Anasuya: ఇంటర్వ్యూ : ‘పెదకాపు -1’ సినిమా గురించి అనసూయ చెప్పిన ఆసక్తికర విషయాలు

  • September 22, 2023 / 09:15 PM IST

శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ‘పెదకాపు -1’ అనే సినిమా రాబోతున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 29న ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర పోషించిన అనసూయ చెప్పిన ఆసక్తికర విషయాలు మీకోసం :

ప్ర) ‘పెదకాపు 1’ లో మీ పాత్ర ఎలా ఉండబోతుంది ?

అనసూయ: ఇందులో నాది చాలా ఇంపార్టెంట్ రోల్. చాలా ఇంపాక్ట్ ఫుల్ గా ఉంటుంది. ఇందులో నా పేరు నాకు చాలా కొత్తగా అనిపించింది. చాలా నచ్చింది. ఇప్పుడు చెప్పలేను.. సినిమా రిలీజ్ అయ్యాక అందరి మైండ్లో ఆ పేరే మెదులుతుంది అని చెప్పగలను.

ప్ర) రంగమ్మత్త లాంటి పాత్ర మళ్ళీ రాలేదే అనే ఫీలింగ్ మీకు ఏమైనా కలిగిందా?

అనసూయ: రంగస్థలంలో రంగమ్మత్తగా నన్ను ఎక్కువగా గుర్తు పెట్టుకున్నారు. ఆ పాత్ర ఒక బార్ ని సెట్ చేసింది. అయితే దానిని మరిపించేలా ఇంకా మంచి పాత్రలు చేయాలని నేను కష్టపడుతున్నాను. ‘విమానం’లో సుమతి పాత్రలో విభిన్నంగా కనిపించాను. ఇప్పుడు పెదకాపులో చేసిన పాత్ర కూడా చాలా బలంగా, వైవిధ్యంగా ఉంటుంది. పెదకాపు చాలా రా ఫిల్మ్. నా పాత్రలో కొన్ని బోల్డ్ డైలాగ్స్ కూడా ఉంటాయి.

ప్ర) కథ పరంగా ‘రంగస్థలం’ సినిమాకి, ‘పెదకాపు -1’ కి ఏమైనా సిమిలారిటీస్ ఉంటాయా?

అనసూయ: నేను ఒక సిమిలారిటీ(నవ్వుతూ)..గోదావరి జిల్లాల నేపథ్యం అనేది కూడా ఒక సిమిలారిటీ.మిగిలింది మీరు సినిమా చూసి తెలుసుకోవాలి.

ప్ర) ఈ సినిమాకి మిమ్మల్ని డీవోపీ ఛోటా కె నాయుడు గారు రిఫర్ చేశారని చెప్పారు నిజమేనా?

అనసూయ: అవును. సందీప్ కిషన్ ‘మైఖేల్’ సినిమాలో చేశాను. ఆ సినిమా చూసి ఛోటా గారు ఫోన్ చేశారు. ‘’నీకొక ఫోన్ వస్తుంది. ఆ పాత్ర చేయమని చెప్పను కానీ కన్సిడర్ చేయ్’’అని అన్నారు. శ్రీకాంత్ గారు ఈ కథ చెప్పిన తర్వాత తప్పకుండా ఇలాంటి మంచి సినిమాలో భాగం కావాలని డిసైడ్ అయ్యాను. ‘రంగమార్తాండ’ ప్రమోషన్స్ లో ఉండగా ఈ కథ విన్నాను.

ప్ర) శ్రీకాంత్ అడ్డాల గారు కథ చెప్పినప్పుడు ఎలాంటి ఫీలింగ్ కలిగింది?

అనసూయ: శ్రీకాంత్ గారంటే .. సీతమ్మ వాకిట్లో, బ్రహ్మోత్సవం.. ఇలాంటి హోమ్లీ ఇంప్రెషన్ ఉంటుంది. అలాంటి శ్రీకాంత్ గారు పెదకాపు లాంటి కథ చెప్పినప్పుడు షాక్ అయ్యా. దర్శకుడిగా ఆయనకు ఇది చాలా డిఫరెంట్ ట్రాన్స్ఫర్మేషన్ అనొచ్చు.

ప్ర) శ్రీకాంత్ గారు ఇందులో విలన్ గా చేశారు.. ఎలా అనిపించింది?

అనసూయ: నిజంగా ఇది బిగ్ సర్ ప్రైజ్. కథ విన్నప్పుడు శ్రీకాంత్ గారు నటిస్తున్నారని నాకు తెలీదు. నిజానికి ప్రతి దర్శకుడిలో ఒక నటుడు ఉంటారు. ఇలా చేయాలని మొదట చేసి చూపించేది దర్శకులే. శ్రీకాంత్ గారు చాలా యీజ్ తో ఆ పాత్రని చేశారు. ప్రేక్షకులు కూడా సర్ప్రైజ్ అవుతారని అనుకుంటున్నాను.

ప్ర) కొత్త హీరో విరాట్ కర్ణ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది ?

అనసూయ: విరాట్ కర్ణ ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. షూటింగ్ లో టైంలో అతనికి గాయాలు కూడా అయ్యాయి. అతను చాలా అమాయకుడు. ఇందులో తన పాత్ర చాలా ఫెరోషియస్ గా ఉంటుంది. ట్రైలర్ చూసిన చాలా మంది తనని ప్రభాస్ గారి తో పోల్చారు. ప్రభాస్ గారంటే విరాట్ కి చాలా ఇష్టం. విరాట్ పరిశ్రమలో తనకంటూ ఒక ప్రత్యేక ముద్ర వేసుకుంటాడనే నమ్మకం ఉంది.

ప్ర) హీరోతో మీకు కాంబినేషనల్ సీన్స్ ఉంటాయా?

అనసూయ: ఉంటాయి..! హీరోతో అనే కాదు.. సినిమాలో ఉన్న నటీనటులందరితో నాకు కాంబినేషనల్ సీన్స్ ఉంటాయి.

ప్ర) నిర్మాతలు గురించి ?

అనసూయ: ద్వారక క్రియేషన్స్ నాకు ఇష్టమైన నిర్మాణ సంస్థలలో ఒకటి. మిర్యాల రవీందర్ రెడ్డి గారు ఎక్కడా రాజీపడకుండా అత్యున్నత ప్రొడక్షన్ వాల్యూస్ తో ఈ చిత్రాన్ని భారీగా నిర్మించారు.నేను పారితోషికం విషయంలో అయినా కాంప్రమైజ్ అవుతాను కానీ నన్ను సరిగ్గా ట్రీట్ చేయకపోతే చాలా ఇబ్బంది పడతాను. అందుకే రవీందర్ రెడ్డి గారి నిర్మాణంలో చేయడం బాగా అనిపించింది.

ప్ర) మీరు చిన్న సినిమాల ప్రమోషన్స్ కి రారు అనే కంప్లైంట్ ఉంది.. దాని గురించి మీరేమంటారు?

అనసూయ: వాస్తవానికి ప్రమోషన్స్ కే నేను (Anasuya) రాను. నా దృష్టిలో చిన్న సినిమా, పెద్ద సినిమా అనేది ఉండదు. అది ప్రేక్షకులు డిసైడ్ చేస్తారు. నా వరకు ప్రమోషన్స్ కి వస్తే ఎంత మాట్లాడాలి, ఎక్కడ ఆపాలి, ఎవరిని పొగడాలి అనేది తెలీదు. దాని వల్ల అనవసరంగా వార్తల్లో నిలవడం ఎందుకు అని..! ఇప్పుడంటే నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను(నవ్వుతూ)

Read Today's Latest Interviews Update. Get Filmy News LIVE Updates on FilmyFocus