెళ్లేలా చేస్తోంది. అందులో భాగంగానే అమితాబ్ బచ్చన్ నుండి ఓ స్పెషల్ వీడియోను తీసుకొస్తున్నారు. దానికి సంబంధించిన ప్రోమోను టీమ్ విడుదల చేసింది. అందులోనే బిగ్‌బీ ఆ కామెంట్స్ చేశారు. దాంతోపాటు ‘కల్కి 2898 ఏడీ’ విశేషాలు కూడా ఉన్నాయి.
అమితాబ్ బచ్చన్‌తో సినిమా గురించి దర్శకుడు నాగ్ అశ్విన్ (Nag Ashwin) ఓ ఇంటర్వ్యూ చేశారు. ఆ ప్రోమోనే ఇప్పుడు రిలీజ్ చేశారు. అందులో బిగ్‌బీ మాట్లాడుతూ హైదరాబాద్ వచ్చి ప్రేక్షకులతో కలిసి థియేటర్‌లో ‘కల్కి 2898 ఏడీ’ చూడాలని ఉందని అన్నారు. సినిమాలను ఇంత పిచ్చి ప్రేమతో ఆరాధించే వాళ్లతో కలిసి చూడాలని అనుకుంటున్నానని అమితాబ్ అన్నారు. దీని బట్టి ఆయన తెలుగు ప్రేక్షకుల గురించి ఎలా అనుకుంటున్నారో అర్థమవుతోంది అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో తెలుగు సినిమాలంటే మనవాళ్లకు ఎంత ప్రేమో అంటూ కొన్ని విషయాలను నెటిజన్లు పంచుకుంటున్నారు. రీరిలీజ్‌ల కోసం థియేటర్ల ముందు క్యూలు కట్టడం, అందులో డిజాస్టర్ సినిమాలు కూడా ఉండటం గురించి మాట్లాడుతున్నారు. అలాగే ప్రత్యేక షోలు వేస్తే అర్ధ రాత్రి 1 గంటకు కూడా థియేటర్లకు ప్రేక్షకులు వెళ్లడం గురించి కూడా మాట్లాడుతున్నారు. అయితే అధిక టికెట్లు పెట్టినా అర్థం చేసుకుని కొంటున్నారు అంటూ లాంటి మాటలూ వినిపిస్తున్నాయి.