‘పీనాసి’ అనే పేరుకు టాలీవుడ్‌లో ట్రేడ్ మార్క్ అంటే లక్ష్మీపతినే. ఎవరా లక్ష్మీపతి అనేది గుర్తొచ్చిందా? లేదంటే మీకు ఇంకో క్లూ ‘అహ నా పెళ్లంట’ లక్ష్మీపతి. ఓహో ఆ పరమ పీనాసా అంటారా. ఆ ఆయనే. లక్ష్మీపతి గురించి మనం అనుకున్నదాని కంటే బాగా అరగుండు బ్రహ్మానందం ఇంకా బాగా చెప్పగలరు అనుకోండి. ఆ పాత్రను ఇప్పటికీ గుర్తు చేసుకుంటున్నాం అంటే కారణం కోట శ్రీనివాసరావు. వరల్డ్ ఫేమస్ పిసినారి పాత్రలో కోటను ముందు అనుకోలేదని తెలుసా. అవును ‘అహ నా పెళ్లంట’ నిర్మాత డి.రామానాయుడు తొలుత ఆ పాత్రకు రావు గోపాలరావును అనుకున్నారట.
కానీ చిత్ర దర్శకుడు జంథ్యాల పట్టుబట్టి మరీ కోట శ్రీనివాసరావును తీసుకున్నారట. అసలు ఆ సినిమా టైమ్‌లో ఏం జరిగిందంటే? ఓసరా నేను చెన్నై వెళ్లడానికి కోట శ్రీనివాసరావు ఎయిర్ పోర్ట్‌కి వెళ్లారట. అయితే అప్పటికే ప్రముఖ నిర్మాత రామానాయుడు అక్కడ ఉన్నారు. కోటను చూసి ‘ఓసారి ఇటు రావయ్యా… నీకో విషయం చెప్పాలి’ అన్నారట. కోట ఆయన దగ్గరకు వెళ్లగానే ‘జంధ్యాలతో ఓ సినిమా అనుకుంటున్నాను. అయితే అందులో ఓ పాత్ర ఉంది.. అది సరిగ్గా పండితే సినిమా చాలా బాగా ఆడుతుంది. లేకపోతే ఏమౌతుందో చెప్పలేం’ అన్నారట. ఆ పాత్ర కోసం నేను రావు గోపాలరావు అనుకుంటున్నాను అని కూడా చెప్పారట.
ఈ విషయం నాకెందు చెబుతున్నారు అని కోట అనుకుంటుండగా… ‘జంథ్యాల అయితే నీతోనే వేయిస్తా అంటున్నాడు’ అని చెప్పారట. ఆ తర్వాత రామానాయుడు అడిగినట్లు 20 రోజుల కాల్‌షీట్లు ఇచ్చారట కోట. ఆ తర్వాత సినిమా ఎంత విజయం సాధించిందో, ఆ పాత్ర ఎంత క్లిక్ అయ్యిందో కొత్తగా చెప్పక్కర్లేదు. ఒకవేళ రావు గోపాలరావు ఆ పాత్ర చేసుంటే ఎలా ఉంటుందో తెలియదు కానీ, కోట చేయడం మాత్రం అద్భుతం అనే చెప్పాలి. జంథ్యాల మాటకు రామానాయుడు విలువిచ్చి తీసుకున్నారు కాబట్టి కోట.. లక్ష్మీపతి అయ్యాడు. లేదంటే రావు గోపాలరావు అయ్యేవారన్నమాట.