కొన్ని నెలల క్రితం ఒకసారి ప్రముఖ వ్యాపారవేత్త మహీంద్రా గ్రూప్ ఛైర్మన్ ఆనంద్ మహీంద్రా, ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ మధ్య ‘ఎక్స్’ (అప్పట్లో ట్విటర్)లో ఆసక్తికర చర్చ జరిగింది. అప్పుడు అదంతా ఓ స్పెషల్ కారు గురించి. ఇప్పుడు ఆ కారు పేరు బుజ్జి. అప్పుడు చర్చ చూసి.. నాగ్ అశ్విన్ టీమ్‌తో ఆనంద్ మహీంద్రా ఓ కారు కోసం పని చేయబోతున్నారు అని తెలిసింది. దాంతో సినిమా, వ్యాపార వర్గాల్లో ఆసక్తి కలిగింది.
ఇప్పుడు మరోసారి ఇద్దరి మధ్య ‘ఎక్స్’లో చర్చ జరిగింది. నాగ్ అశ్విన్‌ను చూస్తుంటే గర్వంగా ఉందంటూ ఆనంద్ మహీంద్రా పోస్ట్ పెట్టారు. గతంలో తన సాయం కోరుతూ నాగ్ అశ్విన్ పెట్టిన పోస్టు స్క్రీన్ షాట్‌ను షేర్ చేస్తూ.. ‘‘నాగ్ అశ్విన్, అతడి టీమ్ గొప్పగా ఆలోచించడానికి భయపడరు. వారిని చూస్తుంటే గర్వంగా ఉంది. అధునాతన వాహనాలు తయారు చేయడంలో ‘కల్కి’ చిత్ర బృందానికి చెన్నైలోని ‘మహీంద్రా రీసెర్చ్ వ్యాలీ’ టీమ్ సహాయపడింది’’ అని రాసుకొచ్చారు.
‘బుజ్జి’ రెండు మహీంద్రా ఇ- మోటర్లతో నడుస్తుందని, జయం ఆటోమోటివ్స్ టీమ్ కూడా ఈ వెహికల్ రూపొందించడంలో భాగమైంది అని ఆనంద్ మహీంద్రా తెలిపారు. దీనికి నాగ్ అశ్విన్ స్పందిస్తూ.. ‘అసాధ్యం అనుకున్న కలను సుసాధ్యం చేశారు’ అంటూ థాంక్స్ చెప్పారు. దానికి మరోసారి ఆనంద్ మహీంద్రా రిప్లై ఇస్తూ ‘కలలు కనడం మానొద్దు’ అని రాసుకొచ్చారు.
ప్రభాస్ (Prabhas) హీరోగా నాగ్ అశ్విన్ (Nag Ashwin) తెరకెక్కించిన ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD) సినిమా సైన్స్ ఫిక్షన్ నేపథ్యంలో రూపొందింది. ఇతిహాసాలతో ముడిపడిన ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan) , కమల్ హాసన్ (Kamal Haasan) , దీపికా పదుకొణె (Deepika Padukone), దిశా పటానీ (Disha Patani) కీలక పాత్రలు పోషించారు. బుజ్జి అనే కారు ఈ సినిమాలో కీలకం, ఆసక్తికరం కూడా. ఈ పాత్రకు కీర్తి సురేశ్ (Keerthy Suresh) వాయిస్ ఇచ్చింది. ఇక ఈ సినిమా జూన్ 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.