అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు సినిమా రివ్యూ & రేటింగ్!

  • December 12, 2019 / 03:48 PM IST

కొందరు సినిమాలు తీశాక విడుదల టైమ్ లో కాంట్రవర్సీలు క్రియేట్ అవుతాయి. కానీ.. వర్మ సినిమా అంటేనే కాంట్రవర్సీ. ఆ తరహాలో వర్మ నిర్మాణ మరియు దర్శకత్వ నేతృత్వంలో సిద్ధార్థ్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం “కమ్మ రాజ్యంలో కడప రెడ్లు”. సెన్సార్ ఇష్యూస్ కారణంగా “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలుగా” టైటిల్ మార్చుకొన్న ఈ చిత్రం పలు వివాదాలు, అవాంతరాలను ఎదుర్కొన్న అనంతరం ఎట్టకేలకు ఇవాళ విడుదలైంది. మరి వర్మ నానా హడావుడీ చేసిన ఈ చిత్రం ప్రేక్షకుల్ని ఏమేరకు అలరించిందో చూద్దాం..!!

కథ: 2019 ఎలక్షన్స్ లో చిత్తుగా ఓడిపోయిన ఒక రాజకీయ పార్టీ.. ఆ ఓటమిని ఎలా ఎదుర్కొంది? మళ్ళీ అధికారం పొందడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టింది? అధికార పార్టీ ఏ విధంగా వారిని ఇబ్బందిపెట్టింది? అనేది “అమ్మ రాజ్యంలో కడపబిడ్డలు” కథ.

నటీనటుల పనితీరు: ఇక్కడ నటీనటులందరూ ఎవరో ఒకర్ని ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించారు కానీ.. వాళ్ళ ప్రతిభను ప్రదర్శించే అవకాశం మాత్రం ఇవ్వలేదు వర్మ. చంద్రబాబు పాత్రలో నటించిన ధనుంజయ్ ఏదో చూస్తూ కూరుచుండిపోయాడు. పవన్ కళ్యాణ్ ని ఇమిటేట్ చేసిన కుర్రాడు పవన్ కల్యాన్నే ఇమిటేట్ చేస్తున్నాడా అనే డౌట్ వస్తుంది. జగన్ పాత్రలో అజ్మల్, నారా లోకేష్ పాత్రలో ధీరజ్ లు మాత్రం తమ పాత్రలకు న్యాయం చేశారనిపిస్తుంది. బ్రహ్మానందం, పృద్వీ, అలీ వంటి వాళ్ళందరూ సినిమాలో ఇమిటేటర్స్ గానే మిగిలిపోయారు. ఇంతకుమించి నటీనటుల గురించి మాట్లాడుకోవాల్సింది ఏమీ లేదు.

సాంకేతికవర్గం పనితీరు: రవిశంకర్ పాటలు, జగదీశ్ చీకటి కెమెరా వర్క్ గురించి ప్రస్తావించాల్సినంతగా ఏమీ లేదు. నిర్మాణ విలువల గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక దర్శకనిర్మాత రాంగోపాల్ వర్మ, దర్శకుడు సిద్ధార్థ్ కేవలం ఆడియన్స్ ను మోసం చేయడానికి మాత్రమే ఈ సినిమా తీశారనిపిస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పటివరకు రాజకీయనాయకులపై వచ్చిన ట్రోల్స్, మీమ్స్ అన్నీ కలిపి ఒక సినిమాగా తీసేసారు ఇద్దరు కలిసి. రాజకీయపరమైన అవగాహన లేనివారికి ఈ సినిమా ఏమీ అర్ధం కాదు. తెలుగుదేశం పార్టీ యాంటీ ఫాన్స్ కు, వై.ఎస్.ఆర్.సి.పి అభిమానులకు మినహా ఎవరికీ నచ్చని చిత్రం “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు”.

విశ్లేషణ: స్పూఫ్ సినిమాలు తీయడం అనేది తప్పు కాదు.. వర్మ నుంచి ఇంతకుమించిన సినిమాను ఎక్స్ పెక్ట్ చేయడం కూడా జనాలు ఎప్పుడో మానేశారు. కానీ.. స్పూఫ్ సినిమాలో కూడా కథ-కథనం అనేవి ఉండొచ్చు అనే విషయాన్ని వర్మ మర్చిపోయాడు. ఈ తీరు ఇలాగే కొనసాగితే “అప్పట్లో ఆర్జీవీ అనే దర్శకుడు ఉండేవాడు” అని జనాలు అనుకోవడం మొదలెట్టేస్తారు. సో, “అమ్మ రాజ్యంలో కడప బిడ్డలు” సినిమా చూడాలి అంటే ఓపిక, సహనం లాంటివి చాలా కావాలి. వాటితోపాటు వేస్ట్ చేయడానికి మీ దగ్గర చాలా టైం ఉంది అనుకుంటే మాత్రమే చూడాల్సిన సినిమా ఇది.

రేటింగ్: 1/5

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus